జననేతకు ఘన స్వాగతం | Sakshi
Sakshi News home page

జననేతకు ఘన స్వాగతం

Published Tue, Sep 25 2018 6:25 AM

Vizianagaram People Welcomes YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం , శృంగవరపుకోట నెట్‌వర్క్‌: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం విశాఖ జిల్లా జంఘాలపాలెం నుంచి విజయనగరం జిల్లా చింతలపాలెం గ్రామంలో అడుగుపెట్టారు. ఉదయం 9.50 గంటలకు జిల్లాలో అడుగిడిన జననేతకు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. చింతలపాలెం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మొక్కను నాటిన జగన్‌మోహన్‌రెడ్డి దేశపాత్రునిపాలెం వరకు 1.5కి.మీ మేర యాత్ర సాగించారు. భోజన విరామ అనంతరం మధ్యాహ్నం 3.30గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి దేశపాత్రునిపాలెం వద్ద మూడు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన స్మారక స్థూపాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మంగళపాలెం మీదుగా కొత్తవలస చేరుకున్నారు. జననేతకు అడుగడుగునా అఖండ స్వాగతం లభించింది. బాణసంచా కాల్చుతూ సాంస్కృతిక కళారూపాలతో అలరిస్తూ స్వాగతం పలికారు.

మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, విశాఖ జిల్లా పార్లమెంటరీ జిల్లా కో ఆర్డినేటర్‌ ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, ప్రజా సంకల్ప యాత్ర ప్రొగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, జిల్లా రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి మజ్జి శ్రీనివాసరావు, రాజంపేట మాజీ ఎంపీ మిధున్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల నియోజకవర్గ కన్వీనర్‌ పెనుమత్స సాంబశివరాజు, ఎస్‌.కోట కన్వీనర్‌ కడుబండి శ్రీనివాసరావు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడుబాబు, రొంగలి జగన్నాధం, మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదరామారావు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, డీసీసీబీ చైర్మన్‌ మరిశర్ల తులసి, జిల్లా ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ పి.జైహింద్‌కుమార్, గుడివాడ రాజేశ్వరరావు, ఇందుకూరి రఘురాజు, వేచలపు చినరామునాయుడు, కె.వెంకటరెడ్డి తదితరులు జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. 

జగన్‌ వస్తేనే పింఛన్‌... 
జగన్‌ వస్తేనే నాకు పింఛన్‌ వస్తుంది. నా వయసు 70 సంవత్సరాలు. ఈ వయసులో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన పింఛన్‌ నిలిపేశారు. అధికారుల చుట్టూ తిరిగినా పింఛన్‌ పునరుద్ధరించలేదు. నా బాధ జగన్‌కు చెప్పేందుకే వచ్చాను. జగన్‌ సీఎం అయితేనే మా కష్టాలు తీరుతాయి. –గుల్లిపల్లి సూరీడమ్మ, భీమాళి

జగనన్న కష్టం ఊరికే పోదు...
మా అభిమాన నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొడుకు జగన్‌ను చూసేందుకు వచ్చాం. మాది భీమాళి. సుమారు 400మంది మహిళలం గ్రామం నుంచి ఆటోలు కట్టించుకుని వచ్చాం. ఆ బాబుని చూసాం. చాలా ఆనందంగా ఉంది. జగన్‌తో పాటు నడిచాం. మా అందరి కోసం ఎండనక, వాననక ఆ బాబు పడుతున్న కష్టం ఊరికే పోదు. –చప్ప గంగా భవాని, భీమాళి 

ఆ ఆప్యాయతను మరువలేం...
అవ్వా.. బాగున్నావా... అని ఆప్యాయంగా పలకరించాడు. ఆ బాబు తండ్రి ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నాం. మాకు తలదాచుకోడానికి నీడనిచ్చిన మహానుభావుడు వైఎస్‌. ఆయన కొడుకు జగన్‌బాబుని చూసేందుకే ఎండైనా లెక్క చేయకుండా వచ్చాం.  ఆ బాబుని చూసాం. చాలా ఆనందంగా ఉంది. మా కష్టాలు తీర్చేందుకే జగన్‌ ఉన్నాడు. ఆ బాబు సీఎం అయితేనే మా కష్టాలు తీరుతాయి.  –బోని గురమ్మ, కొత్తవలస 

Advertisement

తప్పక చదవండి

Advertisement