అటాక్‌ చేస్తోంది.. స్ట్రోక్‌ | Sakshi
Sakshi News home page

అటాక్‌ చేస్తోంది.. స్ట్రోక్‌

Published Sun, Oct 29 2017 11:42 AM

today World Stroke Day

స్ట్రోక్‌ అంటే..
మానవ శరీరంలోని మెదడుకు రక్తాన్ని అందించే నాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోవడం లేదా మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడమే స్ట్రోక్‌. దీని కారణంగానే మరణాలు, వైకల్యాలు సంభవిస్తున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. 

ఎందువల్ల వస్తుంది
బ్రెయిన్‌  స్ట్రోక్‌ ఏ వయసు వారికైనా, ఏ సమయంలోనైనా వచ్చే అవకాశాలున్నాయి. స్ట్రోక్‌ రావడానికి రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ఊబకాయం, ధూమపానం, మద్యం సేవించడం ప్రధాన కారణాలుగా ఉన్నాయని వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ తెలుపుతోంది. ఐతే స్ట్రోక్‌ అనుమానం కలిగిన వెంటనే కనీసం 3 గంటల లోపు సంబంధిత వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణ నష్టం, శాశ్వత అంగవైకల్యం నుంచి రక్షించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆధునిక యుగంలో కూడా మానవుడు అనేక రకాల వ్యాధులకు గురవుతూనే ఉన్నాడు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మానవుణ్ణి వ్యాధులకు దూరం చేసే పరిజ్ఞానం మాత్రం అందుబాటులోకి రాలేదు. వచ్చిన వ్యాధులకు మందులు కనుగొంటూ ఉండగా కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని వ్యాధులు దీర్ఘకాలికంగా బాధిస్తుండగా మరికొన్ని వ్యాధులు క్షణాల్లో ప్రాణాలను హరించేస్తున్నాయి. అటువంటి వాటిలో అత్యంతప్రమాదకరమైనది, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మరణాల్లో 2వ అతిపెద్ద మృత్యుకారకంగా స్ట్రోక్‌ ( పక్షవాతం)ను పరిగణిస్తున్నారు. అంటే పక్షవాతం పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

భయంకరమైన నిజాలు..
స్ట్రోక్‌ వల్ల సమాజం ఎంతగా నష్టపోతోందో వరల్డ్‌ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ కొన్ని లెక్కల్లో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.70 కోట్ల మంది స్ట్రోక్‌ బారిన పడుతున్నారని, ప్రతి ఆరుగురు వ్యక్తుల్లో ఒక్కరైనా వారి జీవిత కాలంలో స్ట్రోక్‌కు గురౌతున్నారని తెలిపింది. దీని కారణంగా ప్రతి 6 సెకన్లకు ఒకరు చనిపోతున్నారని ఆ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక జిల్లాలో పరిశీలిస్తే నెలకు సుమారు 100 మంది స్ట్రోక్‌కు గురౌతున్నారని జిల్లా వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. వారిలో కనీసం ఇరవై మంది మరణిస్తుండగా సుమారు 50 మంది శాశ్వత అంగవైకల్యానికి గురౌతున్నారని, సకాలంలో స్పందించి వైద్యానికి వచ్చిన వారు కేవలం 30 శాతం మంది మాత్రమే నమోదౌతున్నారని వైద్య శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. 

ముప్పును ముందుగానే తెలుసుకోండి..
అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటివి ఉన్నవారు, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నవారు వాటిని నియంత్రించుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి 10 స్ట్రోక్‌ కేసుల్లో ఒకటి కంటే ఎక్కువ పొగతాగేవారే ఉన్నారు. క్రమం తప్పిన గుండెవేగాన్ని వైద్యులను సంప్రదించడం ద్వారా నియంత్రించుకోవచ్చు. శరీర బరువును శరీర ఎత్తుకు, వయసుకు తగిన నిష్పత్తిలో ఉంచుకోవడం కూడా స్ట్రోక్‌కు దూరంగా ఉండడానికి సహకరిస్తుంది.

ఆరోగ్యశ్రీలో వైద్యం లేదు..
జిల్లాలో స్ట్రోక్‌కు సంబంధించిన న్యూరాలజిస్టులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 15 మంది, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సుమారు 100 మంది అందుబాటులో ఉన్నారు. స్ట్రోక్‌కు గురైన వారిని వెంటనే గుర్తించి రక్తనాళాల్లో కట్టిన గడ్డలను కరిగించడానికి కొత్తగా ఇంజక్షన్లు వచ్చాయి. ట్రాంబోలైటిక్‌ ఇంజక్షన్ల ద్వారా రక్తంలో కట్టిన గడ్డలను కరిగించవచ్చు. ఐతే ఈ ఇంజక్షన్‌ గతంలో రూ. 70 వేల వరకూ ఖరీదు ఉండగా ప్రస్తుతం రూ. 30 వేలకు తగ్గింది. ఇంతటి ఖరీదైన ఇంజక్షన్‌ను రోగులకు వెంటనే ఇవ్వడానికి వీలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబా టులో ఉంచకపోగా కనీసం ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స అందించే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించలేదు. 

ఫాస్ట్‌గా (ఎఫ్‌.ఏ.ఎస్‌.టి) ఉండండి.. 
స్ట్రోక్‌ వల్ల కలిగే నష్టాలను నివారించడానికి ప్రజలంతా ఫాస్ట్‌గా ఉంటే సరిపోతుంది. ఫాస్ట్‌ అంటే ఫేస్, ఆర్మ్, స్పీచ్, టైం. ముఖంలో పక్షవాతానికి సంబంధించి వస్తున్న మార్పులు, చేతులు, కాళ్లు పనిచేయడంలో వచ్చే మార్పులు, నోటి మాటలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అప్రమత్తంగా సమయానికి వైద్యులను సంప్రదించడమే ఫాస్ట్‌గా ఉండడం. నగర, పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి సమయానికి వైద్యం అందే అవకాశం ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి సమయానికి వైద్యం అందక ప్రాణ, శాశ్వత అంగవైకల్య నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారే మరింత అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్‌ బి.సాయి సందీప్, న్యూరాలజిస్టు, రమేష్‌ హాస్పిటల్‌

Advertisement
Advertisement