పర్యావరణ భక్షకులు..! | Sakshi
Sakshi News home page

పర్యావరణ భక్షకులు..!

Published Thu, Oct 4 2018 2:03 PM

Sand Smuggling In Prakasam - Sakshi

ప్రకాశం, కొండపి: ప్రకృతి సంపద క్షీణిస్తోంది. డబ్బే పరమావధిగా అక్రమార్కులు అమూల్యమైన ఇసుక సంపదను దోచేస్తున్నారు. కొండపి మండలంలోని ముసి, అట్లేరుల్లో తటాకులపాలెం నుంచి ఉప్పలపాడు వరకు వివిధ గ్రామాల పరిధిలో ఇసుక రవాణా నిరంతరం కొనసాగుతోంది. ఇలా ప్రతి సంవత్సరం ముసి, అట్లేరుల్లో కోటి రూపాయలకు పైగా ఇసుకాసురుల జేబుల్లోకి తరలిపోతున్నాయి. ఈ అక్రమ రవాణాలో అధికార పార్టీకి చెందిన సానుభూతిపరుల హవా నడుస్తోంది. గృహ నిర్మాణాల కోసం అంటూ రెవెన్యూ శాఖ నుంచి ఒకటి రెండు ట్రిప్పులకు అనుమతులు తీసుకుని ఆ తర్వాత వందలాది ట్రిప్పులను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు.  ప్రధానంగా తాటాకులపాలెం, పోలిరెడ్డిపాలెం, ముక్కోడిపాలెం, కొండపి గ్రామాల్లోని అట్లేరు పరిధిలో రాత్రీ పగలు తేడాలేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు. అదేవిధంగా ముసి పరిధిలో అనకర్లపూడి, పెరిదేపి, ముప్పవరం, వెన్నూరు, చినవెంకన్నపాలెం గ్రామాల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక ట్రాక్టరు ట్రిప్పు వెయ్యి నుంచి రెండు వేలరూపాయల వరకు పలుకుతోంది. ముసి, అట్లేరు పరిధిలో ఉన్న పట్టా భూముల్లో సైతం రాత్రి సమయాల్లో తవ్వకాలు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తమ పట్టా భూముల్లో ఇసుక తరలిస్తున్నట్లు వెన్నూరు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇసుక దందా ఆగలేదు.

సిమెంటు బ్రిక్స్‌ కోసంవందలాది ట్రిప్పులు
కొండపిలో ఐదు సిమెంటు బ్రిక్స్‌ కార్ఖానాలు ఉన్నాయి. ఒక్కో కార్ఖానాకు రోజుకు 10 ట్రిప్పుల వంతున 50 ట్రిప్పుల ఇసుక వినియోగిస్తున్నారు. అంటే నెలకు రెండువేల ట్రిప్పులు వరకు వాడుతున్నారు. అట్లేరులో ఇసుక ఖాళీ కావటానికి ఈ అనుమతులులేని బ్రిక్స్‌ కార్ఖానాలే అని స్థానికులు చెబుతున్నారు. ప్రజలందరికీ చెందిన ప్రకృతి సంపదను కేవలం నలుగురు ఐదుగురు తమ స్వార్థానికి వినియోగించుకుంటున్నారు. సిమెంటు ఇండస్ట్రీ నిర్వాహకులు ముందుగానే కొంతమంది రెవెన్యూ, పోలీస్‌శాఖ సిబ్బందితో మాట్లాడుకుని వారినికి ఒకసారి ఒక్క రాత్రిలోనే 50 ట్రిప్పుల ఇసుకను డంపింగ్‌ చేయించుకుంటున్నారు. ఫ్లైయాష్‌ కంటే ఇసుక ధర సగానికి సగం ధర తగ్గి రావటంతో సిమెంటు బ్రిక్స్‌ తయారీదారులు ఇసుకను వాడుతున్నారు.

నిఘాపై నీలి నీడలు
అట్లేరు, ముసి పరీవాహక ప్రాంతాల్లోని ఇసుకను అక్రమంగా తరలించకుండా గతంలో ఆయా గ్రామాల్లోని వీఆర్‌ఏలను నియమించారు. ఎవరైనా అక్రమంగా ఇసుక ఎత్తుతుంటే రెవెన్యూ అధికారులకు తెలియజేసి కట్టడిచేసేవారు. అదే విధంగా పోలీసులు సైతం నిఘాపెట్టేవారు. ఇప్పుడు మాత్రం ఎవరూ పట్టించుకోవడంలేదు.

నీటి గండం
ఆయా గ్రామాల పరిధిలోని ముసి, అట్లేరుల్లో ఇసుక 10 అడుగుల మేర తవ్వడంతో భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ఇసుక అయిపోవడంతో కింది భాగంలో మట్టి బయటపడుతోంది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన రక్షిత మంచినీటి పథకాలు నీరు లేక అటకెక్కాయి. రైతులు సైతం పంటలు సాగు చేసుకోవటానికి సాగు నీరు సైతం లేదు. బోర్లు సైతం ఎండిపోయి రైతులు పశువులకు పశుగ్రాసం సైతం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అక్కమార్కుల స్వార్థ లాభాపేక్ష కోసం ఇసుక ఎత్తి సొమ్ము చేసుకుంటూ ఆయా గ్రామాల పరిధిలోని 30 వేల మంది జనాభాను తాగు సాగు నీరు కోసం ఇక్కట్లకు గురిచేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ కె. చిరంజీవిని వివరణ కోరగా అక్రమ ఇసుక రవాణా తన దృష్టికి వచ్చిందని సిమెంటు బ్రిక్స్‌కు అనుమతులు సైతం లేవని ఇసుక ఎత్తే అక్రమార్కులను కట్టడి చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement