గ్రామీణ రోడ్లకు గ్రహణం | Sakshi
Sakshi News home page

గ్రామీణ రోడ్లకు గ్రహణం

Published Thu, May 22 2014 2:01 AM

Rural areas roads construction

సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. మరీ ముఖ్యంగా రోడ్ల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రజల సౌకర్యార్థం అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు వీలుగా రోడ్లను ఏర్పాటు చేస్తామని పాలకులు చెబుతున్నా.. ప్రస్తుతం ఆచరణ సాధ్యం కావడం లేదు. రాష్ట్ర విభజన కారణంగా రూరల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఎఫ్), మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ (ఎంఆర్‌ఆర్), 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో ఈ పథకాల కింద ఏటా నిధులు విడుదలయ్యేవి. ఆర్‌డీఎఫ్ ద్వారా ఒక్కో నియోజకవర్గానికి రూ.6 కోట్ల వరకు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. రఘువీరారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తన పలుకుబడి ఉపయోగించి కళ్యాణదుర్గం, మడకశిర నియోజకవర్గాలకు ఈ మేరకు నిధులు విడుదల చేయించుకున్నారు. మిగిలిన నియోజకవర్గాలకూ అదే రీతిలో విడుదల చేయించాల్సి ఉన్నా.. మొన్నటి వరకు మంత్రులుగా ఉన్న రఘువీరారెడ్డి, శైలజానాథ్ పెద్దగా పట్టించుకోలేదు. ఎంఆర్‌ఆర్ కింద ప్రతియేటా జిల్లాకు దాదాపు రూ.100 కోట్ల  నిధులు మంజూరయ్యేవి. ప్రస్తుతం ఆ పథకం నుంచి నిధుల విడుదలకు బ్రేక్ పడింది.
 
 ఇక 13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు పదే పదే ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నా ఫలితం కన్పించడం లేదు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ రోడ్ల మరమ్మతులు, ఇతరత్రా పనుల కోసం విడుదల కావాల్సిన నిధుల్లో దాదాపు రూ.250 కోట్లకు బ్రేక్ పడింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధుల మంజూరు చాలా కష్టంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
 
 జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని జూన్ 2లోపే నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరుతున్నారు. ముఖ్యంగా కదిరి, హిందూపురం, రాయదుర్గం, గుంతకల్లు, పెనుకొండ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు సరైన రహదారులు లేవు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.
 

Advertisement
Advertisement