అడుగడుగునా దగా | Sakshi
Sakshi News home page

అడుగడుగునా దగా

Published Thu, Jan 3 2019 6:46 AM

People Shatring Their Problems to YS Jagan - Sakshi

శ్రీకాకుళం : నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో అడుగడుగునా దగాపడుతున్నామని పలువురు పేదలు రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉన్నవారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయకుండా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో బుధవారం జరిగిన ప్రజా సంకల్పయాత్రలో పలు సమస్యలను జననేత వద్ద విన్నవించారు.– ప్రజాసంకల్పయాత్ర బృందం

 పరిశోధనకు సహకరించాలి
నేను పదేళ్లుగా ఆక్సిజన్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసే విధానంపై పరిశోధనలు చేస్తున్నాను. దీని ద్వారా తక్కువ ధరకే (యూనిట్‌కు 75 పైసలు) విద్యుత్‌ ఉత్పత్తి చేసే వీలుంది. దీనిని అమలు చేయడానికి ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు.ఈ పరిశోదన నిరూపించడానికి మీరు అధికారంలోకి రాగానే నాకు అవకాశం కల్పించాలి.– మావుడుపల్లి ధర్మారావు, హరిపురం, మందస

భూములు అప్పగించాలి
మేము నిరుపేదలం. 20 మంది గ్రామస్తులం దేవాదాయ శాఖ భూమి 2.5 ఎకరాలను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. భూమి మాకు అప్పగించమని అనేక సార్లు అధికారులు చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వ రేటు చెల్లించమంటున్నారు. మాకు భూములు అప్పగించాలి. లేదంటే నామమాత్రపు రేటు వాయిదా పద్దతుల్లో చెల్లించే అవకాశం కల్పించాలి.           – తత్తి సరస్వతి, బైరిసారంగిపురం, మందస

జన్ని కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలి
జన్ని కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలి. శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది మండలాల్లో జన్ని కులస్తులు ఉన్నారు. అమ్మవారికి పూజలు చేస్తూ, భిక్షమెత్తుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నాం. దేవాలయాల భూములు కూడా మా అధీనంలో లేవు. ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఓసీ కేటగిరీలో ఉండటంతో ఉద్యోగావకాశాలు కష్టంగా మారాయి. మీరు అధికారంలోకి రాగానే జీవన పరిస్థితులపై  సర్వే చేపట్టి వెనుకబడిన మా కులాన్ని బీసీల్లో చేర్చాలి.             – జన్ని పద్మావతి, హరిపురం, మందస

తాగునీటికి పాట్లు
పాలకులు అబద్ధపు మాటలతో కాలయాపన చేస్తున్నారు. ఇంతవరకు మా కాలనీకి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు సౌకర్యం కూడా లేదు. కనీస వసతులు లేక చాలా అవస్థలు పడుతున్నాం. జగనన్న అధికారంలోకి వస్తేనే మా సమస్యలు తీరుతాయి.– పి.జ్యోతి, గున్నయ్యనగర్, హరిపురం.

దరఖాస్తులే మిగిలాయి..
భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇల్లు మంజూరు చేయాలని ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చి మా కష్టాలు తీర్చాలి.– ఎస్‌.జానకమ్మ, ఎస్సీ కాలనీ, హరిపురం

Advertisement
Advertisement