కదిలిస్తే కన్నీళ్లే.. | Sakshi
Sakshi News home page

కదిలిస్తే కన్నీళ్లే..

Published Mon, Dec 18 2017 6:17 AM

People sharing there sorrows to ys jagan - Sakshi

జననేతకు తమ కష్టాలు చెప్పుకోవాలని, ఆయనకు తమ గోడు చెప్పుకుంటే ఊరట కలుగుతుందని పెద్ద సంఖ్యలో మహిళలు పాదయాత్ర సాగుతున్న ప్రాంతానికి తరలి వచ్చారు. రావులచెరువులో జగన్‌ వారితో ముఖాముఖి మాట్లాడటంతో సమస్యలు చెప్పుకోవడానికి పోటీ పడ్డారు. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ.  – ధర్మవరం

రేషన్‌కార్డు తొలగించారయ్యా..
మా తమ్ముడికి రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదు. డ్వాకా రుణం మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. ఆ తర్వాత రూ.10 వేలు అప్పుగా ఇస్తామన్నారు. తీరా రూ.3 వేలు మాత్రమే ఇచ్చారు. రాజశేఖరరెడ్డి హయాంలో అర్హులందరికీ పింఛన్లు ఇచ్చారు. ఇప్పుడు పది మందికి తొలగించి ఒక్కరికే ఇస్తున్నారు. నువ్వు వైఎస్సార్‌సీపీ అంటూ రేషన్‌కార్డు కూడా తొలగించారు.
– లక్ష్మిదేవి, రావులచెరువు, ధర్మవరం

నమ్మించి మోసం చేశారన్నా..
రుణ మాఫీ చేస్తామని రూ.3 వేలు అప్పుగా ఇచ్చారు. ఎన్నికలప్పుడు అదిచేస్తా.. ఇది చేస్తానని నమ్మించారు. ఒక్కటీ చేయలేదు.  ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
–  అరుణమ్మ, ధర్మవరం

డ్వాక్రా సొమ్ము కాజేశారు..
సార్‌.. మాది ధర్మవరం. టౌన్‌ సమాఖ్యలో వైఎస్సార్‌సీపీ వారిని ఒక్కరినీ రానివ్వరు. అందరూ తెలుగుదేశం వారే ఉండాలట. ఏదైనా అడిగితే దౌర్జన్యం చేస్తారు. సమాఖ్యలో రూ.20 లక్షలు స్కాం జరిగింది సార్‌. భావమ్మ అనే ప్రెసిడెంటే రూ.20 లక్షలు తినేసింది. డబ్బులు ఎక్కడికి పోయాయని అడిగితే ఆర్డీవోగాని, కమిషనర్‌గాని, టీపీవోగాని సమాధానం చెప్పడం లేదు. – గీతాకుమారి, సాయినగర్, ధర్మవరం

బియ్యం పంపిణీలోనూ కోత
మా ఊళ్లో స్టోర్‌ బియ్యం కిలో తక్కువ ఇస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే సమాధానం చెప్పడం లేదు. మా ఊళ్లో చాలా మంది కార్డులు తొలగించారు. బీదాబిక్కికి ఇచ్చే బియ్యం కూడా టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు సార్‌. – స్రవంతి, ఎంపీటీసీ సభ్యురాలు, రావులచెరువు.

రుణ మాఫీ లేదు.. పింఛన్‌ ఇవ్వలేదు
నాలుగేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అప్పటి నుంచి అడుగుతున్నా.. వైఎస్సార్‌సీపీ అంటూ పింఛను ఇవ్వలేదు. పొదుపు సంఘంలో రుణాలు మాఫీ కాలేదు. నేను, నా కొడుకు ఉన్నాం. బియ్యం కూడా ఇవ్వడం లేదు. పది వేలు అప్పుగా ఇస్తామని చెప్పి రూ.3 వేలే ఇచ్చారు.       – అరుణ, రావులచెరువు\

అర్హత ఉన్నా పింఛన్‌ లేదు..  
నాలుగేళ్లయింది. అర్హత ఉన్నప్పటికీ పింఛన్‌ ఇవ్వలేదు. బతికేకి కూడా ఆధారం లేదు. చంద్రబాబు వచ్చినప్పటి నుంచి ఇక్కట్లే. పావలా వడ్డీలేదు, రుణాలు మాఫీ కాలేదు సార్‌. రెండు రూపాయలు వడ్డీపడతాంది. కట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్నాము.   అప్పులు మాత్రం తీరలేదు సార్‌. వడ్డీలకు వడ్డీ వేసి బ్యాంకు అధికారులు డబ్బులు కట్టించుకుంటున్నారు.  – చెన్నమ్మ, రావులచెరువు

అక్రమంగా జైలుకు పంపించారన్నా..
అన్నా.. 2014 వరకు మాకు ఏ ఇబ్బందులు లేవు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక మమ్ముల్ని ఇబ్బంది పెడుతున్నారు. బత్తలపల్లి మండలంలో 45 మంది ఆశావర్కర్లు ఉంటే దంపెట్ల గ్రామంలో ఉన్న ముగ్గురు ఆశా వర్కర్లు మాత్రమే వైఎస్సార్‌సీపీ అని మమ్ముల్ని తీసేశారు. మాకు రావాల్సిన జీతం ఇస్తేనే మేము ఉద్యోగానికి రాజీనామా చేస్తామని చెప్పడంతో మాపై అక్రమంగా కేసు పెట్టారన్నా. స్టేషన్‌ బెయిల్‌ ఇస్తామని చెప్పి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి 20 రోజులు రిమాండ్‌కు పంపారు. 20 రోజులు జైల్లో ఉండి వచ్చినాను సార్‌.. టీడీపీ నాయకులు అందరిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.
– అమరావతి, ఆశావర్కర్, దంపెట్ల

Advertisement

తప్పక చదవండి

Advertisement