అన్యమత ప్రచారకుడి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

అన్యమత ప్రచారకుడి అరెస్ట్

Published Fri, Oct 31 2014 12:04 AM

అన్యమత ప్రచారకుడి అరెస్ట్

కృష్ణా జిల్లాలో అదుపులోకి..: అర్బన్ ఎస్పీ
తిరుపతి/తిరుమల/విస్సన్నపేట:
తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన సుధీర్ మొండితోకను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాలో గురువారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి చెప్పారు. ఎస్పీ కథనం మేరకు.. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలను 2013 సెప్టెంబర్‌లో సమైక్యాంధ్ర బంద్ సమయంలో చిత్రీకరించినట్లు విచారణలో సుధీర్ తెలిపాడన్నారు. సుధీర్ తన తమ్ముడు సుకుమార్, మతబోధకులు జోసెఫ్, డేవిడ్, యేసురత్నంతో తిరుమల వచ్చి, ఘాట్‌రోడ్డులో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించారని, దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. గరుడసర్కిల్ వద్ద జరిగిన సంఘటనపై టీటీడీ సీవీఎస్‌వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలిపిరిలో మరో కేసు నమోదు చేశామన్నారు. ఈ నేరాన్ని అంగీకరిస్తూ తానే బాధ్యుడనని సుధీర్ తెలిపాడన్నారు. కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం పుట్రేల పంచాయతీ పరిధిలోని రామానగరం గ్రామానికి చెందిన సుధీర్ 1980లో ఇమ్మానుయేల్ బాప్టిస్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాను స్థాపించి డెరైక్టర్‌గా ఉన్నట్లు చెప్పారు. మిగిలిన నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
 
నన్ను క్షమించండి..
ఏదో తెలియకుండా చేశానని ఇలాంటి తప్పులు మరెప్పుడూ చేయనని సుధీర్ మొండితోక పేర్కొన్నారు. డబ్బు కోసం ఈ పనిచేయలేదని, పవిత్ర పుణ్యక్షేత్రం అని ఇప్పుడే తెలిసిందని చెప్పారు. ఇంత పెద్ద గొడవ అవుతుందని తెలి యదని, దయ ఉంచి తనను వదలివేయమని మీడియా ఎదుట విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement