బస్సు నుంచి జారిపడి పెయింటర్ దుర్మరణం | Sakshi
Sakshi News home page

బస్సు నుంచి జారిపడి పెయింటర్ దుర్మరణం

Published Mon, Oct 20 2014 12:03 AM

బస్సు నుంచి జారిపడి పెయింటర్ దుర్మరణం - Sakshi

తెనాలి రూరల్/దుగ్గిరాల
 బస్సులో వెళుతున్న పెయింటర్ ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన సంఘటన నందివెలుగు-కంచర్లపాలెం గ్రామాల మధ్య ఆదివారం చోటుచేసుకుంది. ఘటన జరిగిన కొద్దిసేపటికే మృతదేహాన్ని ఘటనాస్థలం నుంచి తెనాలి జిల్లా వైద్యశాలకు పోలీసులు తరలించారు. దీనిపై మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్‌కు అధికారులు హామీఇవ్వడంతో నాలుగు గంటల అనంతరం విరమించారు.

వివరాలిలా ఉన్నాయి. దుగ్గిరాల దళితవాడకు చెందిన ఇల్లూరి రవీంద్రమోహన్‌కుమార్ (40) పెయింటింగ్ కార్మికుడిగా పనిచేస్తుంటాడు. ఉదయం తెనాలి వచ్చి మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో దుగ్గిరాల వైపు వెళ్లే బస్సు ఎక్కాడు. నందివెలుగు పల్లెవంతెన సమీపంలోకి రాగానే వెనుక తలుపు వద్ద నిలబడివున్న రవి జారిపడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెంటనే తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు.

మృతదేహాన్ని అంత తొందరగా తరలించాల్సిన అవసరం ఏముందని పోలీసులను ప్రశ్నించారు. ఘటనా స్థలం వద్ద మృతుడి భార్య స్వతంత్ర సొమ్మసిల్లి పడిపోయింది. ఆందోళనకు మద్దతుగా మాదిగ దండోరా నాయకులు అక్కడికి చేరుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, మృతుడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు నాలుగు గంటలపాటు తెనాలి-విజయవాడ రహదారిపై రాస్తారోకోకు దిగారు. తెనాలి వన్‌టౌన్, త్రీ టౌన్ సీఐలు ఎం.కమలాకరరావు, షేక్ అబ్దుల్‌అజీజ్, ఎస్‌ఐలు అనిల్‌కుమార్‌రెడ్డి, అస్సన్, శేషగిరిరావు ఆందోళనకారులతో చర్చలు జరిపారు.

ఆర్డీవో జి.నరసింహులు అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె భాగ్యశ్రీ తొమ్మిదో తరగతి , చిన్న కుమార్తె సంధ్యారాణి ఏడో తరగతి చదువుతున్నారు.ఇదిలావుండగారవితోపాటు మరో వ్యక్తి బస్సు ఎక్కాడని, వారిరువురూ మద్యం తాగివున్నారని కండక్టర్ పోలీసులకు తెలిపాడు. ఘటన జరిగినప్పటి నుంచి మరో వ్యక్తి కనపడకుండా పోయాడని, ఆ వ్యక్తిని తాను గుర్తించగలనన్నాడు. తెనాలి తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement