నేనో అట్టర్‌ ఫ్లాప్‌ ఎంపీని.. | Sakshi
Sakshi News home page

నేనో అట్టర్‌ ఫ్లాప్‌ ఎంపీని..

Published Fri, Sep 22 2017 1:02 AM

MP Resigns to the post: JC

అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా: జేసీ

సాక్షిప్రతినిధి, అనంతపురం:  అనంతపురం ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 25 లేదా 26న స్పీకర్‌ను కలసి రాజీనామా లేఖను సమర్పిస్తానని చెప్పారు. అనంతపురంలోని తన స్వగృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఫెయిల్డ్‌ ఎంపీ అని తన మనస్సాక్షి చెబుతోందన్నారు. తాను అట్టర్‌ ఫ్లాప్‌ ఎంపీనని, ఎంపీగా ఫెయిల్‌ అయినప్పుడు ఎందుకు ఆ పదవిలో కొనసాగాలని ప్రశ్నించారు. అందుకే రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు. సమావేశంలో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి ఫెయిల్‌ అయ్యాను. 9 నెలలుగా ప్రజలకు ఉపయోపడకుండా, వారికి ఏమీ చేయకుండా ఉండటం ఇదే తొలిసారి. ఫెయిల్‌ అయిన తర్వాత పదవిలో కొనసాగడం న్యాయం కాదు. రాజీనామా చేద్దామని స్పీకర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించా. అందుబాటులోకి రాలేదు.

అందుకే నేనే నేరుగా ఢిల్లీకి వెళ్లి స్పీకర్‌ను కలిసి రాజీనామా అందజేస్తా. నా కంటే బలమైన శక్తులు పని చేస్తున్నాయని అనుమానం వచ్చింది. అవి ఏంటో మీకు (అధిష్టానానికి) నేను చెప్పాలా? ఇప్పటికే చాలాసార్లు వారితో ఈ విషయాలు చర్చించా. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. ఆ బలమైన శక్తి ఏదో తెలుసుకోవాలి. ప్రస్తుతం నేను అనంతపురం, తాడిపత్రిలో ఒక రైలు నిలపలేకపోతున్నా. ఇక ఎంపీగా ఏం చేయగలను? తాడిపత్రికి తాగు, సాగు నీరు రప్పించుకోలేకపోతున్నా.. అందుకే తప్పు ఒప్పుకుంటున్నా. కేజ్రీవాల్‌ను చూసి ఇక్కడి నాయకులు ఆచరించాల్సిన అంశాలున్నాయి. నీటి పారుదల శాఖను కేంద్రం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉండకూడదు. ఇది మంచిది కాదు’’అన్నారు. తాను లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే రాజీనామా వ్యవహారంపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement