హౌసింగ్‌పై దద్దరిల్లిన కౌన్సిల్‌ | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌పై దద్దరిల్లిన కౌన్సిల్‌

Published Sat, Jan 26 2019 1:49 PM

Mayor Escape From Council Meeting in Krishna - Sakshi

పాలకవర్గం ముఖం చాటేసింది.. హౌసింగ్‌పై చర్చ నుంచి జరుకుంది.. నిలదీస్తున్న ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేక నీళ్లునమిలింది.. అధికార అండతో చర్చ లేకుండా చేసింది.. పేదల ఇళ్ల కేటాయింపు అవకతవకలపై నిలదీయడంతో శ్రుతిమించి ప్రవర్తించారు.. హడావిడిగా తీర్మానాలు చేసుకుని వెళ్లిపోయిన దుస్థితి. ఇదీ రాజధాని ప్రాంతంలోని విజయవాడ నగర పాలకవర్గ నిర్వాకం.

పటమట(విజయవాడ తూర్పు): నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. పేదలకు ఇళ్ల కేటాయింపులో అవకతవకలపై సభలో వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు నిలదీశారు. భోజన విరామం తరువాత హౌసింగ్‌ అంశంపై వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ బండి నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ అవకతవకలు జరిగాయని, పీఎంఏవై–ఎన్టీఆర్‌ నగర్‌ హౌసింగ్‌ స్కీంలో చాలా మంది లబ్ధిదారులకు డబుల్‌బెడ్‌ రూం (430 చదరపు అడుగులు)ఇళ్లుకు డీడీలు తీసుకుని సింగిల్‌బెడ్‌ రూం(300 చదరపు అడుగులు) ఇళ్లను కేటాయించారని, లబ్ధిదారులకు అవగాహన కల్పించటంలో పాలకపక్షం వైఫల్యం చెందిందని దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, లబ్ధిదారులందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని పట్టుబట్టారు. స్పందించిన కమిషనర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ లాటరీ పద్ధతిలో ఇళ్లకేటాయింపు జరిగిందని, దీనిపై తాము చేసేది ఏం లేదని సమాధానం ఇవ్వడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్‌ అసహనం.. హౌసింగ్‌పై చర్చ సందర్భంగా మేయర్‌ కోనేరు శ్రీధర్‌ అసహనం వ్యక్తం చేస్తూ అజెండాలోని మిగిలిన ప్రతిపాదలను హడావిడిగా తీర్మానిస్తున్నట్లు ప్రకటించి కౌన్సిల్‌ హాలు నుంచి వెళ్లిపోయారు.

కార్పొరేటర్ల బైఠాయింపు..
మేయర్‌ తీరుకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ హాలు ఎదట బైఠాయించారు. వీరికి మద్దతుగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ విమర్శలను, ప్రశ్నలను స్వీకరించే పరిస్థితిలో లేదని, ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటం పరిపాటిగా మారిందని, ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే గడువు దగ్గరకు వచ్చిందన్నారు.

మేయర్‌ కారు ఎదుట బైఠాయింపు..
కౌన్సిల్‌ను అర్ధంతరంగా ముగించేయటంతో వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లు బూళ్ల విజయ్‌కుమార్, మేయర్‌ కారుకు ముందు బైఠాయించటంతో అక్కడే ఉన్న టీడీపీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీ, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను పక్కకు నెట్టడడం వివాదాస్పదమైంది. దీంతో కార్పోరేటర్లు పుణ్యశీల, బీజాన్బీ, కావటి దామోదర్, జనులపూర్ణమ్మ, అవుతు శైలజ, మహ్మద్‌ కరీమున్నీసా, బొప్పన భవకుమార్, కౌన్సిల్‌ హాలుకు వెళ్లే మార్గంలో కొద్దిసేపు ఆందోళన చేసి కౌన్సిల్‌హాలు బయట బైఠాయించారు.

పార్థసారథి సంఘీభావం
పటమట: మేయర్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని సారధి డిమాండ్‌ చేశారు. ఈ నేపద్యంలో విషయం తెలుసుకున వీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌(జనరల్‌) డి.చంద్రశేఖర్‌ కౌన్సిల్‌హాలు వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లను సముదాయించే ప్రయత్నం చేశారు.

సమాధానం చెప్పలేక పారిపోయారు : బండి పుణ్యశీల
చట్ట సభల్లో సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ పాలకపక్షం ఉందని, పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ అడిగిన ప్రజాప్రతినిధులపై దాడులకు తెబడటం టీడీపీకి పరిపాటిగా మారింది. హౌసింగ్‌ అంశంపై చర్చ జరుగుతుందగా మేయర్‌ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement