భూముల కొనుగోలులో అవినీతి | Sakshi
Sakshi News home page

భూముల కొనుగోలులో అవినీతి

Published Tue, Oct 16 2018 6:53 AM

Land and corruption  - Sakshi

ప్రజా సంకల్పయాత్ర బృందం: రామభద్రపురం మండలంలోని శిష్టుసీతారాంపురం గ్రామానికి చెందిన ఎస్సీ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు అనుచరుడు భారీ అవినీతికి పాల్పడ్డాడని గ్రామానికి చెందిన లబ్ధిదారులు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో గల పిండ్రంకివలసలో సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రతిపక్ష నేతను కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా కె. అశోక్‌కుమార్, తదితరులు మాట్లాడుతూ, శిష్టుసీతారాంపురం గ్రామ రెవెన్యూ పరిధిలో 53 మంది భూమిలేని నిరుపేద లబ్ధిదారులకు భూములు పంపిణీ చేసేందుకు 36.60 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. 

ఎకరా ఎనిమిది లక్షల రూపాయలు పలికే ఈ భూములకు 14 లక్షల రూపాయల చొప్పున ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు చెల్లించారన్నారు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు అండదండలతో రామభద్రపురం మండల టీడీపీ అధ్యక్షుడు అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అంతేగాకుండా భూముల కేటాయింపులో ఒక్కో లబ్ధిదారుడి నుంచి పది వేల రూపాయలు చొప్పున వసూలు చేశారని చెప్పారు. అయితే ఇంతవరకు భూ కేటాయింపులు జరగలేదని తెలిపారు. నాయకులను అడిగితే  పోలీసులచే కేసులు పెట్టించి బెదిరిస్తున్నారని వాపోయారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.

పెద్దగడ్డ, చంపావతి నుంచి సాగునీరు అందించాలి
 పెద్దగడ్డ, చంపావతి నదుల నుంచి బాడంగి మండలంలో గల వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని ఆ మండల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, రైతులు కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పి. జగదీష్, ఎం. సత్యనారాయణ, పి. రామారావు, తదతరులు మాట్లాడుతూ, పెద్దగడ్డ నుంచి డొంకినవలస వైపు సాగునీరు మళ్లించాలని కోరారు. అలాగే వేగావతి నదిలో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి మండలంలోని 32 గ్రామాలకు సాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. బాడంగి మండల కేంద్రంలో ఉన్న 30 పడకల ఆస్పత్రిని 60 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని కోరారు. 

Advertisement
Advertisement