అందరి ఆకాంక్ష.. జననేత క్షేమమే | Sakshi
Sakshi News home page

అందరి ఆకాంక్ష.. జననేత క్షేమమే

Published Sat, Oct 27 2018 1:55 PM

Krishna YSRCP Leaders Pray For YS Jagan Health - Sakshi

‘రాక్షస రాజకీయం’ కుట్రల కత్తితో ప్రజానాయకుడి భుజంపై చేసిన గాయం.. ఆపై సర్కారు పెద్దలు కేసును తప్పుదోవ పట్టించేందుకు చేసిన కుటిల యత్నాలు.. నెత్తుటి గాయం సలుపుతున్నా.. ఆ బాధను పంటి బిగువున భరిస్తూ ‘నేను క్షేమం.. అధైర్యపడొద్దు’ అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజానీకాన్ని ఓదార్చిన తీరు.. గురువారం టీవీలలో ఈ దృశ్యాలు చూసిన మరుక్షణం నుంచి రాష్ట్రంలోని ప్రతి గుండె కన్నీటి గాయంతో విలవిలలాడుతోంది. కాళ్లకు చక్రాలు కట్టుకుని వేల అడుగుల సంకల్పంతో సాగిపోతున్న బాటసారిపై అంతులేని కుట్రలకు నిలువెల్లా కుంగిపోతోంది. అన్నా.. పాలకులకు జాడ తెలియని మా వాడల్లోకి.. నేనున్నానంటూ పాదయాత్రికుడివై వచ్చి ఆప్యాయంగా పలకరించావే.. ఇప్పుడు నీ ఆరోగ్యానికి మేము రక్షగా ఉంటామంటూ సంఘీభావ సంతకం చేస్తోంది. తమ ప్రేమాభిమానాలను వత్తిగా మార్చి నిండు దీవెలను హారతి చేసి.. భగవంతుడా.. జనహృదయ నేతకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి మళ్లీ జనంలోకి పంపమంటూ రెండు చేతులు జోడించి వేడుకుంటోంది.

సాక్షి, అమరావతిబ్యూరో: ప్రధాన ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని పక్కదారి పట్టించేలా రాజకీయాలు చేయడంపై ప్రజలు కన్నెర్ర చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, డీజీపీ తీరును ఎండగడుతూ శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు చేపట్టారు. అదేవిధంగా గాయం నుంచి జననేత త్వరగా కోలుకోవాలని ఎక్కడికక్కడ సర్వమత ప్రార్థనలు చేశారు. దాడిని ఖండించకుండా వ్యూహాత్మకంగా ప్రతిపక్షంపై ఎదురుదాడికి యత్నించడాన్ని తప్పుపడుతూ.. తక్షణమే కుట్రదారులను అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

జిల్లా వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు..
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ పార్టీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్‌ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌ బాబు ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ మోపిదేవి మండల పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి సుబ్రహ్మాణేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెడన నియోజకవర్గంలోనూ పార్టీ నేతలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త జోగిరమేష్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతో కలిసి పార్టీ నాయకులు వైఎస్‌ జగన్‌ త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త ఉదయభాను ఆధ్వర్యంలో చర్చి, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. కైకలూరు పెద్ద మసీదులో రాష్ట్ర మైనార్టీ నాయకుడు మహ్మద్‌ జహీర్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌కు అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుతూ మసీదు గురువు మహ్మద్‌ ఇర్ఫాన్‌ఖాన్‌ ప్రత్యేక నమాజ్‌ చేశారు. నందిగామలో పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు నేతృత్వంలో పట్టణంలోని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పాత బైపాస్‌రోడ్డులోని షాలేం ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత పెద్దమసీదులో, మసీదు ఆవరణలోని దర్గాలో నమాజ్‌లు చేశారు.

పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు..
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని ఖండిస్తూ విజయవాడలో వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి తన ఇంటి నుంచి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయనను అరెస్టు చేసి వన్‌టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ నేతలు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసులు స్టేషన్‌కు వెళ్లి గౌతంరెడ్డిని పరామర్శించారు. అలాగే గుడివాడ రూరల్‌ మండలం బిల్లపాడు గ్రామంలో జగన్‌పై దాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement