మన్యంలో కుండపోత | Sakshi
Sakshi News home page

మన్యంలో కుండపోత

Published Tue, May 14 2019 12:51 PM

Heavy Rains in Visakhapatnam Agency - Sakshi

ఏజెన్సీలో సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో  చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.ఇళ్లపై కప్పులు దెబ్బతిన్నాయి. వర్షపు నీటితో గెడ్డలు పొంగిప్రవహించాయి.  పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఏజెన్సీ వాసులుతీవ్ర అవస్థలకు గురయ్యారు.

విశాఖపట్నం, పెదబయలు/ముంచంగిపుట్టు (అరకులోయ): పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్క సారిగా ఈదురుగాలులతో కూడిన  కుండపోత వర్షం కురిసింది.  ముంచంగిపుట్టు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో వల్లంగి గురు అనే వ్యక్తి ఇంటి పైకప్పుపై  పనస చెట్టు విరిగిపడింది. దీంతో గోడలు, పైకప్పు దెబ్బతిన్నాయి. ఇంటి లోపల సామాన్లు పూర్తిగా తడిసిపోయాయి.  ఆ సమయంలో ఇంటి లోపల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జర్రెల పంచాయతీ బాపనపుట్టు గ్రామంలో ఈదురుగాలులకు   ఐదు చోట్లు వైద్యుత్‌ వైర్లపై చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో   విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

చిరు వ్యాపారుల అవస్థలు
పెదబయలు మండలంలో సోమవారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురిసింది. మండలకేంద్రంలో సంతకు ఆటంకం ఏర్పడింది.  రైతుల  నుంచి  కొనుగోలు  చేసిన పసుపు, పిప్పళ్ల బస్తాలు తడిసిపోయాయి. కూరగాయల రైతులు, ఇతర చిల్లర దుకాణాల వ్యాపారులు అవస్థలు పడ్డారు.  సంత ప్రాంగణం చిత్తడిగా మారింది. గత 10 రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది.  విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

పొంగి ప్రవహించిన గెడ్డలు
జి.మాడుగుల(పాడేరు): మండలంలో పలు గ్రామాల్లో సోమవారం ఉరుములు, మెరుపులు, వడగాళ్లు, ఈదుర గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.   గెడ్డలు, వాగులు వర్షపు నీటితో పొంగి ప్రవహించాయి. కొక్కిరాపల్లి– లక్కుళ్లు మధ్య గెడ్డ పొంగి ప్రవహించడంతో బొడ్డగొంది, వళ్లంగుల, చిట్టంపాడు, పెదపాడు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఈ మార్గంలో గల గెడ్డపై బ్రిడ్జి నిర్మాణ దశలో ఉంది.  వీధులు, పొలాలు జలమయమయ్యాయి. కొయ్యూరు, జీకే వీధి మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  జీకే వీధి మండలంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మండల వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement
Advertisement