మనశ్శాంతికి చెల్లుచీటీ | Sakshi
Sakshi News home page

మనశ్శాంతికి చెల్లుచీటీ

Published Mon, Oct 14 2013 3:32 AM

Gas transfer money to the confusion

సాక్షి, కాకినాడ : వంటగ్యాస్‌కు నగదు బదిలీ అంటూ అరచేతిలో వైకుంఠం చూ పారు. దొడ్డిదారిన రేటు పెంచుతూ ఒక పక్క వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. మరోపక్క ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకొన్న ‘అడ్వాన్స్ సబ్సిడీ’ అటకెక్కడం సామాన్యులకు పెనుభారమైంది. గ్యాస్ సిలిండర్ ధర ఏ నెల ఎంత ఉంటుంది? ఏ నెలలో ఎంత సబ్సిడీ మొ త్తం జమవుతుంది? ఏ అకౌంట్‌లో జమవుతుంది? అసలు జమవుతుందా, లేదా? అన్నది తెలియని గందరగోళం వినియోగదారులకు మనశ్శాంతిని కరువు చేస్తోంది.
 
 కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం అంటూ జూన్ ఒకటి నుంచి జిల్లాలో అమలులోకి తెచ్చిన గ్యాస్‌కు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ఎందరో వినియోగదారులను అయోమయంలోకి నెడుతోంది. ఆర్థికంగా వారిపై అదనపు భారం మోపుతోంది. ‘అడ్వాన్స్‌గా సబ్సిడీ మొత్తం బుక్ చేసిన 24 గంటల్లో మీ ఖాతాల్లో జమవుతుంది. ఆ మొత్తానికి ప్రస్తుతం మీరు చెల్లించే మొత్తం (రూ.412) జత చేసుకొని సిలిండర్ విడిపించుకోవచ్చు. ఎలాంటి భారం ఉండదు’ అంటూ అధికారులు ఊరించారు. డీబీటీ అమలుకు ముందు సిలిండర్‌ధర రూ.411 గా ఉండేది. రవాణాఖర్చులు కలుపుకొని రూ.420కు ఇంటికి చేరేది. జిల్లాలో డీబీటీ అమలులోకి వచ్చిన కొత్తలో అకౌంట్ సీడింగ్ పూర్తయిన వినియోగదారులు బుక్ చేసుకున్న 24 గంటల్లో అడ్వాన్స్ సబ్సిడీగా రూ.435 వారి ఖాతాల్లో జమయ్యేది. ఆసమయంలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.854.50గా ఉండేది. అంటే ప్రారంభంలోనే వినియోగదారునిపై సిలిండర్‌పై రూ.8.50 భారం పడింది. సెప్టెంబర్‌లో నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర రూ.998గా ఉండగా అడ్వాన్స్ సబ్సిడీగా రూ.587 జమకావాలి. కానీ కేవలం రూ.534.49 మాత్రమే జమయింది. అంటే గతనెలలో వినియోగదారులపై రవాణా ఖర్చులు కాక రూ.52.51 భారం పడింది.
 
 రవాణా ఖర్చుతో కలిపి రూ.1100 పైమాటే..
 అక్టోబర్ ఒకటి నుంచి నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర ఏకంగా రూ.1070కు చేరుకుంది. ఈ లెక్కన సబ్సిడీ మొత్తం రూ.659 జమకావాలి. కానీ కేవలం రూ.603 మాత్రమే జమవుతోంది. అంటే ఈ నెలలో వినియోగదారుడు మోసే భారం కాస్తా రూ.56కు చేరుకుంది. ఇక ఎంత తక్కువ లెక్కేసుకున్నా రూ.30 నుంచి రూ.50 వరకు రవాణాఖర్చుల పేరిట గ్యాస్ బాయ్స్ ముక్కు పిండి మరీ వసూలుచేస్తున్నారు. ఇలా ఉండగా ఈ నెల నుంచి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. డీబీటీ ప్రారంభంలో సబ్సిడీ మొత్తం అడ్వాన్స్ రూపంలో బుక్ చేసుకున్న 24 గంటల్లోపు ఖాతాల్లో జమయ్యేది. ఆ తర్వాత ఆ సమయం 48 గంటలకు, ఆనక 72 గంటలకు చేరుకుంది. ‘కాస్త ఆలస్యమైనా డెలివరీకి ముందే జమవుతోంది కదా’ వినియోగదారులు అని సర్దుకుపోయేవారు.
 
 సిలిండర్ల విడుదలకు అప్పులు
 అయితే గత నెల నుంచి అడ్వాన్స్ సబ్సిడీకి మంగళం పాడేశారు. సబ్సిడీ మొత్తాన్ని సిలిండర్ డెలివరీ అయ్యాక వేయడం ప్రారంభించారు. తొలుత వారం, పదిరోజుల్లో ఈ మొత్తం ఖాతాల్లో జమయ్యేది. ప్రస్తుతం మూడు నుంచి నాలుగు వారాలకు పైగా సమయం పడుతోంది. దీంతో బుక్ చేసుకున్న సమయంలో మార్కెట్ ధర ఎంత ఉంటే అంత మొత్తాన్ని చెల్లించి సిలిండర్‌ను విడిపించుకోవల్సి వస్తోంది. ఈ నెలలో నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర రూ.1070 కాగా రవాణా ఖర్చులు కలుపుకొని రూ.1100 నుంచి రూ.1150 వరకు చెల్లించి విడిపించుకోవాలన్న మాట. డెలివరీ సమయంలో అంత పెద్దమొత్తంలో చేతిలో డబ్బుల్లేక  సామాన్యులు వడ్డీలకు అప్పులు చేసి విడిపించుకోవల్సి దుస్థితి ఏర్పడుతోంది. తర్వాత సబ్సిడీ మొత్తం కోసం కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూడాల్సిందే. అదికూడా పడితే పడినట్టు, లేకుంటే లేనట్టు తీరుగా ఉంది. ఇదేమిటని ఏజెన్సీలను అడిగితే ‘మాకు సంబంధం లే’దంటారు. అధికారులను అడిగితే ‘చెక్ చేస్తాం. ఖాతాల్లో పడేటట్టు చూస్తాం’ అంటారు. ఈ విధానం అమలైన తర్వాత కనీసం 10 శాతం మంది వినియోగదారులకు వారి ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ కాలేదని ఏజెన్సీ నిర్వాహకులే చెపుతున్నారు.
 
 సీడింగ్ కాని ఖాతాల్లోకి జమ..
 డీబీటీ అమలు మొదలైన నాటికి సీడింగ్ అయిన వినియోగదారులకు సబ్సిడీ మొ త్తం బాగానే జమవుతున్నా ఆ తర్వాత సీడింగ్ పూర్తయినవారికి మాత్రం సబ్సిడీ మొ త్తం జమ కావడం అంతా గందరగోళంగా తయారైంది. అకౌంట్ సీడింగ్ చేయించుకున్న బ్యాంకు ఖాతాకు కాకుండా వినియోగదారులకు చెందిన వేరే ఖాతాలకు (ఉదాహరణకు రుణఖాతాలకు సైతం) జమవుతోంది. ముఖ్యంగా ఎక్కువ మంది వినియోగదారులకు వారికి ఖాతాలు లేకున్నా ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులో వారి పేరిట జమవుతున్నట్టు ఏజెన్సీలకు సమాచారం వస్తోంది. ‘ఆ బ్యాంకులో మాకు ఖాతాల్లేకుండా ఏవిధంగా జమవుతుం’దని ప్రశ్నిస్తే దానికీ ‘మాకు సంబంధం లే’దన్నదే సమాధానం. అధికారులను అడిగితే సాంకేతికపరమైన కారణాల వల్ల అలా జరిగి ఉంటుందని, పరిశీలించి న్యాయం చేస్తామని చెపుతున్నారు.
 
 డెలివరీలోనూ జాప్యం
 ఇక సిలిండర్ల డెలివరీలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం, సమ్మెల కారణంగా లోడ్ రాలేదనే సాకుతో చాలా ఏజెన్సీలు డెలివరీలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. కొన్ని చోట్ల బుక్ చేసుకున్న 20 రోజుల వరకు డెలివరీ అయ్యే పరిస్థితి లేదు. హెచ్‌పీ సిలిండర్ డెలివరీకి వారం రోజులు పడుతుంటే, ఇండేన్‌కు 15 రోజులు, భారత్‌కు 20 రోజుల వరకు సమయం పడుతోంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డీబీటీలో లోపాలను సరిదిద్ది తమ ఇక్కట్లను, గందరగోళాన్ని తొలగించాలని వినియోగదారులు కోరుతున్నారు.
 
 సాంకేతిక లోపం వల్లే ఆలస్యం
 సాంకేతిక లోపం వల్లే అడ్వాన్స్ సబ్సిడీ జమ కావడంలో ఆలస్యం జరుగుతోందని, సిలిండర్ డెలివరీ అనంతరం వినియోగదారుల ఖాతాలో వారం, పదిరోజుల్లో జమవుతోందని డీఎస్‌ఓ వి.రవికిరణ్ తెలిపారు. కొద్దిమందికి మాత్రమే ఇలా జరుగుతోందని, చాలా మందికి బుక్ చేసుకున్న 24 గంటల్లోనే జమవుతోందని వివరించారు. ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో ఖాతాలు లేకపోయినా జమ కావడంపై వివరణ ఇస్తూ డీబీటీ ప్రారంభంలో ఆయిల్ కంపెనీల నుంచి వినియోగదారుల కన్స్యూమర్ నంబర్లను బట్టి  బ్యాంక్ జీరో బ్యాలన్స్‌తో రాష్ట్రస్థాయిలో ఖాతాలు తెరిచినట్టు చెప్పారు. అలాంటి ఖాతాలకు మాత్రమే నేరుగా సబ్సిడీ మొత్తం జమవుతోందన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులకు తెలియజేసి ఆ బ్యాంక్‌లో కూడా ఆధార్ సీడింగ్ చేయించుకోమని ఏజెన్సీల ద్వారా చెబుతున్నాం.
 

Advertisement
Advertisement