వరద గోదారి..  | Sakshi
Sakshi News home page

వరద గోదారి.. 

Published Sat, Aug 10 2019 10:11 AM

Floods In East Godavari District - Sakshi

జిల్లావాసులను కంటిమీద కునుకులేకుండా గోదావరి వరద భయపెడుతోంది. వరద ఉధృతి మరోసారి పెరగడంతో శుక్రవారం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమ, ఏజెన్సీ మండలాల్లో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రధానంగా కోనసీమలోని పి. గన్నవరం, రాజోలు, అయిన విల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సాక్షి, రాజమహేంద్రవరం:  ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మళ్లీ గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద సాయంత్రం ఆరుగంటలకు నీటి మట్టం 47.50 అడుగులకు చేరుకుంది. కూనవరం, వీఆర్‌ పురం మండలాల్లోని సుమారు 20 గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. శబరి నది పొంగి ప్రవహిస్తుండటంతో చింతూరు మండలంలో వరుసగా మూడో రోజు కూడా 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపునకు గురైన గ్రామాల్లో అధికారులు లాంచీల ద్వారా నిత్యాసవసరాలు అందజేస్తున్నారు. దేవీపట్నం మండలంలోని తొయ్యేరు, పూడిపల్లి తదితర 36 గ్రామాలు వరుసగా ఎనిమిదో రోజు కూడా వరద రోజుల తరబడి ముంపులో ఉండడంతో ముంపుతో ఇళ్లు కూలిపోతాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 15 అడుగులకు చేరుకుంది. 14,59,068 క్యూసెక్కులు సముద్రంలోకి విడిచిపెట్టారు.

కోనసీమలో...
కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధగౌతమి నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఉద్యానవన పంటలు ఇప్పటికే ముంపుతో తీవ్రంగా నష్టపోయాయి. మామిడికుదురు మండలంలో ఇద్దరు వరద ఉధృతికి గోదావరిలో కొట్టుకుపోగా, ఏజెన్సీలో ఓ మహిళ వాగులో పడి మృతి  చెందింది. పాశర్లపూడి కరకట్ట దిగువన ఉన్న అప్పనపల్లి కాజ్‌వేపై నడుచుకుంటూ అప్పనపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా వరద ఉధృతిలో ముగ్గురు కొట్టుకుపోగా షేక్‌ వజీర్‌ను స్థానిక యువకుడు లంకే ఏసు, కానిస్టేబుల్‌ పెద్దిరెడి సూరిబాబు రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. కాకినాడ రూరల్‌ మండలం రేపూరుకు చెందిన సమీర్‌బాషా(23), పెదపట్నంకు చెందిన షేక్‌ రెహ్మాన్‌ అలియాస్‌ నానీ(17) గోదావరి మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు.

మృతుల కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రంపచోడవరం ఏజెన్సీలోని అడ్డతీగల మండలం కొచ్చావారివీధి వద్ద జర్తా భద్రమ్మ అనే మహిళ మడేరువాగులో పడి మృతి చెందింది. సీతానగరం మండలం బొబ్బిల్లంక వద్ద గోదావరిలో లాంచీ విద్యుత్‌ తీగలు తగిలి నిలిచిపోయింది. గొల్లప్రోలు చౌటకాలువ, గడ్డ కాలువలు జోరుగా ప్రవహిస్తున్నాయి. గొల్లప్రోలు స్వరంపేటకు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే తూము ముంపునకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో 30 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. 

కూనవరం: గోదావరి, శబరి వరదనీటి కారణంగా కూనవరంలో 20.39 మీటర్ల మూడో ప్రమాద హెచ్చరికకు వరదనీరు చేరింది. దీని కారణంగా కూనవరం, వీఆర్‌పురం మండలాల నడుమగల వంతెనను ఆనుకుని వరదనీరు ప్రవహిస్తోంది. రహదారుల పైకి వరదనీరు చేరడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

చింతూరు : శబరినది వరద కారణంగా మండలంలోని చట్టి, వీరాపురం, చిడుమూరు వద్ద జాతీయ రహదారి–30 ఇంకా ముంపులోనే ఉండడడంతో ఆంధ్రా నుంచి తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వాహనాలు భారీసంఖ్యలో ఎక్కడికక్కడే నిలిచిపోయి రాకపోకలు బందయ్యాయి. కుయిగూరు వద్ద జాతీయ రహదారి–326 ముంపునకు గురికావడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం నియోజకవర్గం  దేవీపట్నం ప్రాంతంలో  నీటి మట్టం గణనీయంగా పెరిగింది. 36 గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి.  రాజమహేంద్రవరం రూరల్‌లో కూడా ముంపు ప్రభావం ఉంది.    మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో వ్యవసాయ క్షేత్రాలు దాదాపు నీట మునిగాయి. 

అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం బోడసకుర్రురు, దేవర్లంకర, పల్లిపాలెం, కంసాల మామిడి ప్రాంతాలలో 120  ఇళ్లు నీటమునిగాయి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.  పల్లిపాలెంలో 62 ఇళ్ళు, 44 ఇళ్ళు లోతట్టు ప్రాంతాల్లో జలమయయ్యాయి. రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరంలో ముంపులో కోటిపల్లి మత్స్యకార కాలనీలో 250 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.     

కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలను నీళ్లు ముంచెత్తుతున్నాయి. కొత్తపేట–కేదార్లంక, వాడపాలెం–నారాయణలంక మధ్య ఉన్న తొగరుపాయ వంతెనల పై వరకూ వరద నీరు వచ్చి చేరింది. రావులపాలెం మండలంలోని ఊబలంక శివారు తోకలంకకు మూలస్థాన అగ్రహారం లంక పొలాలకు మధ్య, చొప్పెల్ల–వాడపల్లి లంకకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

విలీన మండలాల్లో
గోదావరి వరద శుక్రవారం ఉదయానికి భద్రాచలం వద్ద 48 అడుగుల రెండో ప్రమాద హెచ్చరికకు చేరుకుని మధ్యాహ్నం నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దీంతో భద్రాచలం నుంచి కూనవరం రాకపోకలు నిలిచిపోయాయి. ఎటపాక మండలంలోని మురుమూరు, నందిగామ, రాయనిపేట, వీరాయిగూడెం గ్రామాల్లో రహదారులపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల ప్రత్తిచేలు, వరి నారుమళ్లు, పెసర పంటలు నీటమునిగాయి.

వీఆర్‌పురం: గోదావరి, శబరినది వరదనీరు కారణంగా శ్రీరామగిరి, వడ్డిగూడెం, చింతరేవుపల్లి గ్రామాల్లో పలు ఇళ్లు నీటమునిగాయి. రహదారులపైకి నీరు చేరడంతో మండలంలోని 20 గ్రామాలకు గత 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement
Advertisement