కన్నీరు తుడుస్తూ.. బాసటగా నిలుస్తూ.. | Sakshi
Sakshi News home page

కన్నీరు తుడుస్తూ.. బాసటగా నిలుస్తూ..

Published Tue, Nov 24 2015 2:02 AM

కన్నీరు తుడుస్తూ.. బాసటగా నిలుస్తూ.. - Sakshi

బాధితులకు అండగా నిలుస్తానని భరోసా
పంట నష్టాన్ని పరిశీలించిన విపక్షనేత
స్పందించని సర్కారు తీరుపై ఆగ్రహం
వరద బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటన

 
వర్షాలతో కకావికల మయిన పంటలను చూసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో కొట్టుపోయిందని బోరున విలపించిన అన్నదాతను ఓదార్చారు. వారి కన్నీటిని తుడిచారు. వరద బాధిత గ్రామాల్లో నష్టాలను సోమవారం రాత్రి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సాయం అందేవరకు ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటామని అన్నదాతకు భరోసా ఇచ్చారు.  
 
తిరుపతి: ‘ఇళ్లలోకి నీరు వచ్చింది.. వస్తువులన్నీ తడిసిపోయాయి. రేషన్‌కార్డులున్నా కనీసం బియ్యం కూడా ఇవ్వలేదు.. మమ్మల్ని అధికారులు పట్టించుకోలేదం టూ’ అంటూ గురవమ్మ, అన్నపూర్ణమ్మతో పాటు పలువురు మహిళలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి తన సమస్యను వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పర్యటించారు. జిల్లాలోని రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో పర్యటించి వరదల్లో నష్టపోయిన రైతులను పరామర్శించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నా రు. నేనున్నాననే భరోసా ఇచ్చారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వం నుంచి సహాయం అందలేదని పలువురు ఆయన దృష్టికి  తీసుకువచ్చారు. తమ అభిమాన నేతను చూసేందుకు జనాలు రోడ్ల వెంబడి బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటలకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తారన్న సమాచారంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు ఆయన రాక ఆలస్యం అయినప్పటికీ ఇళ్లకు వెళ్లకుండా అలాగే వేచి చూశారు.


చలించిపోయిన జగన్..
పంట పొలాలన్నీ చెరువులుగా మారటాన్ని చూసి ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. వరద కారణంగా జరిగిన పంట నష్టాన్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దారివెంట తనను చూసేందుకు వచ్చిన వారిని పలకరిస్తూ, వారి కష్టాలను అడుగుతూ భరోసానింపే యత్నం చేశారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడండి..
‘ప్రత్యేక హోదా కోసం పోరాడండి’ అంటూ కరకంబాడీ వద్ద సుబ్బరత్నంతో పాటు పలువురు ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ‘మీరు నా వెనుక ఉన్నారు. మీకు నేనున్నానంటూ’ జగన్ వారికి చెప్పి ప్రత్యేక హోదా కోసం కచ్చితంగా పోరాడుతానన్నారు.
 
పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేతలు..
 వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన తమనేతకు స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు పెద్ద ఎ త్తున తరలివచ్చారు. చిత్తూరు జిల్లాలో జరిగిన నష్టాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని జిల్లాలోని నేతలకు సూచించారు. విమానాశ్రయానికి తరలివచ్చిన నేతల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ జిల్లా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలం, తిరుప తి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత పుల్లూరు అమరనాథ్‌రెడ్డితోపాటు పెద్దఎత్తున జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
 
 

Advertisement
Advertisement