తల్లిదండ్రుల అరాచకంపై చట్టాలు రావాలి: స్పీకర్‌

AP Speaker Tammineni Sitaram Speaks About Childrens Right - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సమాజంలో బాలల వ్యవస్థ ప్రమాదంలో పడిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. బాలల పరిరక్షణ, హక్కుల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు కావాలని అభిలషించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాలల్లో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన చెందారు. తల్లిదండ్రుల దగ్గరినుంచే పిల్లల్లో నేర ప్రవృత్తిని అరికట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అయితే తల్లిదండ్రుల అరాచకం మీద కూడా చట్టాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. వీటిపైన ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా బాలల వ్యవస్థపై చర్చ జరుగుతోందన్నారు.

యుఎన్‌ఓ అసెంబ్లీ బాలలపై చేసిన తీర్మానాలను బాలల పరిరక్షణ సంఘాలు ప్రజలకు చేరవేయాలన్నారు. బాలల చట్టాలను ఉక్కుపాదంతో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. సమాజంలో పిల్లల పట్ల ఆలోచన మారాలన్నారు. దైవస్వరూపులైన బాలలను బలత్కరిస్తున్న వైనాలు దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఏపీ శాసనసభలో బాలల పరిరక్షణపై చర్చ జరపాలన్న ప్రతిపాదనపై.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో మాట్లాడి చర్చలు జరిగేలా కృషి చేస్తానని తమ్మినేని సీతారాం హామీ ఇచ్చారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top