అవ్వాతాతలపాలిట యముడు చంద్రబాబు | Sakshi
Sakshi News home page

అవ్వాతాతలపాలిట యముడు చంద్రబాబు

Published Sat, May 4 2024 4:35 AM

అవ్వాతాతలపాలిట యముడు చంద్రబాబు

తణుకు అర్బన్‌: అవ్వాతాతలపై చంద్రబాబు పగబట్టి వారి పట్ల యముడిలా ప్రవర్తిస్తున్నాడని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు దుష్ట్రగహంలా దాపురించాడని, పేదలు, వృద్ధులు సుఖంగా ఉంటే చూడలేకపోతున్నాడని విమర్శించారు. గత ఐదేళ్లుగా వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి గుమ్మంలోకే ఇచ్చిన పింఛన్‌ పంపిణీ విధానాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయాడని, పరిపాలన ఎన్నికల అధికారి చేతుల్లోకి వెళ్లిన వెంటనే తన కుట్ర రాజకీయాన్ని బయటకు తీశాడని దుయ్యబట్టారు. తన హయాంలో ఎన్నికల అధికారి వేషంలో తొత్తుగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌ ద్వారా అవ్వాతాతలు, మహిళలపై యమపాశంలాంటి పిటిషన్‌ను వేసి ఇంటి గుమ్మంలోకి అందించే పింఛను విధానాన్ని అడ్డుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్‌ అమలైన రోజు నుంచి తనలోని దుష్టచతురతను బయటకు తీసి పేదలను ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూ పదే పదే పిటిషన్‌లు వేస్తూ అవ్వాతాతల ఉసురు తీస్తున్నాడని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచార ఆర్భాటం కోసం గోదావరి పుష్కరాల్లో 39 మంది అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకున్నాడని, ఈ ఏడాది ఏప్రిల్‌లో పింఛను కోసం సచివాలయాలకు రప్పించి రాష్ట్రవ్యాప్తంగా 30 మందికి పైగా అవ్వాతాతలను బలితీసుకున్నాడని, ఈ నెలలో ఇంకెంత మందిని బలి తీసుకుంటాడోనని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి పిటిషన్‌తో పింఛనును సచివాలయాలకు వచ్చి తీసుకోవాలని ఆదేశాలు ఇప్పించాడని, రెండో పిటిషన్‌ ద్వారా పింఛను సొమ్మును బ్యాంకులకు జమచేసేలా సఫలీకృతుడై శునకానందం పొందుతున్నాడన్నారు. అవ్వాతాతలపై చంద్రబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని, ఇంతకింత అనుభవించే రోజు తొందరలోనే ఉందని గుర్తుచేశారు. పింఛను సొమ్ము తీసుకుని మందులు, వెచ్చాలు కొనుక్కునే క్రమంలో బ్యాంకులకు వచ్చిన అవ్వాతాతలు తాము పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా చంద్రబాబుపై శాపనార్థాలు పెడుతున్నారని, వలంటీర్లు ఇస్తే నీ ఆస్తేమైనా కరిగిపోతుందా అంటూ నిప్పులు చెరుగుతున్నారని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు.

విలేకరుల సమావేశంలో మంత్రి కారుమూరి మండిపాటు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement