Sakshi News home page

● ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం బిల్లును మరోసారి ఆమోదించిన అసెంబ్లీ ● సభలోతీర్మానం ప్రవేశపెట్టిన సీఎం స్టాలిన్‌ ● ముసాయిదాని ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు ● చర్చలో అన్నాడీఎంకే తరపున పన్నీరు ప్రసంగం ● పళణివర్గం తీవ్ర ఆగ్రహం

Published Fri, Mar 24 2023 6:18 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిస్తూ గత ఏడాది డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. అయితే ఈ బిల్లును రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆమోదించకుండా చాలాకాలం పాటు పెండింగ్‌లో పెట్టారు. చివరకు ఈనెల మొదటి వారంలో ప్రభుత్వానికి వెనక్కి పంపించారు. ఈ నిషేధం వ్యవహారం కేంద్రంతో ముడిపడి ఉందని, ఈ చట్టం తీసుకొచ్చే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని గవర్నర్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గత వారం పార్లమెంట్‌ వేదికగా చర్చ సందర్భంగా ఆన్‌లైన్‌ రమ్మీ వ్యవహారంలో చట్టం తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని కేంద్రం ప్రకటించింది. దీనిని అస్త్రంగా చేసుకుని బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త చట్టానికి సీఎం స్టాలిన్‌ చర్యలు చేపట్టారు.

ఈసారి సీఎం స్వయంగా..

గత ఏడాది న్యాయ శాఖ మంత్రి రఘుపతి రమ్మీ నిషేధం ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే రెండోసారి గురువారం సీఎం ఎంకే స్టాలిన్‌ స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. ఉదయం సభలో ప్రత్యేక తీర్మానంగా ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ బిల్లుపై చర్చ జరిగింది. ఇందులో సీఎం స్టాలిన్‌ ప్రసంగిస్తూ , బరువెక్కిన హృదయంతో ఈసభలో నిలబడి ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ జూదానికి బానిసై నగదు పోగొట్టుకోవడమే కాదు, 41 మంది ఇప్పటి వరకు రాష్ట్రంలో బలవన్మరణాలకు పాల్పడ్డారని వివరించారు. ఈ ఘటనలు తనను తీవ్రంగా కలచి వేశాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ రమ్మీలో నగదు పోగొట్టుకుని తన మరణమే చివరిది కావాలని.. బలవన్మరణానికి పాల్పడిన సురేష్‌ కుమార్‌ అనే యువకుడు రాసిన లేఖను సభ దృష్టికి తెచ్చారు. కళ్ల ముందు జరుగుతున్న ఈ మరణాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం బాధ్యతను స్వీకరించిందన్నారు. అందుకే మళ్లీ చట్టాన్ని తీసుకొస్తున్నామని, రిటైర్డ్‌ న్యాయమూర్తి చంద్రు బృందం సలహాలు, సూచనలు కూడా ఇందులో పొందుపరిచామని వివరించారు. అలాగే, ఈ గేమింగ్స్‌ కారణంగా విద్యార్థులలో క్రమశిక్షణ, ఏకాగ్రత కొరవడినట్టు అనేక మంది ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అలాగే గత తీర్మానం, గవర్నర్‌ జాప్యం ప్రస్తావనను ఈ సందర్భంగా సభ దృష్టికి తెచ్చారు. మనసాక్షికి కట్టుబడి, హృదయ పూర్వకంగా ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధమే లక్ష్యంగా 2023 చట్టాన్ని సభలో ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే పార్లమెంట్‌లో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఈ గేమింగ్‌కు మరో ప్రాణం బలి కాక ముందే ఆమోదం తెలపాలని, సభ్యులందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అందరి ఆమోదంతో..

సీఎం ప్రసంగం అనంతరం అన్నాడీఎంకే తరపున ఎమ్మెల్యే దళవాయి సుందరం మాట్లాడుతూ, ఈ తీర్మానాన్ని అన్నాడీఎంకే ఆమోదిస్తున్నట్టు, ఆన్‌లైన్‌ రమ్మీనిషేధం నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ చట్టం తీసుకొచ్చే అధికారం సభకు ఉందని స్పష్టం చేశారు. బీజేపీ శాసన సభా పక్ష నేత నయనార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ, ఈ చట్టానికి తాము మద్దతు ఇస్తున్నామని, మరో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర చట్టాన్ని తీసుకు రావాలని కోరారు. సీపీఎం, సీపీఐ, పీఎంకే, కాంగ్రెస్‌ సభ్యులు సైతం ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. తమిళర్‌ వాల్వురిమై కట్చి ఎమ్మెల్యే వేల్‌ మురుగన్‌ మాట్లాడుతూ, ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థల ప్రతినిధులను కలవాల్సిన అవసరం గవర్నర్‌కు ఏందుకు వచ్చిందో అని ప్రశ్నించారు. మనిద నేయ మక్కల్‌ కట్చి ఎమ్మెల్యే జవహరుల్లా మాట్లాడుతూ, నష్టాలు మరింతగా జరగకముందే, ప్రజల మనో భావాలను గవర్నర్‌ గౌరవించాలని డిమాండ్‌ చేశారు. చివరగా సభ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

పరువు హత్యపై సభలో చర్చ..

కృష్ణగిరిలో నడి రోడ్డుపై ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని యువతి కుటుంబం అతి దారుణంగా హతమార్చిన వ్యవహారం సభకు చేరింది. ఇందుకు సీఎం స్టాలిన్‌ సమాధానం ఇస్తూ, ఈ హత్య చేయించిన ఆ యువతి తండ్రి అన్నాడీఎంకే నాయకుడని వివరించారు. దీనికి పళణిస్వామి నేతృత్వంలోని సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీతో సంబంధం లేదని వ్యక్తి ప్రస్తావనను సభ దృష్టికి తీసుకురావడాన్ని వ్యతిరేకించారు. ఇక సభ ప్రారంభంలో గాయని వాణి జయరాం, మాజీ ఎమ్మెల్యేలు మారి ముత్తు, తంగవేల్‌, శ్రీనివాసన్‌, మాజీ మంత్రి ఉబయతుల్లా మృతికి ఎమ్మెల్యేలు సంతాపం తెలియజేశారు. చివరగా సభలో ఓ తమిళ దిన పత్రి క వ్యవహారంపై ప్రస్తావనకు వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆ పత్రిక కథనం వ్యవ హారం సభాహక్కుల ఉల్లంఘన పరిఽధిలోకి తెస్తూ, సభా సంఘం విచారణకు సిఫార్సు చేశారు.

పన్నీరు ప్రసంగంతో రచ్చ..

ఇక అన్నాడీఎంకే అంతర్గత విభేదాలకు గురువారం శాసనసభ వేదికగా మారింది. ముసాయిదా గురించి పన్నీరు సెల్వానికి స్పీకర్‌ అప్పావు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని పన్నీరు సెల్వం వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అవకాశం ఇవ్వడాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత పళని స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. అన్నాడీఎంకే అంటే, మెజారిటీ సభ్యుల ఆధారంగా తాము మాత్రమేనని, తమ పార్టీ తరపున దళవాయి సుందరం ప్రసంగించినప్పుడు, ఎలా పన్నీరుకు అవకాశం ఇస్తారని స్పీకర్‌ను ప్రశ్నించారు. అన్నాడీఎంకే సభ్యుడిగానో, అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉప నేతగానో పన్నీరు సెల్వంకు తాను అవకాశం ఇవ్వలేదని స్పీకర్‌ వివరణ ఇచ్చారు. మాజీ సీఎంగా తనకు అవకాశం ఇవ్వాలని పన్నీరు సెల్వం చేసుకున్న విజ్ఞప్తిని గౌరవించి అభిప్రాయాన్ని తెలియజేయడానికి అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ సమయంలో పన్నీరు మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, పళణి వర్గం ఎమ్మెల్యేలు పరస్పరం కయ్యానికి కాలు దువ్వే విధంగా సభలో దూసుకెళ్లారు. వాగ్వాదాలు, అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. గందరగోళ వాతావరణం నెలకొంది. చివరకు పళణి స్వామి నేతృత్వంలోని సభ్యులు సభలో నుంచి వాకౌట్‌ చేశారు.

Advertisement
Advertisement