ఎంతైనా సరే.. గెలవాల్సిందే! | Sakshi
Sakshi News home page

ఎంతైనా సరే.. గెలవాల్సిందే!

Published Thu, Nov 30 2023 4:42 AM

- - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కొంత మంది అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో మద్యాన్ని ఏరులై పారించిన అభ్యర్థులు.. తాజాగా నగదు పంపకాలు చేపట్టారు. మరి కొద్ది గంటల్లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో మహిళా పొదుపు సంఘాలు, బస్తీలు, కుల సంఘాల ఓట్లను గంపగుత్తగా కొనుగోలు చేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. ఆయా ఏరియాల్లో మెజార్టీ ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు ఒక్కో ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు చెల్లిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఏజెంట్లను నియమించుకుని మరీ డబ్బు పంచుతున్నారు. అయితే తాము పంపిన నగదు ఓటరు దేవుడికి అందిందా లేదా అనే ఆందోళన సైతం అభ్యర్థులను వెంటాడుతోంది. నగదు, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టినా.. నిఘా సంస్థల కళ్లుగప్పి నగదు పంపిణీ చేస్తున్నారు. ఇది గుర్తించిన ప్రత్యర్థి పార్టీలు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం ఉండటం లేదు. పోలీసులకు చిక్కకుండా కొంత మంది తప్పించుకుంటుండగా.. దొరికిన వారిని సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు బరిలో నిలిచిన ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేర్‌లింగంపల్లి, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం తదితర నియోజక వర్గాల్లో నగదు ప్రవాహం కట్టలు తెంచుకుంది.

పోల్‌మేనేజ్‌మెంట్‌పై దృష్టి

శివారు జిల్లాలకు చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో నగరానికి నాలుగు వైపులా స్థిరపడ్డారు. ఒక్కో నియోజకవర్గంలో వీరి ఓట్లే రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటాయి. సొంతూరుతో పాటు నగరంలోనూ వీరు ఓటు హక్కును పొందారు. ఓటుకు ఆధార్‌ అనుసంధానం చేయకపోవడంతో చాలా మందికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. మొన్నటి వరకు ప్రచారంలో వెంట తిరిగిన వారు తీరా ఓటింగ్‌ రోజు సొంతూరి బాటపట్టారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఓటింగ్‌ శా తం నమోదు కావడం లేదు. 2018 సాధారణ ఎన్ని కల్లో శేర్‌లింగంపల్లి నియోజకవర్గంలో ఓటింగ్‌ శా తం 48.61 శాతం మాత్రమే నమోదైంది. అదే విఽ దంగా ఎల్బీనగర్‌లో 49.58 శాతం, మహేశ్వరంలో 55.34 శాతం, రాజేంద్రనగర్‌లో 56.89 శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదైంది. ముందస్తుగా నగదు పంపిణీ చేస్తే ఓట్లు పడకుండా పోతాయనే భావన అభ్యర్థుల్లో నెలకొంది. ఉదయం ఓటింగ్‌ ప్రక్రియ మొదలైన తర్వాత పోలింగ్‌ కేంద్రానికి చేరుకునే ఓటరుకు మాత్రమే నగదు చెల్లిస్తే పక్కగా ఓటును పొందొచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు పోలింగ్‌ బూత్‌ల వారీగా నమ్మకస్తులను ఏజెంట్లుగా నియమించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఏజెంట్ల కదలికపై ప్రత్యర్థి పార్టీలు నిఘా ఉంచాయి. నగదు పంచుతున్నట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వారిని చుట్టుముట్టి, పోలీసులకు అప్పజెప్పుతున్న ఘటనలు లేకపోలేదు.

తమను గెలిపించాలని మంగళవారం వరకు వరకు ప్రచారం చేసిన అభ్యర్థులు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. ఓటర్లకు నగదు, మద్యం పంచడం ప్రారంభించారు. పోటాపోటీగా ప్రధాన పార్టీలన్నీ ప్రలోభాల పర్వంలో మునిగిపోయాయి.

పతాక స్థాయికి చేరిన ప్రలోభాలు

ఓటర్లకు నగదు, మద్యంతో ఎరవేస్తున్న అభ్యర్థులు

శివారు నియోజకవర్గాల్లో కట్టలు తెంచుకున్న డబ్బు ప్రవాహం

ఓటుకు రూ.వేయి నుంచి రూ.2వేల వరకు పంపిణీ

ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదుల వెల్లువ

Advertisement
Advertisement