Sakshi News home page

నెలాఖరుకు పూర్తి చేయాలి

Published Wed, Dec 20 2023 1:54 AM

వీడియో సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, హాజరైన అధికారులు  - Sakshi

పనుల పరిశీలన

ఒంగోలు అర్బన్‌: జలజీవన్‌ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ కుళాయి పనులకు సంబంధించిన పరిశీలన నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనం నుంచి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం మండల స్థాయి అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జలజీవన్‌ మిషన్‌ పనులు పూర్తయిన ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లు, వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలన చేసి వలంటరీ యాప్‌లో ఈకేవైసీ నమోదు చేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. పనులకు సంబంధించిన కూలీలను సమీకరించాలన్నారు. ఉపాధి పనుల్లో హౌసింగ్‌ లబ్ధిదారులకు 90 రోజుల పనిదినాలు కచ్చితంగా కల్పించాలన్నారు. ఉపాధి పనులకు సంబంధించి ఆడిట్‌లో గుర్తించిన నగదును వెంటనే రికవరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో వెనుకబడిన మండలాల హౌసింగ్‌ కాలనీలను అధికారులు సందర్శించి సమస్యలను పరిష్కరించడంతో పాటు పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. జగనన్న కాలనీల్లో ఇంకుడు గుంత నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను వేగంగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందించే సేవలు నిర్ధిష్ట వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు వేయాలన్నారు. సర్వీసులకు సంబంధించిన నగదును ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది దుకాణదారులకు, వినియోగదారులకు, ప్రజలకు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నందున నిర్వహణకు అంతరాయం కలగకుండా స్వయం సహాయక సంఘాల మహిళల సహకారం తీసుకుని పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఆహారం అందేలా చూడాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.

సమావేశంలో జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, డీపీఓ నారాయణరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మర్దన్‌ అలీ, హౌసింగ్‌ పీడీ పేరయ్య, డ్వామా పీడీ శీనారెడ్డి, సచివాలయాల నోడల్‌ అధికారి ఉషారాణి, మలేరియా నివారణ అధికారి జ్ఞానశ్రీ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉపాధి పనుల్లో హౌసింగ్‌ లబ్ధిదారులకు 90 రోజుల పనిదినాలు కల్పించాలి

మండల స్థాయి అధికారుల వీడియో సమావేశంలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

Advertisement
Advertisement