మూడో విడత పోలింగ్‌ నేడే | Sakshi
Sakshi News home page

మూడో విడత పోలింగ్‌ నేడే

Published Sat, May 25 2024 3:10 PM

మూడో

భువనేశ్వర్‌: భువనేశ్వర్‌ అర్బన్‌ పోలీస్‌ డిస్ట్రిక్ట్‌ (యూపీడీ)లో 3వ దశ ఎన్నికల పోలింగు శనివారం జరగనుంది. యూపీడీ పరిధిలో పోలింగు కోసం 1,132 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంగణాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా యూపీడీ సమర్ధవంతమైన పోలీసు వ్యవస్థని ప్రవేశ పెడుతున్నట్లు డీసీపీ తెలిపారు. 51 మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీలతో 3,000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు వివరించారు. భువనేశ్వర్‌ కమిషనరేట్‌ పోలీస్‌, ఒడిశా స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఒస్కాక్‌) పోలీస్‌ పెట్రోలింగ్‌, బూత్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (పీపీబీఎంఎస్‌), వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (వీటీఎస్‌) రెండు మొబైల్‌ అప్లికేషన్లను అభివృద్ధి చేశాయి. ఈ అప్లికేషన్‌ ద్వారా పోలింగ్‌ సమయంలో పెట్రోలింగ్‌ యూనిట్ల స్థానాన్ని పర్యవేక్షించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అవసరమైన ప్రదేశానికి పంపవచ్చు.

అంతేకాకుండా, ఈ అప్లికేషన్‌ ద్వారా, బూత్‌లో మోహరించిన సిబ్బంది నేరుగా బూత్‌ ప్రస్తుత స్థితి, పోలింగ్‌ స్థితి, క్యూలో వేచి ఉన్న ఓటర్ల సంఖ్య, అంతరాయం కలిగితే, వారు వెంటనే పూర్తి సమాచారాన్ని ఫోటోలు, వీడియోలతో తక్షణమే సమాచారం అందించగలిగే సదుపాయం కలిపించారు. మొబైల్‌ పార్టీలు పెట్రోలింగ్‌ చేయడానికి రూట్‌లు ముందే నిర్దేశించారు. ఆ మార్గంలో ఏదైనా మార్పు ఉంటే కంట్రోల్‌ రూమ్‌లోని డ్యాష్‌ బోర్డ్‌లో ఆఫ్‌–రూట్‌ హెచ్చరికను సూచిస్తుంది.

94,48,553 మంది ఓటర్లు..

● ఈ విడత పోలింగులో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తున్నారు. 42 అసెంబ్లీ స్థానాలకు 383 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరిలో 339 మంది పురుషులు, 44 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 6 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 64 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 55 మంది పురుష అభ్యర్థులు, 9 మంది మహిళా అభ్యర్థులు ఆరు లోక్‌సభ నియోజకవర్గాలకు పోటీలో ఉన్నారని సీఈవో వివరించారు.

● రాష్ట్రంలో 94,48,553 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 48.30 లక్షల మంది పురుషులు, 46.18 లక్షలు మహిళలు ఉన్నారు.

● 10,551 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ఏర్పాట్లు చేశారు. వీటిలో దాదాపు 200 ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. 2,000 పోలింగ్‌ స్టేషన్లు కీలకమైనవిగా గుర్తించారు.

● మహిళా పోలింగ్‌ సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో 1,500 పోలింగ్‌ కేంద్రాలు, దివ్యాంగుల పర్యవేక్షణలో 30 పోలింగ్‌ కేంద్రాలు పని చేస్తాయన్నారు. ఎన్నికల నిర్వహణకు 70 వేల మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించనున్నట్లు సీఈఓ తెలిపారు. దేవ్‌గడ్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగు జరుగుతుందని, మిగిలిన అన్ని స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

హోమ్‌ ఓటింగ్‌..

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాల ప్రకారం బాలాసోర్‌ పార్లమెంటరీ నియోజక వర్గంలో హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియలో 85 ఏళ్లు పైబడిప వయో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నారు. అన్ని వర్గాల ఓటర్లు పోలింగు అత్యధిక సంఖ్యలో పాల్గొనేందుకు ప్రోత్సహించే దిశలో ఈసీఐ ఈ కార్యక్రమం చేపట్టింది.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఓటు హక్కు వినియోగించుకోనున్న 94,48,553 మంది ఓటర్లు

భువనేశ్వర్‌ యూపీడీలో ఓటింగ్‌కు సమర్థవంతమైన వ్యవస్థ

మూడో విడత పోలింగ్‌ నేడే
1/1

మూడో విడత పోలింగ్‌ నేడే

Advertisement
 
Advertisement
 
Advertisement