ఓటెత్తండహో..! | Sakshi
Sakshi News home page

ఓటెత్తండహో..!

Published Tue, Apr 16 2024 3:35 AM

- - Sakshi

● ఓటు వేసేందుకు ఆసక్తి చూపని నగరవాసులు ● అభ్యర్థులు నచ్చలేదంటూ పోలింగ్‌కు దూరం ● కనీసం ‘నోటా’నైనా వినియోగించాలని కోరుతున్న అధికారులు ● చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం

భువనేశ్వర్‌:

గర ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల్లో భువనేశ్వర్‌, శివారు ప్రాంతాల్లో జరిగిన పోలింగ్‌ రేటు పరిశీలించగా ఇటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. బరిలో ఉన్న అభ్యర్థుల పట్ల ఓటరు అనాసక్తితో కలవరపడుతున్నారు. అయితే అభ్యర్థులు నచ్చని పక్షంలో నోటా ద్వారా ఓటు వేసి తమ అమూల్యమైన అభిప్రాయం వ్యక్తీకరించేందుకు సౌలభ్యం ఉంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రంలో అట్టడుగున నోటా మీట నొక్కితే ఓటరుకు బరిలోని అభ్యర్థులు నచ్చలేదని అనుబంధ వర్గాలకు స్పష్టమవుతుంది. అయినప్పటికీ నోటా వినియోగం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ పరిస్థితి అధిగమించేందుకు భువనేశ్వర్‌ నగర పాలక సంస్థ(బీఎంసీ) పలు చైతన్యకార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది.

అంతంతమాత్రమే..

నోటా వినియోగం అంతంత మాత్రంగానే ఉంటోంది. గత ఎన్నికల్లో 2 శాతం కంటే తక్కువగా నోటా ఓట్లు నమోదయ్యాయి. నగర ఓటర్ల మనస్తత్వం బరిలో ఉన్న నాయకుల్ని కలవర పరుస్తోంది. ఈ విషయంలో బీఎంసీ కూడా ఓటర్లను చైతన్యపరచాలని యోచిస్తోంది. నగరాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండడంతో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీన పరిచే ప్రమాదం ఉంటుందనే, ఈ నేపథ్యంలో పోలింగు రేటు ఎలా పెరుగుతుందనే ఆలోచనలో పడ్డారు. పౌరునికి ఓటు రాజ్యాంగబద్ధమైన హక్కు. అధిక ఓటింగు పటిష్టమైన ప్రజాస్వామ్యానికి పట్టం గడుతుంది. ఈ దిశలో ఓటర్లను చైతన్యపరచి పోలింగు శాతం పుంజుకునేలా చేసేందుకు పలు సౌకర్యాలతో పోలింగ్‌ కేంద్రాల రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి వీధిలో పౌరులకు ప్రత్యేక కరపత్రాలు పంపిణీ చేసి ఓటు హక్కు సద్వినియోగానికి పిలుపునివ్వాలని బీఎంసీ యోచిస్తోంది. సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్‌ల ద్వారా ఓటర్లను చైతన్యపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీక్షక ఆదరణ పొందిన బ్లాగర్ల ద్వారా ఈ అవగాహన కల్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు త్వరలో తుది కార్యాచరణ ఖరారు కానుంది.

సగం మంది దూరం..

●భువనేశ్వర్‌, శివారు ప్రాంతాల ఓటింగ్‌ రేటును పరిగణనలోకి తీసుకుంటే భువనేశ్వర్‌ సెంట్రల్‌ నియోజక వర్గంలో అత్యల్ప ఓటింగు రేటు నమోదైంది. 2009లో 33.76 శాతం ఓట్లు పోలవ్వగా 2014లో జరిగిన ఎన్నికల్లో 41.33 శాతం, 2019లో 43.56 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కన నగరం నడిబొడ్డున సగానికి పైగా ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

● భువనేశ్వర్‌ ఉత్తర నియోజకవర్గంలో పరిస్థితి ఇలాగే నెలకొంది. ఇక్కడ 2009లో జరిగిన ఎన్నికల్లో 35.08 శాతం, 2014లో 41.33 శాతం, 2019లో 43.56 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఓటింగ్‌ శాతం పెరుగుతున్నా 50 శాతాన్ని తాకడం లేదు. ఏకామ్ర నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. 2009లో ఇక్కడి పోలింగు రేటు 37.19 శాతం కాగా 2014లో 45.97 శాతం, 2019లో 46.77 శాతంగా నమోదైంది. ఈ లెక్కన రాజధాని నగరంలో సమగ్రంగా పోలింగు రేటు సగం కంటే తక్కువగా కొనసాగుతుంది. నగరంలోని మొత్తం ఓటర్లలో సగం మంది ఓటు వేయడం లేదని తెలుస్తుంది.

సరిహద్దు ప్రాంతాల్లో మెరుగు..

నగరం సరిహద్దు ప్రాంతం నియోజకవర్గంలో ఓటర్ల ఆసక్తి కాస్త ప్రోత్సాహకరంగానే ఉంది. జట్నీ, జయదేవ్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ రాజధాని నగరం కంటే మెరుగ్గా ఉంటోంది. జట్నీ శాసనసభ నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 60.5 శాతం, 2014లో 70.35 శాతం, 2019లో 67.46 శాతం పోలింగ్‌ నమోదైంది. జయదేవ్‌ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో 65.18 శాతం, 2014లో 73.90 శాతం, 2019లో 75.55 శాతం ఓట్లు పోలయ్యాయి.

అత్యధిక పోలింగ్‌ అవసరం..

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక పోలింగ్‌ అవసరం. ఓటు హక్కు సద్వినియోగంతో ఓటరు పటిష్టమైన ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామిగా నిలుస్తారు. విచక్షణతో కూడిన స్వేచ్ఛతో అభీష్టం మేరకు ఓటు వేయడం పౌరుని కర్తవ్యం. ఆమోదయోగ్యమైన అభ్యర్థి లేకుంటే ఓటు హక్కు చేజార్చుకోకుండా నోటాకు ఓటు వేయడం పటిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత పటిష్టపరుస్తుంది.

నోటా పట్ల అనాసక్తి..

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు నిర్ణయం శాసనం. ఓటు హక్కుతో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా వెలుగొందాలి. ఈ ప్రక్రియలో స్వీయ విచక్షణతో స్వేచ్ఛగా ఓటు వేసేందుకు భారత ఎన్నికల వ్యవస్థ పలు సౌలభ్యాలు కల్పించింది. ఓటరుకు తగిన అభ్యర్థి బరిలో లేని పరిస్థితుల్లో తన అభిప్రాయం యథేచ్ఛగా వ్యక్తీకరించేందుకు భారత ఎన్నికల సంఘం నోటా ప్రవేశ పెట్టింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగు యంత్రం ఈవీఎం అట్టడుగున నోటా మీటను ఏర్పాటు చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చకపోతే నోటాపై ఓటు వేయాలన్న నిబంధనపై ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. పోలింగ్‌ ప్రక్రియలో పారదర్శకత ప్రదర్శించడంలో నోటా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దిశలో కూడ రాజధాని నగర ఓటర్లు వెనుకంజ వేస్తున్నారు. తరచు నోటా ఓట్లు శాతం దిగజారుతోంది. భువనేశ్వర్‌ సెంట్రల్‌ నియోజకవర్గంలో 2014లో 1.08 శాతం నోటా ఓట్లు పోలు కాగా 2019లో 0.73 శాతానికి దిగజారింది. ఏకామ్ర నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు ఎన్నికల్లో వరుసగా 1.5 శాతం, 0.77 శాతం నోటా ఓట్లు పోలయ్యాయి. భువనేశ్వర్‌ ఉత్తర నియోజకవర్గంలో 2014, 2019 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా నోటా పోలింగు శాతం సుమారు 1 శాతానికి పరిమితం అయింది. ఇక్కడ గత 2 ఎన్నికల్లో వరుసగా 1.03 శాతం, 1.13 శాతం నోటా ఓట్లు పోలయ్యాయి. రాజధాని నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జట్నీ నియోజకవర్గంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 1.81 శాతం నోటాకు ఓట్లు పడగా 2019లో గణనీయంగా దిగజారి 0.8 శాతానికి పరిమితమైంది. జయదేవ్‌ నియోజకవర్గంలో ఈ రెండు ఎన్నికల్లో నోటాకు వరుసగా 0.93 శాతం, 0.68 శాతం ఓట్లు వచ్చాయి.

Advertisement
Advertisement