గూడెం.. భక్తజనసంద్రం | Sakshi
Sakshi News home page

గూడెం.. భక్తజనసంద్రం

Published Mon, Nov 27 2023 11:48 PM

- - Sakshi

కార్తీక పౌర్ణమి సందర్భంగా తరలి వచ్చిన భక్తులు

1,200లకు పైగా సత్యనారాయణ వ్రతాలు..

దండేపల్లి: తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయం సోమవారం భక్తజనసంద్రంగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో గూడెం ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసి పోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల నుంచి 80 వేల మంది భక్తులు తరలివచ్చి సత్యదేవున్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 1,250 కిపైగా జంటలు సామూహిక సత్యనారాయణవ్రతాలు నోముకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారిని దర్శించుకునేందుకు ఘాట్‌ రోడ్డుపై ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా వచ్చి మెట్లదారిన కిందకు దిగారు. గుట్టపై ప్రధాన ఆలయం పక్కన తాత్కాలికంగా అదనపు వ్రతమండపాలు ఏర్పాటు చేశారు. ప్రసాద విక్రయాల కోసం సైతం అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ నిర్మల్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ రంగు రవికిషన్‌గౌడ్‌, ఆలయ ఈవో శ్రీనివాస్‌, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు సత్యదేవున్ని దర్శించుకున్నారు.

రెనోవేషన్‌ కమిటీ సభ్యుల హావా..

ఆలయంలో భక్తుల రద్దీ ఉన్నప్పటికీ, రెనోవేషన్‌కమిటీ సభ్యులు కొందరు తమ పలుకుబడి ఉపయోగించుకున్నారు. తమకు అనుకూలమైన వ్యక్తులకు ప్రత్యేక దర్శనాలు చేయించడంతో ఇతర భక్తులు ఇబ్బంది పడ్డారు. రెనోవేషన్‌ కమిటీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏర్పాట్ల తీరుపై అసంతృప్తి..

కార్తీక జాతర సందర్భంగా ఆలయం వద్ద చేసిన ఏర్పాట్లలో చిన్నచిన్న లోటుపాట్లు జరగడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మెట్ల దారిలో కొబ్బరి కాయలు కొట్టేందుకు ఏర్పాటు చేయడంతో, అక్కడ భక్తులు కిక్కిరి ఉండటంతో సత్యదేవున్ని దర్శించుకున్న భక్తులు క్యూలైన్లో కిందకు దిగేటప్పుడు ఇబ్బంది పడ్డారు.

అయ్యప్ప భక్తుల మాలాధారణ..

గూడెం అయ్యప్ప ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పలువురు భక్తులు అయ్యప్ప దీక్షలు స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపకులు, గురుస్వామి పురుషోత్తమాచార్యులు భక్తులక మాలాధారణ చేశారు. సుమారుగా 460 మంది మాలాధారణ చేసుకున్నట్లు గురుస్వామి తెలిపారు.

దండేపల్లి: గూడెంలో భక్తుల సామూహిక వ్రతాలు

Advertisement
Advertisement