Sakshi News home page

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

Published Tue, Apr 16 2024 1:00 AM

మాట్లాడుతున్న సైబర్‌ క్రైం ఏసీపీ విజయ్‌ కుమార్‌   - Sakshi

సైబర్‌ క్రైం ఏసీపీ విజయ్‌ కుమార్‌

హన్మకొండ: బాలలు ఆన్‌లైన్‌లో లైంగికదాడులకు గురికాకుండా ఉండడానికి తల్లిదండ్రులకు అవగాహన ఉండాలని సైబర్‌ క్రైం ఏసీపీ విజయ్‌ కుమార్‌ అన్నారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని ‘అసుంత’ భవన్‌లో ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ సహకారంతో ‘ఆన్‌లైన్‌ వేధింపుల నుంచి బాలల సంరక్షణ–తల్లిదండ్రుల పాత్ర’ అనే అంశంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంరక్షకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఏసీపీ విజయ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో తెలిసిన (పరిచయస్తులు) వారు మాత్రమే ఎక్కువ బాలలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయంలో పిల్లలు అప్రమత్తంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ ఆన్‌లైన్‌లో వారు చేస్తున్న కార్యకలాపాలను తరచూ గమనిస్తూ ఉండాలన్నారు. పిల్లలు ఏదైనా వేధింపులకు గురైనట్లు అనిపిస్తే శిక్షించకుండా వారిని సంరక్షించాలన్నారు. అంతేకాకుండా ప్రస్తుత సమాజంలో వయసుతో సంబంధం లేకుండా పురుషులు, మహిళలు సైబర్‌ క్రైమ్‌ ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ఇలాంటి ఘటనలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం ముఖ్య రిసోర్స్‌ పర్సన్‌, మైచాయిసెస్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ జన్ను క్రాంతి.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంరక్షకులకు మానవక్రమ రవాణా రూపాలు, బాలలు ఆన్‌లైన్‌లో ఏ విధంగా వేధింపులకు గురవుతున్నారు.. వారిని ఏ విధంగా సంరక్షించాలనే అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సైబర్‌ క్రైమ్‌ కానిస్టేబుల్‌ బి.కిశోర్‌ కుమార్‌, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ కోఆర్డినేటర్‌ బత్తుల కరుణ, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఎర్ర శ్రీకాంత్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు పరికి సుధాకర్‌, సింగారపు భాస్కర్‌, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఫీల్డ్‌ కోఆర్డినేటర్‌ ఇసంపల్లి సుదర్శన్‌, ఆఫీస్‌ మేనేజర్‌ అజయ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement