● మహిళా సంఘాలకు సున్నా వడ్డీ నిధులు విడుదల ● నాలుగు నెలల బకాయిలు ఖాతాల్లో జమ ● 3,584 సంఘాల ఖాతాల్లోకి రూ.2,43,61,125 ● జిల్లాలో 7,988 ఎస్‌హెచ్‌జీలు, 89,666 మంది సభ్యులు | Sakshi
Sakshi News home page

● మహిళా సంఘాలకు సున్నా వడ్డీ నిధులు విడుదల ● నాలుగు నెలల బకాయిలు ఖాతాల్లో జమ ● 3,584 సంఘాల ఖాతాల్లోకి రూ.2,43,61,125 ● జిల్లాలో 7,988 ఎస్‌హెచ్‌జీలు, 89,666 మంది సభ్యులు

Published Sat, May 25 2024 12:25 AM

● మహిళా సంఘాలకు సున్నా వడ్డీ నిధులు విడుదల ● నాలుగు నెల

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ మంజూరు చేస్తున్న రుణాలతో జిల్లాలో మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు సంఘాలు స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందుతున్నాయి. అయితే స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేందుకు వడ్డీ లేని రుణాలు కొన్నేళ్లుగా అందకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతున్న విషయం తెలిసిందే. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సకాలంలో వడ్డీ చెల్లిస్తున్న సంఘాలపై నాలుగు సంవత్సరాలుగా వడ్డీ భారం పడుతోంది. రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ మేరకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. జీరో వడ్డీ రుణాల పథకాన్ని పునరుద్ధరించడంతోపాటు నాలుగు నెలల బకాయిలు విడుదల చేసింది. పథకం పునరుద్ధరణపై ఎస్‌హెచ్‌జీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో ప్రస్తుతం 7,988 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 89,666 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరు జిల్లాలోని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని స్వయం ఉపాధికి వినియోగించుకుంటున్నారు. రుణాలు తీసుకునేలా మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చెల్లించిన వడ్డీ నగదును తిరిగి చెల్లించేంది. సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాల సభ్యులకు ఆరు నెలలకు ఒకసారి వారి ఖాతాల్లో వడ్డీ నగదు జమ చేసేది. గడిచిన నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. సున్నా వడ్డీ నిధులు విడుదల చేయడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రుణాలు తీసుకున్న వారు రుణాలతోపాటు పూర్తిస్థాయిలో వడ్డీ చెల్లిస్తున్నారు. ఆయా సంఘాలకు దాదాపు రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. అనేక మంది పేద కుటుంబాలకు చెందిన మహిళలు వడ్డీలు, రుణాల చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

3,584 సంఘాలకు లబ్ధి

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాల పంపిణీపై దృష్టి సారించింది. మొదటి విడతలో 2023 డిసెంబర్‌ నుంచి 2024 మార్చి వరకు నాలుగు నెలలకు వడ్డీ నిధులను విడుదల చేసింది. జిల్లాలోని 7,988 స్వయం సహాయక సంఘాల్లో 3,584 సంఘాల ఖాతాల్లో రూ.2,43,61,125 నగదు జమ చేసింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లిస్తున్న సంఘాలకు వడ్డీ నగదు తిరిగి అందించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న నిధులు సైతం విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement