No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Dec 7 2023 12:14 AM

- - Sakshi

బనశంకరి: హుబ్లీలో నిర్వహించిన ముస్లింల సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముస్లిం సముదాయ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఇస్తామని ప్రకటన చేయడం బెళగావి సువర్ణసౌధ శాసనసభ సమావేశాల్లో మూడవ రోజైన బుధవారం అధికార విపక్షాల మధ్య తీవ్ర గొడవకు దారితీసింది. ముఖ్యమంత్రి ప్రకటన వెనక్కి తీసుకోవాలని విపక్ష బీజేపీ డిమాండ్‌ చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఇరువర్గాల వాగ్వాదం

ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి బయట జరిగిన కార్యక్రమంలో నిధుల ప్రకటన చేయడం సరికాదన్నారు. సీఎం సమాధానమివ్వాలన్నారు. ఇందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా కేకలేశారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్‌ యుటీ.ఖాదర్‌ పదేపదే మనవి చేసినప్పటికీ ఇరుపక్షాల సభ్యులు వెనక్కి తగ్గలేదు.

బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ రైతులకు కరువు నిధులు ఇవ్వడానికి డబ్బులేదు, కానీ ముస్లిం అభివృద్ధికి రూ.10 వేలకోట్లు ఇస్తామని సీఎం ప్రకటించారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఇలా చెప్పడం తప్పు. ముఖ్యమంత్రి ఆ ప్రకటను వెనక్కి తీసుకోవాలని కోరారు. లేదంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశమిచ్చేది లేదనడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గళమెత్తారు.

సీఎం మాటల్లో తప్పేముంది: మంత్రులు

ఆరోగ్యశాఖామంత్రి దినేశ్‌ గుండూరావ్‌ సమాధానం ఇస్తూ, ముఖ్యమంత్రి రూ.10 వేలు కోట్లు ఇస్తామని చెప్పలేదు, దశలవారీగా ఇస్తామని అన్నారు, ఇందులో తప్పేముందని సమర్థించుకున్నారు. కానీ విపక్ష ఎమ్మెల్యేలు మాత్రం ముఖ్యమంత్రి సాయం ప్రకటనను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. కానీ స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నామని చెప్పి బయటికి వచ్చారు. స్పీకర్‌ యుటీ.ఖాదర్‌ స్పందిస్తూ ఇది సరికాదని, కరువు, ఉత్తర కర్ణాటక గురించి చర్చించాలని, చిన్న విషయాన్ని పట్టుకుని ఇలా చేస్తే ఎలా అని చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు పట్టించుకోలేదు. మంత్రి హెచ్‌కే.పాటిల్‌ మాట్లాడుతూ అశోక్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆ మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. విపక్ష నేతలు సీఎం వీడియో పూర్తిగా చూస్తే నిజం తెలుస్తుందన్నారు. కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సీఎంని సమర్థిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తరువాత సభ కొనసాగింది.

పరిషత్‌లో వేతన సవరణ గొడవ

ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సవరణ కమిషన్‌ గురించి సీఎం సిద్దరామయ్య సమాధానం ఇస్తారని పరిషత్‌ సభాపతి బసవరాజహొరట్టి హామీ ఇవ్వడంతో ప్రతిపక్షాలు ధర్నాను విరమించారు. బుధవారం విధాన పరిషత్‌లో సభ ప్రారంభం కాకముందే సభాపతి ముందు ప్రతిపక్షాలు ధర్నాకు దిగాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన కమిషన్‌ నివేదిక ఆలస్యం కావడానికి ప్రభుత్వ అలసత్వ ధోరణి కారణమని, దీనిపై ముఖ్యమంత్రి జవాబు ఇవ్వాలని పట్టుబట్టారు. చీఫ్‌ విప్‌ సలీం అహ్మద్‌ స్పందిస్తూ ముఖ్యమంత్రి తరఫున సభా నేత ఎన్‌ఎన్‌.బోసురాజు ఇప్పటికే సమాధానం ఇచ్చారని, సీఎం ప్రకటన అవసరం లేదని అన్నారు. దీంతో కోపోద్రిక్తులైన విపక్షసభ్యులు కోటా శ్రీనివాస పూజారి, వైఏ.నారాయణస్వామితో పలువురు నివేదిక పూర్తయినా సర్కారు స్వీకరించడం లేదని ఆరోపించారు. నివేదికను అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బు ఉందా, లేక నష్టాల్లో ఉందా అని చెప్పాలని ప్రశ్నించారు.

వాయిదా తరువాత మళ్లీ

ప్రతిపక్షాలు బ్లాక్‌మెయిల్‌ కు పాల్పడుతున్నాయని, ఉత్తర కర్ణాటక సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించాలి, సమయం వృథా చేయరాదని సలీం అహ్మద్‌ మనవిచేశారు. సభలో మరింత గందరగోళం నెలకొనడంతో సభాపతి పది నిమిషాల పాటు పరిషత్‌ను వాయిదావేశారు. సభ ప్రారంభం కాగానే మళ్లీ ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. దీంతో సీఎంతో మాట్లాడి దీనిపై సమాధానం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు.

అసెంబ్లీ బయట కులాసా..

సెల్ఫీ తీసుకుంటున్న విద్యార్థులు

విధాన పరిషత్‌లో వేతన సవరణ గురించి ప్రతిపక్ష ఎమ్మెల్సీల ధర్నా
1/3

విధాన పరిషత్‌లో వేతన సవరణ గురించి ప్రతిపక్ష ఎమ్మెల్సీల ధర్నా

2/3

భోజనాలు ఆరగిస్తున్న బాలికలు
3/3

భోజనాలు ఆరగిస్తున్న బాలికలు

Advertisement
 
Advertisement