Sakshi News home page

పాలమూరులో ప్రకంపనలు!

Published Wed, Mar 27 2024 12:55 AM

- - Sakshi

ఫోన్‌ ట్యాపింగ్‌ ఎపిసోడ్‌లో మలుపులు

మహబూబ్‌నగర్‌ జిల్లాకు మరకలు

అప్పటి విపక్ష నేతలు, వ్యాపారులు, రియల్టర్ల ఫోన్లు ట్యాపింగ్‌

ఓ మాజీ మంత్రి, పలువురు పోలీస్‌ అధికారుల ప్రమేయం

డీజీపీకి ఎమ్మెల్యే యెన్నం ఫిర్యాదుతో కలకలం

ఏ–1 నిందితుడు ఇంటెలిజెన్స్‌ మాజీ ఐజీ అత్తగారిల్లు ఇక్కడే..

ఊహాగానాల వెల్లువ.. హాట్‌టాపిక్‌గా మారిన వ్యవహారం

సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు టార్గెట్‌గా ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడినట్లు విచారణలో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఆయన ఇంటికి సమీపంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలు ఏర్పాటు చేసి.. నిరంతర నిఘా పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహి స్తున్న క్రమంలో ఈ జిల్లాలోనూ ట్యాపింగ్‌ వ్యవహారం నడిచిందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. మాజీ ఐజీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన ఎస్‌ఐబీ (పొలిటికల్‌) వింగ్‌లో ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలకంగా వ్యహరించిన ఏ–2 నిందితుడు ప్రణీత్‌రావు ఇచ్చిన వివరాల ఆధారంగా తెలంగాణలో కేసు విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌లోని ఓ జిల్లాలో వార్‌రూం ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి అధికార, విపక్షనేతల ఫోన్ల ట్యాపింగ్‌కు చేసినట్లు ప్రచారం జరగగా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. తాజాగా ఎమ్మెల్యేనే ఫిర్యాదు చేసిన క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ సిట్‌ తనిఖీలు చేపట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై తొలుత హైదరాబాద్‌ కేంద్రంగా విచారణ ప్రారంభం కాగా.. వరంగల్‌కు చేరింది. తాజాగా ఆ మరకలు మహబూబ్‌నగర్‌ను అంటుకోగా.. హాట్‌ టాపిక్‌గా మారింది. తన ఫోన్‌తో పాటు జిల్లాలోని అప్పటి విపక్ష నాయకులు, బడా వ్యాపారులు, రియల్టర్ల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని.. ఇందులో ఓ మాజీ మంత్రితో పాటు పలువురు పోలీస్‌ అధికారుల ప్రమేయం ఉందని ఎమ్మెల్యే యెన్నం మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన వారు కావడం.. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి ఏ–1గా చేర్చిన ఇంటెలిజెన్స్‌ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు అత్తగారు కూడా ఇక్కడే (కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం) కావడంతో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఎమ్మెల్యే యెన్నం ఫిర్యాదుతో..

టీవల సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని.. 2018–23 కాలంలో అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ విధానాలను విమర్శించే వారు, ప్రతిపక్ష పార్టీలతో సంబంధం ఉన్నవారు, ప్రముఖ వ్యాపారవేత్తల మొబైల్‌ ఫోన్లను ట్యాప్‌ చేశారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో డీజీపీ, సిట్‌ అధికారిని కలిసి ఫిర్యాదు చేయడం పాలమూరులో కలకలం రేపింది. హైదరాబాద్‌లో, మహబూబ్‌నగర్‌ పట్టణంలోని స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ)లో పనిచేస్తున్న కొంతమంది పోలీస్‌ అధికారులతో ఓ మాజీ మంత్రి కుమ్మక్కయ్యారని.. ఆయన సూచనలతో అనధికారికంగా ఫోన్లు ట్యాపింగ్‌ చేశారని పలు ఉదాహరణలతో వినతిపత్రం సమర్పించారు. ట్యాపింగ్‌తో సేకరించిన సమాచారం ఆధారంగా ఆ మాజీ మంత్రి, పోలీస్‌ అధికారులు బెదిరింపులు, బ్లాక్‌ మెయిలింగ్‌లకు పాల్పడ్డారని.. ఈ మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లాకు ఒక కంప్లైంట్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరుగా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులతో పాటు అధికారులు సైతం సాధారణ కాల్స్‌ స్వీకరించకపోయేవారని..‘నార్మల్‌ కాల్‌ వద్దు.. వాట్సప్‌ కాల్‌ చేయండి’ అంటూ సమాధానం చెప్పేవారని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

త్వరలోసిట్‌ తనిఖీలు ?

గతంలోనే ఆరోపణలు

2018లో ‘ఎన్నికల అఫిడవిట్‌ ట్యాంపరింగ్‌’ కేసులో.. 2022లో మంత్రి హత్యకు కుట్ర కేసు నమోదైన క్రమంలో పలువురి ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మహబూబ్‌నగర్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ విభాగాలు ఏర్పాటు చేసి.. ఓ సీఐ ద్వారా ముఖ్య రాజకీయ నాయకులు, వారి అనుచరులు, బంధువుల ఫోన్‌ నంబర్లను ట్యాపింగ్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. వీటిపై గత ప్రభుత్వ హయాంలోనే పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎవరూ పట్టించుకోకపోవడం.. పైగా వేధింపుల నేపథ్యంలో వారు మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది.

Advertisement

What’s your opinion

Advertisement