మరో అవకాశం.. | Sakshi
Sakshi News home page

మరో అవకాశం..

Published Fri, Dec 15 2023 12:56 AM

- - Sakshi

ఓటరు నమోదుకు మరో చాన్స్‌ ఇచ్చిన ఈసీ

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌/ అచ్చంపేట/మద్దూరు: ఓటరు నమోదుకు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రంలో త్వరలోనే గ్రామ పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికలు రానుండటంతో ఎన్నికల సంఘం సదరు ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే ఏటా ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకటిస్తుండగా.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలుమార్లు అవకాశం ఇచ్చింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అక్టోబర్‌లో తుది జాబితా ప్రకటించగా నవంబర్‌ రెండో వారంలో అనుసంధాన జాబితా ఇచ్చింది. దాని ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు.

జనవరి 5 వరకు గడువు

ఎన్నిలక సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి ఓటరు జాబితా సవరణ చేపట్టనున్నారు. బూత్‌ లెవల్‌ అధికారి (బీఎల్వో) మళ్లీ ఇంటింటికి తిరిగి కొత్త దరఖాస్తుతోపాటు మార్పులు, చేర్పులు, సవరణలుంటే వివరాలు సేకరిస్తారు. ఈ ప్రక్రియ వచ్చే జనవరి 5 వరకు చేపట్టనున్నారు. అదే నెల 6న ముసాయిదా జాబితా ప్రకటించి.. దీనిపై 22 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వీటిపై బీఎల్‌ఓలు మారోసారి సర్వే చేపట్టి పరిష్కరిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2న జాబితా పరిశీలన, అదే నెల 8న తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.

వచ్చే నెల ఒకటి ప్రామాణికం..

జాబితాలో పేరు లేనివారు కొత్త దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చేనెల 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు అర్హులని ఎన్నికల సంఘం పేర్కొంది. వీరు సీఈఓ వెబ్‌సైట్‌లో గాని, స్థానికంగా ఉండే బీఎల్‌ఓల వద్ద గాని ఫారం– 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రిబవరి ఇచ్చే తుది జాబితాలో పేరుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చు.

ప్రత్యేక క్యాంపెయిన్‌

పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహించనున్నారు. శని, ఆదివారాలు ప్రత్యేకంగా కార్యక్రమం జరగనుండగా.. ఎన్నికల సంఘం త్వరలోనే తేదీలను ప్రకటించనుందని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉండేవారు కొత్తగా నమోదుతోపాటు మార్పులు, చేర్పులు, తొలగింపు కోసం దరఖాస్తులను బీఎల్వోలకు అందించాల్సి ఉంటుంది.

ప్రచారం కల్పిస్తున్నా..

ప్రజాస్వామ్యంలో ఓటు విలువ వెలకట్టలేనిది. ఓటు అనే బ్రహ్మస్త్రంతో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే అవకాశముంది. అయితే అర్హులైన వారు ఓటుహక్కు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం చేస్తున్నా పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఎన్నికల కమిషన్‌ కల్పిస్తున్న అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

నియోజకవర్గాల వారీగా..

మ్మడి జిల్లాలో ప్రస్తుతం జిల్లాలో 31,35,060 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో నియోజకవర్గాల వారిగా పరిశీలిస్తే.. నాగర్‌కర్నూల్‌లో 2,32,780 మంది, అచ్చంపేటలో 2,42,129, కొల్లాపూర్‌లో 2,34,167, కల్వకుర్తిలో 2,41,762, వనపర్తిలో 2,71,151, నారాయణపేటలో 2,31,896, కొడంగల్‌లో 2,36,625, మక్తల్‌లో 2,42,254, దేవరకద్రలో 2,35,154, గద్వాలలో 2,56,605, అలంపూర్‌లో 2,37,938, మహబూబ్‌నగర్‌లో 2,52,355, జడ్చర్లలో 2,20,244 మంది ఓటర్లు ఉన్నారు.

ఓటు హక్కు నమోదు ఇలా..

తప్పులకు ఆస్కారం లేకుండా చర్యలు

పకడ్బందీగా ఓటరు జాబితాల

రూపకల్పన

కసరత్తు ప్రారంభించిన

అధికార యంత్రాంగం

స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌)– 2024 షెడ్యూల్‌ ఖరారు

నమోదు చేసుకోవాలి

కేంద్ర ఎన్నికల సంఘం 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. సీఈఓ వెబ్‌సైట్‌లో గాని, బీఎల్‌ఓ వద్ద గాని ఫారం– 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రిబవరిలో తుది జాబితా విడుదల చేస్తారు. ప్రతిఒక్కరు ఓటరు జాబితాలో పేర్లను సరిచూసుకోవాలి.

– గోపిరాం, ఆర్డీఓ, అచ్చంపేట

1/1

Advertisement
Advertisement