కాలువలోకి దూసుకెళ్లిన కారు | Sakshi
Sakshi News home page

కాలువలోకి దూసుకెళ్లిన కారు

Published Mon, May 20 2024 4:15 AM

కాలువలోకి దూసుకెళ్లిన కారు

చాట్రాయి: ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పిన ఓ కారు పంటకాలువలోకి దూసుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి. విస్సన్నపేట నుంచి వస్తున్న ఓ కారు చనుబండ గ్రామంలోకి వచ్చేసరికి ఇద్దరు మైనర్లతో ముందు వెళుతున్న ద్విచక్రవాహనం అకస్మాత్తుగా మలుపు తిప్పడంతో ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి కారు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో కారు కాలువపై ఉన్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి గాయాలు కాలేదు. అయితే ఇద్దరు బాలురకు స్వల్ప గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

గురజలో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ

ముదినేపల్లి రూరల్‌: మండలంలోని గురజ రహదారి సమీపంలో శనివారం రాత్రి గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీతో స్థానికులు, వాహనచోదకులు భయబ్రాంతులకు గురయ్యారు. మండవల్లి మండలం పెరికేగూడెం నుంచి గుడ్లవల్లేరు మండలం డోకిపర్రుకు ఒక ప్రముఖ సంస్ధ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. ఈ పైప్‌లైన్‌ గురజ సమీపంలోని పెట్రోల్‌ బంకుకు ఎదురుగా పెద్ద శబ్ధంతో లీకేజీ కావడంతో స్థానికులు ఆందోళనకు గురై ఇళ్లల్లోని విద్యుత్‌ లైట్లను ఆర్పివేశారు. అదృష్టవశాత్తు మంటలు రాకపోవడంతో పెద్దప్రమాదం తప్పినట్లు స్థానికులు చెప్పారు. పైప్‌లైన్‌ లీకేజీ జరిగిన ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న టెలిఫోన్‌ స్తంభాన్ని దొంగిలించేందుకు గుర్తు తెలియని వ్యక్తి జేసీబీతో తవ్వడం వల్లే ఈ లీకేజీకి కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట్‌కుమార్‌ సిబ్బందితో ఘటనా స్ధలానికి చేరుకుని వాహనాల రాకపోకలను నిలిపివేసి గుడివాడ అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. పైప్‌లైన్‌ ఏర్పాటు చేసిన సంస్థ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. గతంలో సైతం ఇదే పైప్‌లైన్‌ పెనుమల్లి శివారు సింగారం వద్ద లీక్‌ అయి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పైప్‌లైన్‌ రహదారి వెంబడి ఉన్నందువల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేశారు.

పాము కాటుకు మహిళ మృతి

టి.నరసాపురం: పాము కాటుకు గురై ఓ మహిళ మృతి చెందింది. ఎస్సై దుర్గామహేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మక్కినవారిగూడెం గ్రామానికి చెందిన రాజుబోయిన రామలక్ష్మి (26) శనివారం ఆయిల్‌పామ్‌ తోటలో గెలల కోసే పనికి వెళ్లింది. అక్కడ పాము కాటు వేయడంతో గమనించిన తోటి కూలీలు టి.నరసాపురం పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement