Sakshi News home page

1న సత్యదేవుని ఆలయ వార్షికోత్సవం

Published Fri, Mar 29 2024 2:25 AM

- - Sakshi

సత్యదేవుని

ఆలయం

13వ సంవత్సరంలోకి నూతనాలయం

వేడుకలు ఘనంగా

నిర్వహించేందుకు ఏర్పాట్లు

అన్నవరం: సత్యదేవుని ఆలయ పునర్నిర్మాణం జరిగి వచ్చే నెల ఒకటో తేదీకి పుష్కర కాలం.. అంటే 12 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఆలయం 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 1891 సంవత్సరంలో (ఖర నామ సంవత్సరం) శ్రావణ శుద్ధ విదియ నాడు రత్నగిరిపై సత్యదేవుడు ఆవిర్భవించినట్టు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. స్వామివారు ఆవిర్భవించి 133 సంవత్సరాలు పూర్తయ్యింది. స్వామివారి పురాతన ఆలయం శిథిలావస్థకు చేరడంతో 2011లో అప్పటి కార్యనిర్వహణాధికారి కె.రామచంద్ర మోహన్‌ హయాంలో సత్యదేవుడు, అమ్మవారు, ఈశ్వరుల మూలవిరాట్టులను కదపకుండా.. ఆ మూర్తులకు పకడ్బందీ రక్షణ ఏర్పాట్లు చేసి, నూతన ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయాన్ని ఫాల్గుణ బహుళ సప్తమి (మార్చి 14, 2012) నాడు అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా కలశ స్థాపన చేసి ప్రారంభించారు. అప్పటి నుంచీ తెలుగు తిథుల ప్రకారం ఫాల్గుణ బహుళ సప్తమి నాడు నూతన ఆలయ కలశ ప్రతిష్ఠ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే సందర్భంగా వచ్చే నెల ఒకటో తేదీన ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం కూడా ఆలయ ఈఓగా రామచంద్ర మోహనే ఉండటం విశేషం. ఆ రోజు తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవారికి, శంకరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. స్వామివారికి బూరెలు, పులిహోర, రవ్వకేసరి ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేస్తారు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు.

Advertisement

What’s your opinion

Advertisement