వెలుగు తోరణంలో చీకటి కోణం | Sakshi
Sakshi News home page

వెలుగు తోరణంలో చీకటి కోణం

Published Tue, Nov 7 2023 11:52 PM

బాణసంచా దుకాణం  - Sakshi

ప్రమోదం మాటున..పొంచి ఉండే ప్రమాదాలు

దీపావళి వేళ నిబంధనలు పాటించాలి

జిల్లాలో సుమారు రూ.24 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం

రాయవరం: ప్రతి కుటుంబం ఆనందంగా జరుపుకునే పండగ దీపావళి. వెలుగును పంచే దీపాలు ఒకవైపు, బాణసంచా మోతలు.. చిన్నారుల కేరింతలు మరోవైపు. పర్యావరణ హితంగా..దీపాలతో నిర్వహించాల్సిన పర్వదినాన పిల్లల నుంచి పెద్దల వరకు బాణసంచా వినియోగానికే ప్రాధాన్యమిస్తారు. ఈ నెల 12న దీపావళి రోజు రెండు గంటల పాటే టపాసులు కాల్చాలి. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే వీటిని కాల్చాలి. తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసులకే అనుమతి ఉంటుందంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నిబంధనలు పాటిస్తేనే నిజమైన దీపావళి సందడి నెలకొంటుందని పలువురు పేర్కొంటున్నారు.

అధిక శబ్దంతో ఇబ్బంది

బాణసంచా కాల్చేటప్పుడు 125 నుంచి 130 డెసిబుల్స్‌ శబ్దం వెలువడుతుంది. సాధారణ పరిస్థితుల్లో 60 నుంచి 90 డెసిబుల్స్‌ దాటితే వినికిడి లోపం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. శబ్ద తీవ్రత అధికమైతే వినికిడి సమస్యలు, రక్తపోటు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తగా లేకుంటే నిప్పురవ్వలు పడి కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది.

ఎన్‌వోసీలు జారీ

జిల్లాలో ద్రాక్షారామ, రాయవరం, మండపేట, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో బాణసంచా తయారీ కేంద్రాలున్నాయి. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ఎన్‌వోసీలు జారీ చేశాయి. కమర్షియల్‌ టాక్స్‌ శాఖ కూడా ఎంత జీఎస్‌టీ వసూలు చేయాలన్న అంశంపై తనిఖీలు నిర్వహించింది.

లైసెన్స్‌ ఉన్నవారే తయారు చేయాలి

లైసెన్స్‌ ఉన్నవారు మాత్రమే బాణసంచా తయారు చేయాలి. అక్రమంగా బాణసంచా నిల్వలు ఉంచినా, తయారు చేసినా సమాచారం అందిస్తే, ప్రమాదాలను ముందుగానే నివారించడానికి వీలుంటుంది. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవు.

– ఎస్‌.శ్రీధర్‌,

జిల్లా ఎస్పీ, అమలాపురం.

అవగాహన కల్పిస్తున్నారు

నిబంధనల మేరకు దీపావళి సామగ్రి తయారీని చేపడుతున్నాం. నిబంధనలు పాటిస్తే తయారీదారులకే మంచిది. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ అవగాహన కల్పిస్తున్నారు. దీపావళికి వాతావరణం కూడా సహకరిస్తే వ్యాపారం సాగుతుంది.

– వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి, అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల బాణసంచా తయారీదారుల అసోసియేషన్‌, రాయవరం

తక్షణం సమాచారమివ్వాలి

దీపావళి సమయంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. అనుమతులు ఉన్నవారు మాత్రమే బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు చోటు చేసుకోకుండా అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాదాలు చోటు చేసుకుంటే తక్షణం అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించాలి.

– ఎన్‌.పార్థసారధి,

జిల్లా అగ్నిమాపక అధికారి, అమలాపురం

జిల్లాలో పరిస్థితి ఇదీ..

జిల్లాలో ఫారమ్‌–20 కలిగిన బాణసంచా తయారీ కేంద్రాలు 17 ఉన్నాయి. బాణసంచా అమ్మకాలు చేసేందుకు ఫారమ్‌–24 కలిగిన వ్యాపారులు 12 మంది ఉన్నారు. ఫారమ్‌–24 కలిగినవారు శివకాశి తదితర ప్రాంతాల నుంచి బాణసంచా తెచ్చుకుని అమ్మకాలు చేస్తుంటారు. అందుకు వీరికి అనుమతి ఉంటుంది. దీపావళికి రెండు రోజుల ముందుగా తాత్కాలికంగా అనుమతిని తీసుకుని, బాణసంచా దుకాణాలు వేస్తుంటారు. గతేడాది 449 దుకాణాలకు అగ్నిమాపక శాఖ తాత్కాలికంగా అనుమతులు ఇవ్వగా, ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. జిల్లాలో రూ.24 కోట్ల వరకు బాణసంచా వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

లైసెన్స్‌ ఉన్న దుకాణాల వద్దే బాణసంచా కొనుగోలు చేయాలి.

పెద్దల పర్యవేక్షణలోనే చిన్నారులు బాణసంచా కాల్చాలి.

విద్యుత్‌ తీగల కింద నిలబడి టపాసులు కాల్చరాదు. బాణసంచా కాల్చే సమయంలో వదులుగా ఉన్న కాటన్‌ దుస్తులను ధరించాలి.

కాకర పువ్వొత్తులు కాల్చిన వెంటనే వాటిని ఆర్పేందుకు సమీపంలో నీళ్ల డబ్బాను ఉంచుకోవాలి.

బాణసంచా కాల్చే సమయంలో గ్యాస్‌ సిలిండర్ల రెగ్యులేటర్లు ఆపు చేసుకోవాలి.

భూ చక్రాలు కాల్చేటప్పుడు చెప్పులు ధరించాలి. కంటికి అద్దాలు ధరిస్తే ఇంకా మంచిది.

చెవుల్లో దూది పెట్టుకుంటే పేలుడు శబ్దాలతో చెవులకు ప్రమాదం ఉండదు.

ముక్కులోకి పొగ వెళ్లకుండా మాస్క్‌లు ధరిస్తే మంచిది.

ప్రమాదం సంభవిస్తే 100, 101 నంబర్లకు సమాచారం ఇవ్వాలి.

ఇలా చేయకండి

పేలని టపాసుల వద్దకు వెళ్లి తొంగి చూడరాదు.

చేతుల్లో బాంబులు పేల్చడం హానికరం.

గుడిసెలున్న ప్రాంతంలో తారాజువ్వలు వేయరాదు.

జేబుల్లో బాణసంచా పెట్టుకోరాదు.

విద్యుత్‌ బల్బులు, డెకరేటివ్‌ బల్బులు అధికంగా పెట్టరాదు. తద్వారా విద్యుత్‌షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

1/3

2/3

3/3

Advertisement
Advertisement