ఇక ‘స్థానిక’ పోరు.. | Sakshi
Sakshi News home page

ఇక ‘స్థానిక’ పోరు..

Published Thu, May 23 2024 1:40 AM

ఇక ‘స్థానిక’ పోరు..

గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారుల కసరత్తు
● జిల్లాలో 481 గ్రామపంచాయతీలు ● గ్రామాల్లో మొదలుకానున్న సందడి

చుంచుపల్లి: రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించింది. జిల్లాకు అవసరమైన 1,250 బ్యాలెట్‌ బాక్సులను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి తెప్పించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాల్లో సవరణలు, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. జిల్లాలో 481 గ్రామపంచాయతీలు ఉండగా, 2019 జనవరిలో పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మరో రెండు భద్రాచలం, సారపాక పంచాతీయలకు ఎన్నికలు జరపలేదు. ఇక రిజర్వేషన్‌ ప్రకారం అభ్యర్థులు లేకపోవడంతో పాల్వంచ మండలంలోని సంగం, నారాయణరావుపేట పంచాయతీలకు సైతం ఎన్నికల ప్రక్రియ చేపట్టలేదు. ఆ సమయంలో 54 గ్రామపంచాయతీలు, 820 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది జనవరి 31తో ముగిసింది. దీంతో గత ఫిబ్రవరి 2 నుంచి ప్రభుత్వం ప్రత్యేక అధికారులతో పల్లె పాలన సాగిస్తోంది.

గతంలో కొంత కసరత్తు..

గతేడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. తక్షణమే కొత్త ప్రభుత్వం ఆరు గ్యారెంటీల హామీల అమలుపై దృష్టిపెట్టింది. అనంతరం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులు కొంతవరకు కసరత్తు చేశారు. సిబ్బంది కేటాయింపు, ఓటర్ల జాబితాలో సవరణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు వంటివి పూర్తిగా చేపట్టారు. ఆ లోగా పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుతం అవి కూడా పూర్తికావడంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆశావహుల్లో ఉత్సాహం..

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతుండటంతో ఆశావాహుల్లో ఉత్సాహం మొదలైంది. రాజకీయంగా ఎదిగేందుకు సర్పంచ్‌ పదవిని తొలిమెట్టుగా భావిస్తూ.. పలువురు పోటీకి సిద్ధమవుతున్నారు. గతంలో ఓడిపోయినవారు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ఆయా పార్టీల నాయకులు, యువకులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారు. పలువురు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఇటీవల అధికార కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో పాత, కొత్త నేతలతో ఆశావహుల సంఖ్య పెరిగి అధికార పార్టీలో పోటీ తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు పార్టీ పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

2019లో పంచాయతీ ఎన్నికల తీరు

విడత పంచాయతీలు వార్డులు మండలాలు

మొదటి 174 1,534 7

రెండో 142 1,294 7

మూడో 163 1,404 7

రిజర్వేషన్ల వర్తింపుపై సందిగ్ధం

గతంలో ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు ప్రకటించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించి రిజర్వేషన్లను పదేళ్లకు పొడిగించింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో వర్తించిన రిజర్వేషనే వచ్చే ఎన్నికల్లోనూ ఉంటుంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే నెల 4 వరకు లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం బీసీ కమిషన్‌తో అభిప్రాయ సేకరణ, సర్వే నిర్వహించి రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటోందో చూడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement