Sakshi News home page

బీజేపీ ‘మహా’ విజయం

Published Fri, Feb 24 2017 12:15 AM

బీజేపీ ‘మహా’ విజయం - Sakshi

దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో నిండా తలమునకలై ఉన్న బీజేపీకి తీపి కబురు అందింది. గురువారం వెలువడిన మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ఘన విజయాన్ని అందించాయి. బీజేపీ అటు కాంగ్రెస్‌తోపాటు ఇటు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)ని కూడా చిత్తు చేసింది. పది మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎనిమిదింటిని తన ఖాతాలో వేసుకుంది.

దేశ ఆర్థిక రాజధానిగా, మినీ భారత్‌గా పేరొందిన ముంబై మహా నగరంలో మిత్ర పక్షం శివసేనతో నువ్వా నేనా అన్న స్థాయిలో తలపడి గణనీయమైన స్థానాలు కైవసం చేసుకుంది. ఆ మహా నగరంలో ఎల్లకా లమూ మీ గుత్తాధిపత్యం సాగదన్న సందేశాన్ని శివసేనకు పంపింది. ఈ ఫలితాలు పార్టీగా బీజేపీకి మాత్రమే కాదు... వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఫడణవీస్‌కు కూడా కొండంత బలాన్నిచ్చాయి. ఫడణవీస్‌ ఈ ఎన్నికల్లో అంతా తానే అయి ప్రచారం చేశారు. పెద్ద నోట్ల రద్దు పర్యవసానంగా జనంలో ఏర్పడిందంటున్న అసంతృప్తిని విపక్షాలు సొమ్ము చేసుకోలేకపోయాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. నాలుగు రోజులనాడు వెలువడ్డ ఒడిశా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల షాక్‌ నుంచి ఇంకా కోలుకోలేకుండా ఉన్న కాంగ్రెస్‌ను మహారాష్ట్ర ఓటర్లు చావుదెబ్బ తీశారు.

2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లోనూ, అనంతరం జరిగిన వివిధ  అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరస ఓటములు చవిచూసిన కాంగ్రెస్‌ ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేదని తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. జేడీ(యూ), ఆర్జేడీలతో జట్టు కట్టడం వల్ల బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దో గొప్పో సాధించగలిగిన కాంగ్రెస్‌... అంతకు ముందుగానీ, ఆ తర్వాతగానీ ఏ ఎన్నికల్లోనూ గెలవడం మాట అటుంచి దీటైన పోటీ ఇవ్వలేక పోయింది. తాజా ఎన్నికలు సైతం దానికి ఇప్పట్లో భవిష్యత్తులేదన్న సంగతిని ధ్రువపరుస్తున్నాయి. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కీలకపాత్ర పోషిం చాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ దయనీయమైన స్థితిలో పడింది. ఇప్పుడు మహారాష్ట్ర కూడా కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిందని తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం మూడు స్థానాలు సాధించి కార్పొరేషన్‌లో తొలిసారి అడుగుపెట్టింది.

కేంద్రంలో లేదా రాష్ట్రంలో పాలన చలాయించే ఏ పార్టీకైనా బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అత్యంత కీలకమైనది. దేశంలోనే సంపన్నవంతమైన ఆ కార్పొరేషన్‌లో తమ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీలు ఆశిస్తాయి. కానీ కాంగ్రెస్‌కు అది చాన్నాళ్లుగా దూరంగానే ఉంది. రెండు దశాబ్దాల నుంచి ముంబై శివసేన, బీజేపీ కూటమి పాలనలో ఉంది. ఈసారి రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేశాయి. 227 స్థానాలున్న బీఎంసీలో ఇరుపక్షాల్లో ఎవరూ అవసరమైన 114 స్థానాల కనీస మెజారిటీకి చేరువ కాలేకపోయినా... శివసేన 84, బీజేపీ 82 స్థానా లతో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. పర్యవసానంగా ఎన్నికల ప్రచారంలో పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న ఆ పార్టీలు రెండూ ముంబైలో ఇప్పుడు కలిసి ప్రయాణించక తప్పని స్థితి ఏర్పడింది.

 31 స్థానాలతో మూడో స్థానంలో నిలి చిన కాంగ్రెస్‌ ఇప్పుడు తన కార్పొరేటర్లను గోడ దూకకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ముంబైలో బీజేపీ సాధించిన విజయం ఎన్నదగ్గది. ఎన్నో ఏళ్లనుంచి శివసేనతో కలిసి పాలనాధికారాన్ని పంచుకుంటున్నా అదెప్పుడూ జూనియర్‌ పక్షమే. ఈసారి ఒంటరిగా పోటీచేసి ప్రస్తుతం తనకున్న 31 స్థానాలనుంచి ఆ పార్టీ ఒక్కసారిగా 82కి ఎగబాకింది. అటు శివసేన 89 స్థానాల నుంచి 84కు దిగిపో యింది. అందరికంటే అన్యాయమైపోయిన పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన (ఎం   ఎన్‌ఎస్‌). ఆ పార్టీ 28 స్థానాలనుంచి 7కు పడిపోయింది. మరాఠాల ఆత్మ గౌరవం పేరిటా, దేశభక్తి పేరిటా ముంబైలో అడపా దడపా అది దుందుడుకు చర్యలకు దిగినా మరాఠా ఓట్లన్నీ చివరకు శివసేనకే వెళ్లాయని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క ముంబైలోనే కాదు.. నాసిక్‌లో సైతం ఎంఎన్‌ఎస్‌కు నిరాశే ఎదురైంది. 2012 ఎన్నికల్లో విజేతగా నిలిచిన ఆ స్థానంలో ఇప్పుడది అట్టడుగుకు చేరింది.

స్థానిక ఎన్నికల్లో సాధారణంగా స్థానిక సమస్యలే కీలకపాత్ర పోషిస్తాయి. పౌర సదుపాయాలు, అభివృద్ధి వంటివే ప్రధానంగా చర్చకొస్తాయి. అందువల్లే కావొచ్చు.. పెద్ద నోట్ల రద్దు, అందువల్ల ఏర్పడిన సమస్యల గురించి ఎంతగా ప్రచారం చేసినా కాంగ్రెస్, ఎన్‌సీపీ తదితర పక్షాలకు అది పెద్దగా ఉపయోగ పడలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు గెల్చుకున్న శివసేన తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి పెను సవాల్‌ ఎదుర్కొంది. హోరాహోరీ జరిగిన పోరులో తాను బలహీనపడ్డానని రుజువు చేసుకుంది. ముంబైలో గెలిస్తే పారదర్శక పాలన అంది  స్తామన్న ముఖ్యమంత్రి ఫడణవీస్‌ హామీ నేరుగా శివసేన పాలన తీరుతెన్నులపై నిశిత విమర్శ. ఇన్నేళ్లుగా కూటమిలో భాగస్వామిగా ఉన్నా శివసేన పనితీరుతో తమకు ఏకీభావం లేదని... అది సమర్ధవంతమైన, నీతివంతమైన పాలన అందిం చలేకపోయిందని పరోక్షంగా ఆయన చెప్పినట్టయింది.  

10 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్‌లు, 283 పంచాయతీ సమితు లకు ఎన్నికలు జరగ్గా అన్నిచోట్లా బీజేపీ హవా నడిచింది. నగర ఓటర్లంతా కాంగ్రె స్‌ను, దానికి చాన్నాళ్లపాటు మిత్రపక్షంగా ఉన్న ఎన్‌సీపీని గుత్తగా తిరస్క రించారని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మెజారిటీ జడ్‌పీలు, పంచాయతీ సమితుల్లో సైతం ఆ రెండు పార్టీలకూ నిరాశే మిగలొచ్చునని ఫలితాల సరళి చెబుతోంది. ముంబై తర్వాత కీలకమైన పూణేలో పదిహేనేళ్లనుంచి పాలక పక్షంగా ఉంటున్న ఎన్‌సీపీని బీజేపీ దెబ్బతీసింది. దాంతోపాటు నాగ్‌పూర్, నాసిక్, షోలాపూర్, అమరావతి, అకోలా, పింప్రిచించ్వాడ్‌లను కూడా అది గెల్చుకుంది. పూణే, పింప్రిచించ్వాడ్‌లు రెండూ ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌కు ప్రతిష్టాత్మకమైనవి. ఆ రెండూ ఆయన కుటుంబీకుల పాలనలోనే నడుస్తున్నాయి. అక్కడ పవార్‌ ప్రభ కొడిగడుతున్నదని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి. మొత్తానికి కీలకమైన మహారాష్ట్రలో తాను తిరు గులేని శక్తిగా ఆవిర్భవించానని ఈ ఎన్నికల్లో బీజేపీ నిరూపించుకుంది.

 

Advertisement
Advertisement