చంద్రబాబు అరాచకాలపై దండెత్తండి: వైఎస్సార్‌సీపీ | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అరాచకాలపై దండెత్తండి: వైఎస్సార్‌సీపీ

Published Sat, Apr 22 2017 10:17 PM

చంద్రబాబు అరాచకాలపై దండెత్తండి: వైఎస్సార్‌సీపీ - Sakshi

హైదరాబాద్‌: ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా.. అందుబాటులో ఉండే ప్రతి మాద్యమం ద్వారా ప్రజలు చంద్రబాబు నాయుడి అరాచకాలపై దండెత్తాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు దురాగతాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా నిలదీయాలని కోరింది.

ఏపీ సీఎం చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలపై ప్రజాస్వామిక యుద్ధం ప్రకటించాలన్న వైఎస్ జగన్‌ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను చంద్రబాబు ప్రభుత్వం హరిస్తున్నదని, ఈ దమనకాండకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియా ద్వారా చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న దాడిని ప్రతిఘటించాలని పిలుపునిచ్చింది..

ఈ సందర్భంగా చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన సోషల్‌ మీడియా విభాగం.. గడిచిన కొన్నేళ్లుగా వైఎస్‌ కుటుంబంపై అత్యంత హేయమైన అసత్యప్రచారాలు చేస్తోన్న వైనాన్ని వైఎస్సార్‌సీపీ గుర్తుచేసింది. ఈ మేరకు టీడీపీ రూపొందించిన కొన్ని క్లిప్పింగ్‌లను విడుదలచేసింది. 'ఆయన చేసిన దాడిని వైఎస్సార్‌సీపీ అభిమానులు సమర్థవంతంగా తిప్పికొట్టడంతో చంద్రబాబు తట్టుకోలేక, ఏకంగా పోలీసులను రంగంలోకి దింపి భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు'అని ప్రకటనలో పేర్కొన్నారు.

(వైఎస్‌ జగన్‌ను కించపరుస్తూ టీడీపీ సోషల్‌ మీడియా వికృత చేష్టల్లో ఇది ఒకటి)

అధికార మదం తలకెక్కిన స్థితిలో పోలీసుల్ని పంపి చేయించిన దాడులకు ఎవ్వరూ భయపడరని, ప్రజల గొంతుగా, ప్రజలు తమ వాణిగా సోషల్‌ మీడియా ద్వారా చేస్తున్న ప్రతిఘటనను మరింత శక్తిమంతంగా, మరింత బలంగా చేయాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ప్రజల అభిప్రాయం దేవుడి మాటతో సమానం అన్నది నానుడి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న దుర్మార్గాలను, అసత్య ప్రచారాలను లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఆడుకునే మరో మీడియాగా రూపాంతరం చెందిన సోషల్‌ మీడియాను తట్టుకోలేకే పోలీసుల సహాయంతో కండబలం ప్రదర్శిస్తున్నారని విమర్శించిన వైఎస్సార్‌సీపీ.. చంద్రదండుపై ప్రజాస్వామికంగా పోరాడుతూ, అహింసాయుతంగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చింది.

(చదవండి:  వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి)
(అదే సోషల్ మీడియా అస్త్రంగా పోరాడండి: వైఎస్ జగన్)

 

Advertisement
Advertisement