ఆ దారిలోనే తెలంగాణ పోలీస్‌! | Sakshi
Sakshi News home page

ఆ దారిలోనే తెలంగాణ పోలీస్‌!

Published Mon, Jul 1 2019 10:38 AM

Telangana Police Visit United States of America - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నేరాల నిరోధానికి కీలక ప్రాధాన్యం ఇవ్వడం, పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియోగం, కేసుల్లో శిక్షలు పడే శాతాన్ని గణనీయంగా పెంచడం... తదితర అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అమెరికా పోలీసింగ్‌ దారిలోనే నడుస్తోందని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ బైశెట్టి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి అమెరికాలో జరిగిన ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఆయన ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రపంచంలోని 24 దేశాలకు చెందిన పోలీసు అధికారులు ఈ శిక్షణకు ఎంపిక కాగా... భారత్‌ నుంచి ఎంపికైంది శ్రావణ్‌కుమార్‌ ఒక్కరే కావడం గమనార్హం. 

రెండుసార్లు ఒకే ఒక్కడు...
ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉన్న జంగాలపల్లికి చెందిన బైశెట్టి శ్రావణ్‌ కుమార్‌ 2009లో ఎస్సైగా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. నగర కమిషనరేట్‌ పరిధిలోని బేగంబజార్, చిలకలగూడ, నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ల్లో పని చేశారు. గత ఏడాది ఎన్నికల బదిలీల నేపథ్యంలో నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ అయి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగేళ్లకు పైగా నగర టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో పని చేసిన శ్రావణ్‌కుమార్‌ మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి అనేక కేసులను ఛేదించి, వ్యభిచారకూపంలో మగ్గుతున్న పలువురికి విముక్తి కల్పించారు. అతడి తీరును పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారుల సిఫార్సుతో బేగంపేటలోకి అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయం ఆ దేశంలో జరిగిన ప్రత్యేక శిక్షణకు ఎంపిక చేసింది. శ్రావణ్‌కుమార్‌ బేగంబజార్‌ ఠాణాలో ఎస్సైగా పని చేస్తూ 2015లో ప్యారిస్‌లో జరిగిన శిక్షణకు వెళ్ళి వచ్చారు. అప్పట్లో ఉప్పల్‌లోని సెంట్రల్‌ డిటెక్టివ్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ (సీడీటీఎస్‌) ఆధీనంలో జరిగిన ట్రైనింగ్‌కు హాజరైన శ్రావణ్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో పారిస్‌లో జరిగిన అడ్వాన్స్‌ టెక్నాలజీ ఇన్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌  శిక్షణలో పాల్గొనే అవకాశం దక్కింది. అప్పట్లో దేశం నుంచి 10 మంది ఎంపిక కాగా... హైదరాబాద్‌ పోలీస్‌ నుంచి శ్రావణ్‌ ఒక్కరే సెలెక్ట్‌ అయ్యారు. అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్‌షిప్‌ ప్రొగ్రామ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిక్షణలో భాగంగా ‘కంబాటింగ్‌ ట్రాఫికింగ్‌ ఇన్‌ పర్సనల్‌’ పేరుతో ప్రధానంగా మానవ అక్రమరవాణా నియంత్రణపై అవగాహన కల్పించారు. గత నెల 18న మొదలైన ట్రైనింగ్‌ దాదాపు నెల పాటు సాగింది. భారత్, బ్రెజిల్, ఇజ్రాయిల్, ఫుజీ, రొమేనియా, ఫిలిప్పీన్స్, బల్గేరియా తదితర 24 దేశాల నుంచి శిక్షణకు హాజరయ్యారు. భారత్‌ నుంచి ఎంపికైన ఏకైన పోలీసు అధికారి శ్రావణ్‌కుమార్‌ మాత్రమే కావడం విశేషం. మనుషుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ తదితర అంశాలకు సంబంధించి ఆ దేశం అవలంభిస్తున్న విధానాలు, చట్టాలు, పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులతో పాటు వీసా విధివిధానాలను బోధించారు. దీంతో పాటు ఈ మాఫియా డ్రగ్‌ వినియోగం పైనా అవగాహన కల్పించారు.

దర్యాప్తు తీరుతెన్నులను వివరిస్తూ...
ఈ శిక్షణ అందించిన అమెరికా ప్రభుత్వం అక్కడి కస్టమ్స్, హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ, ఎఫ్‌బీఐ, యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్, న్యూజెర్సీ కాంగ్రెస్‌ మ్యాన్‌ కార్యాలయాలతో పాటు బోస్టన్‌ సుప్రీం కోర్టులోనూ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. పేదరికం కారణంగానే హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ జరుగుతోందని, ఏజెంట్ల మోసాలు సైతం ఈ వ్యవహారాలకు ప్రధాన కారణమని బోధించారు. వీటికి చెక్‌ చెప్పే విధానాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ తరహా నేరాల నిరోధం, దర్యాప్తు, విచారణలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం, పోలీసు, స్వచ్ఛంద సంస్థలు తర్ఫీదు ఇచ్చారు. మొత్తమ్మీద అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ, బోస్టన్, ఆర్లాండో, డల్లాస్‌ తదితర రాష్ట్రాల్లోని పోలీసు విభాగాలు, ప్రాసిక్యూషన్‌ ఏజెన్సీలు, బోర్డర్స్, సీ పోర్ట్స్, ఎయిర్‌పోర్టుల్లో ఈ ట్రైనింగ్‌ జరిగింది. బోస్టన్‌ సుప్రీం కోర్టు మాజీ సీజే, న్యాయమూర్తులతో భేటీలు జరిగాయి. ఆయా చోట్ల ఉన్న రెస్క్యూ హోమ్స్‌ అవి పని చేసే విధానం, అనుసరించాల్సిన పద్దతులను సైతం బోధించారు. అమెరికాలో ప్రాసిక్యూషన్‌కు కీలక ప్రాధాన్యం ఇవ్వడం వచ్చిన ఫలితాలను ఈ అధికారులకు చూపించారు.  

మ్యాన్‌ పవర్‌ చాలా ఎక్కువ
అక్కడ ఇన్‌ విజిబుల్‌ పోలీసింగ్‌ టెక్నాలజీ సాయంతో జరుగుతోంది. తెలంగాణ పోలీసు కూడా అదే మార్గంలో వెళ్తోంది. అమెరికాలో ఉన్న అన్ని విభాగాల్లోనూ మ్యాన్‌పవర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగానే అక్కడి సిబ్బందికి వీక్లీఆఫ్‌లు, డ్యూటీ అవర్స్‌ అమలవుతున్నాయి. అత్యంత తక్కువ సిబ్బంది ఉన్న నగర పోలీసు కమిషనరేట్‌లోనూ వీటిని అమలు చేయడానికి సీపీ అంజనీకుమార్‌ ప్రయత్నిస్తున్నారు. ఆ దేశంలో ప్రాసిక్యూషన్‌కు కీలక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసుల్లో 95 శాతం శిక్షలు పడుతున్నాయి. ప్రస్తుత తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ అరెస్టు, చార్జ్‌షీట్‌ వరకే పోలీసు.. ఆపై మొత్తం ప్రాసిక్యూటర్‌ చేతిలోకి వెళ్తుంది. ఓ కేసును ఆది నుంచీ ప్రాసిక్యూటర్‌తో కలిసే దర్యాప్తు చేస్తారు. అక్కడ ఒక్కో పోలీసుస్టేషన్‌/ప్రత్యేక వింగ్‌కు ప్రత్యేకంగా ప్రాసిక్యూటర్‌ ఉంటారు. ఇక్కడా సబ్‌–డివిజన్‌కు ఒక్కొక్కరిని పెట్టాల్సిన అవసరం ఉంది. అమెరికా పోలీసులకు ఏదైనా ఫిర్యాదు అందిన తర్వాత స్పందించే రెస్పాన్స్‌ టైమ్‌ చాలా తక్కువ, ఎమర్జెన్సీ నెంబర్లు దుర్వినియోగం చేయడం ఉండదు. రెస్పాన్స్‌ టైమ్‌ విషయంలో తెలంగాణ కూడా వీలున్నంత వరకు పురోగతి సాధిస్తోంది. అక్కడి పోలీసులకు ఉన్న డ్యూటీ అవర్స్, వీక్లీ ఆఫ్‌లు.. ఫలితంగానే పని భారం, ఒత్తిడి ఏమాత్రం ఉండదు. ఆ ప్రభావం విధి నిర్వహణ, కేసుల దర్యాప్తుపై కనిపిస్తుంటుంది. ఆ దేశంలో మ్యాన్‌పవర్‌ సమృద్ధిగా ఉండటంతో ఫలితాలూ ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. బోస్టన్‌లో ఉన్న ఓ రెస్క్యూహోమ్‌లో ఉండే బాలల సంఖ్య 36 కాగా... అక్కడి సిబ్బంది 50గా ఉంది. ఇలానే ప్రతి చోటా మానవ వనరులు సమృద్ధిగా ఉంటాయి.      –శ్రావణ్‌కుమార్‌

Advertisement
Advertisement