ఇసుక ఆదాయం స్థానిక గిరిజనులకే.. | Sakshi
Sakshi News home page

ఇసుక ఆదాయం స్థానిక గిరిజనులకే..

Published Fri, Jul 21 2017 1:58 AM

ఇసుక ఆదాయం స్థానిక గిరిజనులకే.. - Sakshi

రాష్ట్ర పరిశ్రమలు, గనుల మంత్రి కె.తారకరామారావు
సాక్షి, హైదరాబాద్‌: జాతి సంపదైన ఇసుక ప్రయోజనాలు స్థానిక గిరిజనులకే దక్కాలన్న తమ లక్ష్యం నెరవేరుతోందని రాష్ట్ర పరిశ్రమలు, గనుల మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు, కాంట్రాక్టర్లకు గతంలో ఇసుకను ధారాదత్తం చేశారని, ఈ లోపభూయిష్టమైన విధానానికి ముగింపు పలికి, విప్లవాత్మకంగా గిరిజన ఇసుక సహకార సంఘాలను తెరపైకి తీసుకొచ్చామన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో 33 గిరిజన ఇసుక సహకార సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సంఘాల్లో ఇప్పటికే 7,939 సభ్యులున్నారని, రెండేళ్లలో ఈ సంఘాలకు రూ.17.35 కోట్ల ఆదాయాన్ని పంపిణీ చేశామన్నారు. మరికొన్ని సంఘాలకు గురువారం హైదరాబాద్‌ బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రూ.2.20 కోట్ల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర గనుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ)తో 21 సొసైటీలు ఒప్పందం చేసుకున్నాయని, మిగిలిన సొసైటీలతో త్వరలో ఒప్పందాలు పూర్తి కానున్నాయని కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి చందులాల్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఎండీసీ ఎండీ మల్సూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement