Sakshi News home page

'రైతుల క న్నీరు తుడిచేందుకే రాహుల్ పర్యటన'

Published Wed, Apr 29 2015 12:08 AM

rahul gandhi visits to khammam very soon

ఖమ్మం: రైతుల పక్షపాతిగా ఉంటానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులను విస్మరించిందని, వారి కన్నీరు తుడిచేందుకే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను నష్టపరిచే విధంగా కొత్త చట్టాలను తెస్తూ.. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని విమర్శించారు. రైతులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్‌గాంధీ రాష్ట్రానికి రానున్నారన్నారు.

 

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే తన పనిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చేస్తున్నారన్నారు. సచివాలయం మార్పు వంటి నిర్ణయాలతో ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, పేద ప్రజలకు సేవ చేసే ఆస్పత్రిని తరలించడం సరికాదన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించే మార్గం చూడాలని హితవు చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ అని... దాని ఫలాలు అనుభవిస్తుంది కేసీఆర్ అన్నారు. ఎవరెన్ని చెప్పినా ఈ దేశం కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సురక్షితంగా ఉంటుందని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వారికే ఎన్నికల్లో టికెట్‌లు ఇస్తామన్నారు. బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ సభ్యత్వాలను ముమ్మరం చేయాలని, 15 రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లోని నిధులను సీఎం ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావు మంత్రులుగా ఉన్న వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణకే కేటాయించడం విడ్డూరమన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్ర రైతులకు నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేందుకే రాహుల్ గాంధీ పర్యటన చేస్తారని అన్నారు. శాసనమండలి కాంగ్రెస్ ప్లోర్‌లీడర్ షబ్బీర్‌అలీ మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరోవైపు కేసీఆర్ సభలు, సమావేశాల పేరుతో బిర్యానీలు, ఇతర వంటకాలతో సంబరాలు చేసుకోవడం శోచనీయమన్నారు.

Advertisement
Advertisement