అండగా మేమున్నాం.. | Sakshi
Sakshi News home page

అండగా మేమున్నాం..

Published Sun, Mar 29 2015 4:06 AM

Memunnam up ..

కరీమాబాద్ : ‘మీరు ఎవరూ లేరని, ఏమీ లేదని, బాధపదొద్దు.. మీలాంటి వారికి మేం ఎల్లప్పుడు అండగా ఉంటాం. మీకేం కావాలో అడగండి..సాయం చేస్తాం’ అంటూ శారద కుటుంబానికి సాయం చేసేందుకు పలువురు దాతలు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన ‘స్మశానవాటికే వారి నివాసం’ అనే కథనానికి విశేష స్పందన లభించింది.

సోమవారం కరీమాబాద్‌కు చెందిన బిజ్జ ముకుందం(32) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా వారు కిరాయికి ఉండే ఇంటి యజమాని ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావొద్దని చెప్పడంతో కరీమాబాద్ తోట్లవాడలోని స్మశానవాటికలో దహన సంస్కారాలు చేసిన తర్వాత అతడి భార్య శారద, కుమారుడు హర్షిత్, కూతరు మానస ఎక్కడికికి వెళ్లాలో తెలియక స్మశానవాటికలోనే మూడురోజులపాటు తలదాచుకున్న విషయం తెలిసిందే.  
 
ఆర్డీఓ, తహసీల్దార్ సందర్శన
వరంగల్ ఆర్డీఓ వెంకటమాధవరావు, వరంగల్ తహసీల్దార్ ఎన్.రవి తోట్లవాడ స్మశానవాటిక వద్ద ఉన్న శారద కుటుంబాన్ని పలకరించారు. జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు. ఎన్‌ఎఫ్‌బీఎస్ కింద రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. అలాగే శారద కుటుంబానికి అంత్యోదయ కార్డు అందజేస్తామని తెలిపారు.
 
దాతల ఆర్థిక సాయం
శారద కుటుంబానికి శివ లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని మధుసూదన్‌రావు రూ.10 వేలు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి రూ.5000, మందాడి రవీం దర్ రూ.2000, సారంగపాణి రూ.2000, సయ్యద్ బాబర్ రూ.2000, శాప్ మాజీ డైరక్టర్ రాజనాల శ్రీహ రి క్వింటా బియ్యం, టీఆర్‌ఎస్ నాయకుడు కొల్లూరి యోగానంద్ రూ.2000తోపాటు దుస్తులు అందించారు. కానిస్టేబుల్ చిలుక శ్రీనివాస్ రూ.2000, హైదరాబాద్‌కు చెందిన శ్రీహరిరాజు రూ.1500 ఆర్థిక సాయం అందించి తమ మానవత్వం చాటుకున్నారు. అనంతరం వారిని శనివారం మధ్యాహ్నం కలెక్టర్ ఆదేశాలతో వరంగల్ తహసీల్దార్ ఎన్.రవి సమక్షంలో చైల్డ్‌లైన్ వారు స్వధార్‌హోంకు తరలించారు.

Advertisement
Advertisement