జూరాల.. నీరెలా? | Sakshi
Sakshi News home page

జూరాల.. నీరెలా?

Published Mon, Oct 20 2014 3:34 AM

జూరాల.. నీరెలా?

గద్వాల: జిల్లాలో ఉన్న ఏకైక భారీ సాగునీటి ప్రాజెక్టు అయిన జూరాల రిజర్వాయర్‌లో ఏటా పూడిక పేరుకుపోతోంది. 18ఏళ్లలోనే రెండు టీఎంసీల మేర ఒండ్రుమట్టి పేరుకుపోయినట్లు ఏపీఈఆర్‌ఎల్(ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ)తేల్చింది. పూడిక పెరిగిపోతే డెడ్‌స్టోరేజీలో ఉండే ఐదు టీఎంసీల నీటినిల్వ కూడా పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి అవసరాలకు వేసవిలో నీటిని నిల్వచేసుకునే అవకాశం లేకుండాపోతుంది.

ఒకవేళ దాహార్తీ తీర్చాలని అధికారులు భావిస్తే.. జూరాల ఆయక ట్టు పరిధిలోని రబీ సీజన్‌ను క్రాప్‌హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇంతకుమించి కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు రీజనరేట్ వాటర్‌పైనే తాగునీటికి ఆధారపడాల్సి వస్తోంది.. జిల్లాలోనే దాదాపు 110కి.మీ పొడవున జీవనది కృష్ణమ్మ ప్రవహిస్తున్నా.. మరమ్మతులు, ఆధునీకకరణ చేపట్టలేకపోయారు.

ప్రాజెక్టు నిర్మాణం కేవలం ఐదేళ్లలో రూ.73కోట్ల వ్యయంతో పూర్తిచేయాల్సి ఉండగా, నిధుల కేటాయింపులో కూడా వివక్షత చూపారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 17.84టీఎంసీల నికరజలాలను వాడుకునే విధంగా ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల కర్ణాటకలో ముంపు పెరగకూడదనే ఉద్ధేశంతో కేవలం లక్ష ఎకరాలకే ఆయకట్టు ఉండేలా డిజైన్‌ను రూపొందించారు. ఇలా జిల్లాలో ఉన్న ఏకైక పెద్ద ప్రాజెక్టుతో కరువునేలలో ఆశించినస్థాయిలో ప్రయోజనం లేకపోవడంతో ఎత్తిపోతల పథకాలు తెరపైకి వచ్చాయి.

 తాగునీళ్లు కష్టమే!
 జూరాల ప్రాజెక్టుకు కేటాయించింది 17.8 టీఎంసీలు కాగా, డిజైన్‌ను కేవలం 11 టీఎంసీల నీటినిల్వకే కుదించారు. ఇందులో డెడ్‌స్టోరేజీ ఐదు టీఎంసీలు కాగా, మిగతా ఆరు టీఎంసీలు మాత్రమే ఆయకట్టుకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో రెండు టీఎంసీల మేర ఒండ్రుమట్టి పేరుకున్నట్లు ఏపీఈఆర్‌ఎల్ తేల్చడంతో డెడ్‌స్టోరేజీలో కేవలం మూడు టీఎంసీలే మిగులుతాయి. ఇలాగే ఒండ్రుమట్టి పెరిగిపోతూ మరో మూడు టీఎంసీలకు పెరిగితే డెడ్‌స్టోరేజీలో తాగునీటి అవసరాలకు సైతం నీరు కేటాయించే అవకాశం ఉండదు.

 ఒండ్రుమట్టి పెరిగినా స్పిల్‌వేకు..
 జూరాల రిజర్వాయర్‌లో ఒండ్రుమట్టి స్పిల్‌వే లెవల్ 310మీటర్లకు చేరినా ఆయకట్టు నీటి విడుదలకు ఖరీఫ్‌లో పెద్దగా ఇబ్బంది ఉండదు. రబీ సీజన్‌లో మాత్రమే కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో రబీ ఉంటేనే మనకు నీటివిడుదల అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో రబీకి నీళ్లిచ్చే అవకాశం ఉండదు. ప్రధానకాల్వలకు జూరాల రిజర్వాయర్ నుంచి 312మీటర్ల నుంచి నీటి మళ్లింపు ఉంటుంది. కావునా భవిష్యత్తులోనూ ఒండ్రుమట్టి పెరిగితే తాగునీటి అవసరాల మినహా సాగునీటికి సమస్య ఉండదని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement