‘కాళేశ్వరం’ పనుల్లో మరో దుర్ఘటన | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’ పనుల్లో మరో దుర్ఘటన

Published Fri, Sep 22 2017 1:59 AM

‘కాళేశ్వరం’ పనుల్లో మరో దుర్ఘటన - Sakshi

► 7వ ప్యాకేజీలో సొరంగం కూలి అసోం కూలీ మృతి
► పెద్దపల్లి జిల్లా మల్లాపూర్‌ శివార్లలో ఘటన


ధర్మారం(పెద్దపల్లి): కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లా జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌ వద్ద ప్యాకేజీ–7లో భాగంగా నిర్మిస్తున్న సొరంగం (అండర్‌ టన్నెల్‌)లో బండరాయి తలపై కూలిపడి దేవజిత్‌ సోనావాల్‌ (27) అనే కూలీ మృతి చెందాడు. మృతుడు అసోం రాష్ట్రానికి చెందిన కార్మికుడిగా గుర్తించారు. బుధవారం సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్‌ వద్ద సొరంగం కూలి ఏడుగురు మృతిచెందిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం ఆందోళనకరంగా మారింది.  

బ్లాస్టింగ్‌ చేసి వస్తుండగా..
మల్లాపూర్‌ గ్రామ శివారులో కొంతకాలంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–7 సొరంగం పనులు జరుగుతున్నాయి. అసోం రాష్ట్రానికి చెందిన దేవజిత్‌ సోనావాల్‌ పనులు చేస్తున్నాడు. బుధవారం రాత్రి 8 గంటలకు సొరంగంలో విధులకు హాజరైన సోనావాల్‌.. బ్లాస్టింగ్‌ (పేలుళ్లతో రాళ్లను పగలగొట్టడం) పనులు చేపట్టాడు. పలు చోట్ల డ్రిల్‌ వేసి పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్‌ చేశాడు. గురువారం తెల్లవారుజామున తిరిగి సొరంగం నుంచి బయటికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పైకప్పు నుంచి బండరాయి కూలి అతడి తలపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన సోనావాల్‌ను తోటి కార్మికులు, ఉద్యోగులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సోనావాల్‌ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement