హిరమండలంలో ఏనుగులు | Sakshi
Sakshi News home page

హిరమండలంలో ఏనుగులు

Published Sat, Feb 10 2018 1:11 PM

Elephant group coming in farms area - Sakshi

హిరమండలం: గత కొన్నేళ్లుగా గిరిజన, కొండ ప్రాంతాల్లో సంచరించే ఏనుగుల గుంపు ఏకంగా మైదాన ప్రాంతానికి చేరుకుంది. మండలంలోని భగీరధిపురం గ్రామ సమీ పంలోని పొలాలు, కళ్లాల్లోకి గురువారం రాత్రి వచ్చా యి. ఇక్కడ కొంతమంది రైతులకు సంబంధించి ధాన్యాన్ని ధ్వంసం చేసి వంశధార నదిని దాటి హిరమండలం చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం వంశధార గొట్టా బ్యారేజీ దిగువున ఉన్న సుభలయ మెట్ట తోటలో నాలు గు ఏనుగులు తిష్ఠవేశాయి. అక్కడ జీడి, మామిడి తోట లను ధ్వంసం చేస్తూ సంచరిస్తున్నాయి.

వీటిని చూసేం దుకు జనం తండోప తండాలుగా వెళ్తున్నారు. ప్రమా దం అని తెలిసినా యువకులు వాటి æ సమీపంలోకి వెళ్లి సెల్‌ఫోన్‌లలో ఫొటోలు, వీడియోలు తీశారు. విషయం తెలుసుకున్న కొత్తూరు రేంజ్‌ అటవీ శాఖ అధికారి సిబ్బందితో తోటవద్దకు చేరుకొని అక్కడ సంచరిస్తున్న ఏనుగులను పరిశీలించారు. ఏనుగులను చూసేందుకు వస్తున్న జనాలకు వాటి వద్దకు వెళ్లవద్దని, ఫొటోలు, వీడియోలు తీయవద్దని, ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. నలుగురు ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ను తోట వద్ద కాపలాగా ఉంచారు. ఏనుగుల సమీపంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా స్థానిక తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ ఇద్దరు వీఆర్‌ఏలను తోటవద్ద పర్యవేక్షణకు ఉంచారని ఆర్‌ఐ గౌరిశంకర్‌ తెలిపారు.

భయాందోళనలో ప్రజలు
మండల కేంద్రం హిరమండలంలోకి ఏనుగుల గుంపు రావడంతో సుభలయ మెట్ట తోట సమీపంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో గ్రామంలోకి చొరబడిపోతాయేమోనని భయపడుతున్నారు. రహదారుల్లో ఏనుగుల గుంపు సంచరిస్తుండంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని, వంశధార నదికి స్నానాలకు వెళ్లేందుకు ఇదే దారి కావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఇక్కడ నుంచి కొండ ప్రాంతాలకు ఏనుగులను తరలించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement