అది సెహ్వాగ్ అవివేకం: గంగూలీ | Sakshi
Sakshi News home page

అది సెహ్వాగ్ అవివేకం: గంగూలీ

Published Sun, Sep 17 2017 2:49 PM

అది సెహ్వాగ్ అవివేకం: గంగూలీ

న్యూఢిల్లీ: టీమిండియా కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో తనకు 'సెట్టింగ్' లు చేయడం చేతకాలేదని సరికొత్త వివాదానికి తెరలేపిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు, బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో సభ్యుడు సౌరవ్ గంగూలీ ఖండిచారు. అసలు సెహ్వాగ్ మాట్లాడిన దాంట్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. కోచ్ పదవికి ఆసక్తిలేకపోయినా, అందుకు ముందుకు రావడానికి బీసీసీఐలోని కొందరు పెద్దలే కారణమని సెహ్వాగ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోచ్ పదవి కోసం పైరవీలు చేయడం తనకు చేత కాలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన గంగూలీ.. అది సెహ్వాగ్ అవివేకమని కొట్టిపారేశారు. కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో సెహ్వాగ్ భావన ఏదైతే ఉందో అది మొత్తం తప్పు అని గంగూలీ స్పష్టం చేశారు. తనకు సెహ్వాగ్ మంచి మిత్రుడని పేర్కొన్న గంగూలీ.. ఈ విషయంపై అతనితో త్వరలోనే మాట్లాడతానని పేర్కొన్నారు.


టీమిండియా కోచ్ గా రవిశాస్త్రిని బీసీసీఐలోని ముగ్గురు సభ్యుల అడ్వైజరీ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో గంగూలీ ఒక సభ్యుడిగా ఉండగా, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లు మిగతా సభ్యులు. ఇక్కడ ముగ్గురితోనూ సెహ్వాగ్ కు సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవం. అయితే కోచ్ పదవికి రవిశాస్త్రి చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ముందు వరుసలోకి రావడంతో సెహ్వాగ్ రేసులో వెనుకబడిపోయారు. తనను కోచ్ పదవి ఎంపికకు దరఖాస్తు చేసుకోమని ప్రేరేపించకపోతే అందుకు మొగ్గుచూపేవాడిని కాదనేది సెహ్వాగ్ వాదన. అదే సమయంలో రవిశాస్త్రి ముందుగానే దరఖాస్తు చేసుకునే ఉంటే కూడా కోచ్ పదవి కోసం ఆశ పడేవాడిని కాదని సెహ్వాగ్ తెలిపాడు. ఇక్కడ కోచ్ పదవి కోసం పైరవీలు చేయడం తనకు అలవాటు లేని పనిగా సెహ్వాగ్ పేర్కొనడం బీసీసీఐ పెద్దల్ని ఆలోచనలో పడేసింది.

Advertisement
Advertisement