ఈసారీ సూపర్ ఓవర్ | Sakshi
Sakshi News home page

ఈసారీ సూపర్ ఓవర్

Published Fri, Jan 30 2015 1:05 AM

ICC reinstates Super Over in case of tie in World Cup final

ప్రపంచకప్ ఫైనల్‌పై ఐసీసీ నిర్ణయం
* 2016 మార్చి 11 నుంచి భారత్‌లో టి20 ప్రపంచకప్
దుబాయ్: ఈసారి కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌ను అనుమతించాలని ఐసీసీ బోర్డు సమావేశం నిర్ణయించింది. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఇక్కడి ఐసీసీ ప్రధాన కార్యాలయంలో శ్రీనివాసన్ అధ్యక్షతన బోర్డు భేటీ అయ్యింది. దీంట్లో భాగంగా 2019 వరకు ఐసీసీ ఈవెంట్స్ షెడ్యూల్‌తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

2011 ప్రపంచకప్‌లో అనుమతించినట్టుగానే ఫైనల్ మ్యాచ్ టై అయితే విజేతను తేల్చేందుకు ఈసారీ సూపర్ ఓవర్‌ను వేయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ సస్పెన్షన్ ఎదుర్కొనే అవకాశం ఉన్న కెప్టెన్లకు ఊరటనిచ్చారు. దీంట్లో భాగంగా ప్రపంచకప్ టోర్నీలో మాత్రమే రెండు సార్లు ఈ తప్పిదానికి పాల్పడితే నిషేధం ఎదుర్కొంటారు.

ఒకవేళ ఈ టోర్నీకి ముందు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే ఈవెంట్ ముగిసిన అనంతరం జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో లెక్కలోకి వస్తుంది. అలాగే ఫిల్ హ్యూస్ మృతి నేపథ్యంలో ఆటగాళ్ల హెల్మెట్‌లను మరింత రక్షణాత్మకంగా మార్చేందుకు ఐసీసీ నిర్ణయించింది.
 
2016 టి20 ప్రపంచకప్ భారత్‌లో

వచ్చే ఏడాది ఐసీసీ టి20 ప్రపంచకప్ భారత్‌లో జరుగనుంది. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు టోర్నీ నిర్వహిస్తారు. 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్‌లకు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తుంది.
 
ఆమిర్‌పై నిషేధం ఎత్తివేత
స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఐదేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ యువ పేసర్ మహ్మద్ ఆమిర్‌పై ఐసీసీ నిషేధం ఎత్తివేసింది. తను పాక్ దే శవాళీ క్రికెట్‌లో ఆడుకోవచ్చు. పునరాగమనంలో నాణ్యమైన ఆటగాడిగానే కాకుండా ఉత్తమ వ్యక్తిగా కూడా ప్రవర్తిస్తానని ఈ సందర్భంగా 22 ఏళ్ల ఆమిర్ తెలిపాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement