ఆమరణ దీక్ష భగ్నం | Sakshi
Sakshi News home page

ఆమరణ దీక్ష భగ్నం

Published Thu, Apr 12 2018 2:00 AM

Huge tension at AP Bhavan in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులను త్యాగం చేసి.. ప్రాణాలు పణంగా పెట్టి ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ వేదికగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు బుధవారం భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఏపీ భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర భావోద్వేగానికి గురైన పార్టీ శ్రేణులు ఎంపీలను తరలిస్తున్న అంబులెన్సులను అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన పార్టీ శ్రేణులపై పోలీసులు తమ బలాన్ని ప్రయోగించి పక్కకు నెట్టేశారు. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న పార్టీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిలను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.
 
ఏపీ భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత..
యువ ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నప్పటికీ తమ దీక్షను కొనసాగిస్తూ వచ్చారు. ఈ ఇద్దరు ఎంపీల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు పడిపోవడం, మిథున్‌రెడ్డి అల్సర్‌తో బాధపడుతుండడంతో మంగళవారం రాత్రే దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. అయినప్పటికీ ఎంపీలు తమ దీక్షను కొనసాగించారు. బుధవారానికి ఆమరణ నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. ఉదయం మరోసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి మరింత దిగజారిపోతుందంటూ దీక్ష విరమించాలని సూచించారు. అయినా దీక్ష కొనసాగిస్తామని, విరమించే ప్రసక్తే లేదని  ఎంపీలు తేల్చిచెప్పారు. దీంతో వైద్యుల సలహా మేరకు అంబులెన్సులను రప్పించిన ఢిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఎంపీలను బలవంతంగా తరలించేందుకు యత్నించారు. దీక్ష విరమించబోమంటూ ఎంపీలు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో దీక్షా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పార్టీ శ్రేణుల ప్రతిఘటన
బుధవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి ఎంపీలను తరలించేందుకు పోలీసు సిబ్బంది యత్నించారు. దీన్ని ఎంపీలు, పార్టీ శ్రేణులు ప్రతిఘటించారు. వారి ప్రతిఘటన మధ్యే పోలీసులు బలవంతంగా ఎంపీలను ఎత్తుకుని అంబులెన్సుల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకుంటూ పార్టీ శ్రేణులు ‘పోలీసు జులుం నశించాలి..’, ‘మోదీ–బాబు డౌన్‌ డౌన్‌’, ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అతికష్టమ్మీద ఎంపీలను అంబులెన్స్‌లో ఎక్కించారు. దీంతో పార్టీశ్రేణులు ఆ వాహనాల ముందుకెళ్లి అవి  కదలకుండా అడ్డుకున్నారు.  వారిని సీఆర్‌పీఎఫ్‌ బలగాలు తోసివేసేందుకు ప్రయత్నించగా, ఇరుపక్షాల మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఏపీ భవన్‌ ప్రవేశద్వారం వద్ద కార్యకర్తలు, నేతలు కింద పడుకుని వాహనాలను అడ్డగించారు.  

వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళనతో ఏపీ భవన్‌ అట్టుడికిపోయింది. అయితే వారిపై బలప్రయోగానికి దిగిన పోలీసు సిబ్బంది ఎంపీలను రామ్‌మనోహర్‌లో హియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఎంపీలు చికిత్సకు నిరాకరిస్తూ.. తాము దీక్ష కొనసాగిస్తామని పట్టుపట్టారు. కానీ వైద్యులు బలవంతంగా ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించి ఎంపీల దీక్షను భగ్నం చేశారు. ప్రస్తుతం వారికి ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ఐసీయూ వార్డులో చికిత్స కొనసాగుతోంది.

ఆరోగ్యం క్షీణించినందువల్లే.. : వైద్యులు
ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడం వల్లే ఆస్పత్రికి తరలించాలని సూచించినట్టు ఆర్‌ఎంఎల్‌ వైద్యులు తెలిపారు. ఇప్పటికే డీహైడ్రేషన్, అల్సర్‌తో బాధపడుతున్న మిథున్‌రెడ్డి, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న అవినాష్‌రెడ్డిల షుగర్‌ లెవెల్స్‌ ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయన్నారు. గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండడం వల్ల ఇద్దరు ఎంపీల ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందన్నారు. బుధవారం ఉదయం వైద్యపరీక్షలు నిర్వహించినప్పుడు అవినాష్‌రెడ్డి బీపీ 110/70, షుగర్‌ లెవెల్స్‌ 74, మిథున్‌రెడ్డి బీపీ 100/60, షుగర్‌ లెవెల్స్‌ 68కి పడిపోయాయని తెలిపారు. ఇదిలా ఉండగా ఇద్దరు ఎంపీల ఆరోగ్యానికి సంబంధించి బుధవారం రాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన వైద్యులు.. ఎంపీలిద్దరి కీటోన్‌ లెవెల్స్‌ ప్రమాదకర స్థాయికి పడిపోయాయని వెల్లడించారు. కీటోన్‌ లెవెల్స్‌ అవినాష్‌రెడ్డికి 2ప్లస్‌గా ఉన్నాయని, మిథున్‌రెడ్డికి 3ప్లస్‌గా ఉన్నాయని వారు తెలిపారు. దీనికితోడు అవినాష్‌రెడ్డి తీవ్రమైన వెన్నునొప్పితో కూడా బాధపడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement