'కలాంతో ఇదే చివరి ప్రయాణమని ఊహించలేదు' | Sakshi
Sakshi News home page

'కలాంతో ఇదే చివరి ప్రయాణమని ఊహించలేదు'

Published Tue, Jul 28 2015 12:50 PM

'కలాంతో ఇదే చివరి ప్రయాణమని ఊహించలేదు' - Sakshi

న్యూఢిల్లీ : గత ఆరేళ్లుగా అబ్దుల్ కలాం సార్తో కలిసి ప్రయాణాలు చేశానని, కానీ ఇదే చివరి ప్రయాణం అవుతుందని అనుకోలేదని ఐఐఎమ్ (అహ్మదాబాద్) పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్ అన్నారు. 2009 నుంచి ఆయన కలాంతో కలిసి పలు కార్యక్రమాల్లో భాగం పంచుకున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో చిరిరోజు స్మృతులను, మరిన్ని విశేషాలను  సింగ్ పంచుకున్నారు. షిల్లాంగ్ లోని ఐఐఎమ్కు వెళ్తోన్న కలాంతో పాటే ఆయన కూడా ఉన్నారు. స్టేజీపై ప్రసంగిస్తూ కలాం కుప్పకూలిపోయినప్పుడు వేదిక వద్ద ఉండి ప్రత్యక్షంగా చూసిన వారిలో జన్పాల్ ఒకరు.

గువహతికి బయలుదేరిన విమానంలో కలాం 1ఏ, తాను 1సీ సీట్లో కూర్చున్నామని చెప్పారు. ఆయన ముదురు రంగు సూట్ ధరించారని, ఆ సూట్ చాలా బాగుందని  కాంప్లిమెంట్ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన ఒంటిపై తాను చూసే చివరి రంగు అదే అవుతుందని ఊహింలేదన్నారు. సుమారు 2.5 గంటల పాటు విమానంలో ప్రయాణించామని అనంతరం కారులో జర్నీ చేశామని చెప్పారు.

పంజాబ్ లో జరిగిన ఉగ్రదాడుల గురించి ఆయన వేదన చెందారని, ఈ ఘటనలలో అమాయకులు చనిపోయారని కలాం చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. కాలుష్యం వల్ల మన జీవన పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని, వీటిని నివారించేందుకు ఏదో ఒక ప్రత్యామ్నాయం ఆలోచించాలని చర్చించామని జన్పాల్ సింగ్ వివరించారు. పార్లమెంట్, రాజకీయాలు తదితర అంశాలపై కలాం దిగులుచెందారని, ఐఐఎమ్ విద్యార్థులకు జన ప్రయోజన రాజకీయాలు చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని కలాం వారికి ఓ ప్రశ్న సంధించాలనుకున్నారని సింగ్ చెప్పారు.

Advertisement
Advertisement