రాష్ట్రవ్యాప్త పర్యటన.. | Sakshi
Sakshi News home page

భయపెడుతున్నారు

Published Wed, Nov 8 2017 7:12 AM

Kamal Haasan formally announces entry into the political arena - Sakshi

రాజకీయాలు అంత సులువు కాదని కొందరు భయపెడుతున్నారు.. ప్రతి మనిషీ తన లక్ష్యం కోసం కలలు కనితీరాలి. రాజకీయాల్లో మార్పు సాధ్యం. పార్టీని ప్రకటించే ముందు ప్రజలను అర్థం చేసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించిన స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర పర్యటన చేపట్టబోతున్నా. కమల్‌ అభిమానులా.. సేవా కార్యక్రమాలా.. అంటూ విజిల్‌ వేసి హేళన చేశారు. అందుకే నా రాజకీయ యాప్‌కు ‘మైయమ్‌ విజిల్‌’ అని పేరుపెట్టాను. ‘వెతుకు... పరిష్కరించు’ ఇదే యాప్‌ ప్రధాన నినాదం. రాజకీయ ప్రవేశంపై దాగుడు మూతలు ఆడడం లేదు. పార్టీ పెట్టడం ఖాయం. గర్భం ధరించగానే బిడ్డ పేరేంటి అని ప్రశ్నించరాదు, ముందు ఆడ, మగా తెలుసుకోవాలి. నా పార్టీ పేరు గురించి కూడా అలానే ఓపిక పట్టాలి.

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాలు అంత సులువు కాదని కొందరు భయపెడుతున్నారని.. కలలు కనవద్దని మరికొందరు హేళన చేస్తున్నారని నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. కలలు కనాలి, అప్పుడే వాటిని పట్టుదలతో సాధించుకుంటామని చెప్పారు. రాజకీయపార్టీ ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ‘మైయమ్‌ విజిల్‌’ అనే యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈనెల 7వ తేదీన కమల్‌ జన్మదినం సందర్భంగా రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని ఇదివరకే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కమల్‌ ఖండిస్తూనే ఒక ముఖ్యమైన ప్రకటన మాత్రం చేస్తానని తెలిపారు. అదేందో అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. చెన్నైలోని ఒక ప్రయివేటు హోటల్‌లో మంగళవారం ఉదయం సరిగ్గా 11.30 గంటలకు మీడియా సమావేశం ఉంటుందని కమల్‌ నుంచి ఆహ్వానం అందింది.

ప్రాంతీయ, జాతీయ మీడియాలతో సమావేశం హాలు కిక్కిరిసిపోయింది. కమల్‌ మాటలను ప్రత్యక్ష ప్రసారం చేసే నిమిత్తం రోడ్డులో ఓబీ వ్యాన్లు బారులుతీరాయి. మరో కార్యక్రమంలో పాల్గొని రావడంలో ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 1 గంటకు హోటల్‌కు చేరుకున్న కమల్‌ మీడియా ప్రతినిధులతో సుమారు గంటసేపు గడిపారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి కమల్‌ మాట్లాడుతూ.. ‘‘రాజకీయ విమర్శలు చేస్తూ పార్టీని ప్రారంభించబోతున్నట్లు తెలియగానే కొందరు వ్యక్తులు అది చాలా కఠినమైన మార్గమని భయపెట్టడం ప్రారంభించారు. ఏదో సాధించేయగలనని కమల్‌ కలలు కంటున్నాడని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి మనిషీ తన లక్ష్యం కోసం కలలు కనితీరాలి. రాజకీయాల్లో మార్పు సాధ్యం’’ అని అన్నారు.

ఇదిగో వస్తున్నా..
పార్టీని ప్రకటించే ముందు ప్రజలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం, అందుకే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు కమల్‌ తెలిపారు. దేశ ప్రజలతో మమేకమైన మహాత్మాగాంధీ, గురువు శ్రీరామకృష్ణ పరమహంస ఆదేశాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించిన స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని పర్యటన చేపట్టబోతున్నానని చెప్పారు.

విజిల్‌ వేయండి.. హెచ్చరించండి
‘‘అక్రమార్కులకు నా పార్టీలో తావులేదు, ఈ విషయంలో స్పష్టంగా ఉన్నా. రాజకీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా జనవరిలో ప్రవేశపెడుతున్న ‘మైయమ్‌ విజిల్‌’ అనే యాప్‌ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరు తప్పుచేసినా ఆ యాప్‌లో నమోదు చేయండి. నేను తప్పుచేసినా యాప్‌లో పేర్కొనండి. ప్రజా సమస్యలకు ప్రభుత్వం ద్వారా సత్వర పరిష్కారం కోసం ఈ యాప్‌ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. వాస్తవానికి ఇది మామూలు యాప్‌ కాదు, ప్రజల కోసం ఏర్పాటవుతున్న డిజిటల్‌ వేదిక. 30 ఏళ్ల క్రితం నా అభిమాన సంఘాల వారు కలిసి మమ్మల్ని ఏమీ చేయమంటారు అని అడిగారు. ప్రజలకు మంచి చేయండి, అయితే వెతికి వెతికి అర్హులైన వారికి మాత్రమే మంచి చేయాలని సూచించాను. కమల్‌ అభిమానులా.. సేవా కార్యక్రమాలా.. అంటూ విజిల్‌ వేసి హేళన చేశారు. అందుకే నా రాజకీయ యాప్‌కు ‘మైయమ్‌ విజిల్‌’ అని పేరుపెట్టాను. ‘వెతుకు...పరిష్కరించు’ ఇదే యాప్‌ ప్రధాన నినాదం’’ అని కమల్‌ హాసన్‌ పిలుపునిచ్చారు.

ప్రజావేదిక సిద్ధం చేస్తున్నా
‘‘యాప్‌ ద్వారా ప్రజావేదికను సిద్ధం చేస్తున్నాను. ఈ యాప్‌ జనవరిలో అందుబాటులోకి వస్తుంది. పార్టీ ఏర్పాటు, ప్రకటన గురించి ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రాజకీయ ప్రవేశంపై దాగుడు మూతలు ఆడడం లేదు, పార్టీ పెట్టడం ఖాయం. ఈ ఏర్పాట్లు నా విజయం కోసం రాష్ట్ర ప్రజల విజయం కోసం. గట్టి పునాదులతో పార్టీ ఆవిర్భవించాలని ఏర్పాట్లు చేసుకుంటున్నా. తొందర పనికిరాదు. గర్భం ధరించగానే బిడ్డ పేరేంటి అని ప్రశ్నించరాదు, ముందు ఆడ, మగా తెలుసుకోవాలి. నా పార్టీ పేరు గురించి కూడా అలానే ఓపికపట్టాలి. ఇది నాపుట్టిన రోజు వేడుక కాదు, జన్మసార్థకం చేసుకునే ప్రయత్నాలు మాత్రమే’’ అని కమల్‌ అన్నారు. ఇదిలా ఉండగా ఆవడిలోని అన్నపూర్ణ కల్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన అంటువ్యాధుల నివారణ ఉచిత వైద్యశిబిరాన్ని కమల్‌ ప్రారంభించారు.

Advertisement
Advertisement