లలిత పిన్ని | Sakshi
Sakshi News home page

లలిత పిన్ని

Published Sat, Feb 27 2016 11:03 PM

లలిత పిన్ని

క్లాసిక్ కథ
నాకు కర్నాటక సంగీతమంటె, అందులో ముఖ్యంగా త్యాగరాజ కృతులంటేనూ భక్తి కలిగించిన వ్యక్తి మా లలిత పిన్ని ఒక్కటే. అదివరలో త్యాగరాజ కృతులు ఎక్కువగా అయ్యర్లనోట విన్నానేమో, ‘శాస్త్రకట్టు’ సంగీతమంటే సరిగమల తోముడుతప్ప మరేమీ లేదనే దురభిప్రాయంలో పడ్డాను. లలిత పిన్ని నాకంటె రెండేళ్లు చిన్న. ఆవిడకి పెళ్లికాక ముందు ఏడాదికొక సారైనా మా యింటికి వచ్చేది. మా యింట్లో వున్న పాత హార్మోనియం వాయిస్తూ పాడేది. పిన్ని సంగీతం పాడు తుందని నాకు తెలియదు. అది వరకు నేనెన్నోసార్లు విని విసుగెత్తిన కృతులే ఆమె కంఠంలో కొత్త అర్థాలు వ్యక్తం చేసేవి.
 
నిజానికి ఆమెకా సంగీతం నేర్చు కుంటే వచ్చిందని నేను నమ్మను. ఆమెకి మా తాతగారు సంగీతం మేష్టరును పెట్టి వీణ నేర్పించారు. కాని ఆమె వేసే స్వరాలు, సంగతులు ఇదివరకెక్కడా నేను వినలేదు. ప్రతి వేసవికాలం సెలవులికీ మా అమ్మమ్మగారి వూరు వెళ్లేవాణ్ని. చాలాసార్లు ఆరుబయట వెన్నెల్లో కూర్చుని ఆమె వీణవాయిస్తూ పాడుతుంటే విన్నాను. ‘‘ఒరే నువ్వు పాడరాదురా, అస్తమానమూ నన్ను పాడమనకపోతే?’’ అని ఒకసారి నవ్వుతూ అడిగింది పిన్ని. ‘‘సరిసరి, నువ్వు పాడిం తరవాత గొంతెత్త టానికి ఎన్ని గుండెలుండాలి?’’ అన్నాను.
 
కాలేజీలో స్నేహితుల ముందు సినిమాటుమ్రీలు పాడి గర్వపడే నేను మా పిన్ని ముందు కంఠమెత్తటానికి కూడా జడిసేవాణ్ని. ‘‘ఒక్క సినిమాపాట పాడరా, వినాలనుంది’’ అని బలవంతం చేసింది పిన్ని. చివరికి పాడక తప్పింది కాదు. కాని రెండు చరణాలు పాడానో లేదో, పిన్ని పాట తలపుకు వచ్చి, సిగ్గుపడి ఆపేశాను. ఆమె పాడిన కృతులు సముద్రమంత విశాలమూ, అగాధమూ అయినవి. నా పాటలు పిల్లకాలవల్లాంటివి. పిల్లకాలవల్లో సౌందర్యం లేకపోలేదు. కాని సముద్రం ముందు కాదు వాటి దర్పం.
 
మా పిన్ని చామనచాయగా వున్నా, కళా కాంతీ ఉట్టిపడే ముఖం. ఎక్కడో దూరాలకు చూస్తున్నట్టుగా ఉండేవి ఆమె విశాలమైన కోలకళ్లు. నిదానంగా నడిచేది. మాట కూడా నిదానంగా, సౌమ్యంగా ఉండేది. ఆమెకి కోపం రావటం గాని, తొందర పడటం గాని నేనెప్పుడూ చూడలేదు. ఆమె వ్యక్తిత్వంలోని గొప్పతనమంతా ఆమె సంగీతంలో ప్రతిఫలించేది. ఆమె నా కంటే రెండేళ్లు చిన్నది కావటం వల్లనేమో మొదట్లో ‘‘పిన్నీ’’ అని పిలుస్తుంటే ఏమిటోగా వుండేది. కాని ఆమె పాట విన్నప్పుడల్లా ఆమె దగ్గిర చంటిపిల్లాడి వలె అయిపోయేవాణ్ని.
 
ఎప్పుడూ మేమిద్దరం కలిసి తిరిగేవాళ్లం. మా దొడ్లో జామచెట్టెక్కి ఆమెకి పళ్లు కోసిపెట్టేవాణ్ని. సెలవులికి వచ్చినప్పుడల్లా ఏవో కథల పత్రికలూ, నవలలు తెచ్చి చదివించే వాణ్ని. కొత్తగా చూసిన సినిమా కథలు, పాటలు వినిపించేవాణ్ని. నాకు ఆమె కృతులు నేర్పేటట్టు, నేనామెకి సినిమా పాటలు నేర్పేటట్టు ఒడంబడిక చేసుకున్నాం. కాని నాకు ఆ స్వరాలు నోరు తిరిగేవే కావు. ఆమె నా సినిమా పాటల్ని ఎంత నేర్చుకున్నా ఎక్కడో కర్ణాటక బాణీ దొర్లేది. దాంతో మా ఒడంబడిక రద్దు చేసుకున్నాం.
   
ఒక పల్లెటూరి సంబంధం వెదికి మా పిన్నికి పెళ్లి చేశారు. అత్తవారు చాలా భాగ్యవంతులు. భర్తకి పాతికేళ్లుంటాయి. కొత్తగా కరిణీకంలో ప్రవేశించాడు. సాంప్రదాయం గల కుటుంబమనీ, డబ్బున్నవాళ్లనీ మా తాతగారు ఆ సంబంధం చేశారు. లలిత పిన్ని ఆ మారుమూల పల్లెటూరికి కాపరానికి వెళ్లిపోయింది. వెళ్లిన కొత్తలో ఆమెని అత్తవారు మూడు నాలుగుసార్లు పుట్టింటికి పంపించారు గాని, తరవాత క్రమంగా మానివేశారు. నేనొకసారి కాలేజీ నుంచి పెద్ద ఉత్తరం రాశా.

‘‘పిన్నీ! నీ సంగీతం ఎప్పటికీ మర్చిపోలేను; నీ కంఠం లాంటి కంఠం నాకు మళ్లీ వినబడలేదు. నువ్వు నా ఆరాధ్య దేవతవి,’’ అని. ఆ కవర్లోనే నా అడ్రసు రాసి మరో కవరు కూడా వుంచాను, ఆమె సమాధానం రాయటానికి పనికొస్తుంది గదా అని. సమాధానం రాయలేదు.
 నాలుగైదేళ్ల తరవాత గావును, మా అమ్మ చెప్పింది పిన్ని సంగతి.
 ‘‘విన్నా వురా? లలితమ్మని దాని అత్తారు నానా బాధా పెడుతున్నారుట.’’
 ‘‘ఏం’’ అన్నాను ఆశ్చర్యపోయి.
 
‘‘ఏమో మరీ. కొత్తలో బాగానే చూశారు. తరవాత వాళ్లకేం పొయ్యేకాలం వచ్చిందో మరి? పాపం ‘లలితమ్మ ఆ లంకలో ఎన్ని కష్టాలు పడుతున్నదో?’’
 ‘‘నేనోసారి వెళ్లి చూసొస్తానే, అమ్మా! లలిత పిన్నిని చూసి చాలా ఏళ్లయింది.’’
 ‘‘సరేలే. వాళ్లసలే దానిపై లేనిపోని అపనిందలు మోసి హింసపెడుతున్నారు. వీళ్ల అనుమానాలూ, వీళ్లూ విరగడై పోనూ,’’ అని లోపలికి వెళ్లిపోయింది.
 
లలిత పిన్నిని చూసి ఎన్నేళ్లయింది? ఆమె నా ప్రపంచానికి ఎంత దూరమై పోయింది? ఎప్పుడో విని మరిచిపోయిన ఆమె మధుర కంఠపు జ్ఞాపకం ఇప్పటికీ నన్నెందుకల్లా ఆరాటపెడుతుంది?
 ఆమె పెళ్లి జరుగుతున్నప్పుడు నేను తీవ్రంగా గాయపడ్డాను. నన్ను లోక మంతా వంచించినట్టు, నాకొక్కడికే చెందిన ఒక అమూల్య వస్తువును ఎవరో దొంగిలించినట్టు ఆవేదనపడ్డాను. ఆమె అత్తవారింటికి వెళ్లిన తర్వాత నా జీవి తంలో గొప్ప వెలితి ఏర్పడ్డట్టు బాధ పడ్డాను.
 
అది వైశాఖ మాసం. నాకు మావాళ్లు పెళ్లి నిశ్చయపరిచారు. బంధువులందరికీ శుభలేఖలు పోస్టు చేశాము. లలిత పిన్ని ప్రసక్తి వచ్చింది. ‘‘నేను వెళ్లి పిన్నిని తీసుకువస్తానమ్మా’’ అన్నాను మా అమ్మతో. ‘‘ఎందుకురా వెళ్లటం? వాళ్లు పంపిస్తారా, ఏమన్నానా? శుభలేఖ వేస్తే సరిపోతుంది,’’ అన్నది మా అమ్మ.
 
వాళ్లామెని పంపిస్తారని నాకు ఏకోశానా నమ్మకం లేదు. కాని యీ వంకతో వెళ్లి పిన్నిని చూసినట్టవుతుంది కదా అని నా ఉద్దేశ్యం. మా అమ్మని వొప్పించి లలిత పిన్నిని పిలుచుకు రావటానికి బయల్దేరాను. మా తాతయ్యా, నేనూ కలిసి వెళ్లాం. లలిత పిన్ని అత్తారూరు ఆ మర్నాటి మధ్యాహ్నానికి చేరుకున్నాం. ఎండ  తీవ్రంగా ఉంది. వడగాలి ఆ చెవి నుండి ఈ చెవికి రివ్వున కొడుతోంది. ఆ పల్లె టూరి వీధుల్లో ఆ మధ్యాహ్న వేళ పిట్ట యినా తిరగటం లేదు. నాగరిక ప్రపంచానికి ఎటు చూసినా యాభైమైళ్ల దూరంలో వున్న ఆ గ్రామపు దృశ్యం నాకు చెప్పలేని దిగులు పుట్టించింది. ఈ వూళ్లో లలిత పిన్ని యిన్నాళ్లూ ఎలా నివసించ గలిగిందా, ఆమె నిశ్చలమైన చూపులు ఇంకా అలానే అందరాని దూరాలకు చూస్తూనే వుంటాయా, అనిపించింది.
 
వెళ్లగానే లలిత పిన్ని మొగుడు వాకిట్లో కనిపించాడు. కోరమీసాలు, నీరుకావి బట్టలు, నోట్లో చుట్ట అంతా పల్లెటూరి వాలకం. ముప్పయేళ్ల మనిషైనా నలభై ఏళ్ల వాడిలా వున్నాడు. మామగార్ని చూడగానే ఆశ్చర్యం కనబరిచాడు.
 ‘‘అమ్మా! మామగారొచ్చారు. కాళ్లు కడుక్కోటానికి రెండు చెంబుల్తో నీళ్లు తీసుకురా,’’ అని కేకేశాడు నాకేసి తేరిపార చూస్తూ. ‘‘కొంచెం పనుంది, వెళ్లి వస్తాను,’’ అని మళ్లీ నాకేసి ఒకసారి చురచుర చూసి వెళ్లిపోయాడు.
 
‘‘అంతా క్షేమమా?’’ అని పిన్ని అత్త గారిని మా తాతయ్య కుశల ప్రశ్న వేశాడు. నన్ను ఫలానా అని తెలియజేశాడు.
 ‘‘ఆ పెళ్లప్పుడు చూశాగా యీ అబ్బా యిని!’’ అని మూతి తిప్పుకుంటూ అన్న దావిడ. ఇంతలో అయిదేళ్ల మగపిల్లా డొకడూ, మూడేళ్ల ఆడపిల్లా అక్కడికి వచ్చారు. తాతయ్య వాళ్లని దగ్గరికి తీసు కుని, ‘‘వీళ్లనెప్పుడన్నా చూశావురా?’’ అని నన్నడిగాడు.
 ‘‘చూడలేదు. లలిత పిన్ని పిల్లలేనా?’’
 ‘‘ఊ. మరింకెవ రనుకున్నావ్?’’.
 నిజానికి ఆ పిల్లలెవరో, నేనెవరో? వాళ్లకీ నాకూ ఏమిటి సంబంధం? వాళ్లకేసి చూస్తుంటే వెయ్యామడల దూరంలో నుంచున్నట్టుగా కనిపించారు.
 
ఇంతలో లోపల నుండి ఒకామె వచ్చింది, చంకలో చంటిపిల్లని వేసుకుని.
 ‘‘ఏం నాన్నా ఎప్పుడొచ్చావు? అంతా కులాసానా? ఏమయ్యోవ్ నువ్వేనా? పెద్దవాడివయ్యావే? జ్ఞాపకమున్నానా?’’
 ‘‘అహ, జ్ఞాపకం లేకేం?’’ అన్నాను.
 కాని ఆమె ఎవరు? మొహాన ముడ తలు, లోతుకుపోయిన కళ్లు, వాటి కింద నల్లటి చారలు, కుంగిపోయిన బుజాలు, పుల్లల్లాంటి కాళ్లు ఎత్తెత్తి వేసుకుంటూ... నా లలిత పిన్నేనా ఈమె? ఏడేళ్ల నించీ ఏ స్త్రీ రూపం నా మనస్సులో నిరంతరం నటించిందో ఆ లలిత పిన్నేనా ఈమె?
 
పూర్వపు లలిత పిన్ని ఎంత గుర్తుకు తెచ్చుకున్నా జ్ఞాపకం రావటం లేదు. ఆమె చంకలోని చంటిపిల్ల కొత్తవాళ్లని చూసి కాబోలు కావురుమంది. అప్పటికి నేను తెప్పరిల్లాను.
 ‘‘అదేమిటే అమ్మాయ్! మరీ అంత నీరసించిపోయావ్?’’ అంటున్నాడు తాతయ్య. ‘‘అబ్బే. ఏం లేదు, నాన్నా!’’ అన్నదామె.
 ‘‘ఏమీ లేకపోవటమేమిటి? కిందటి సారి నేను చూసినప్పటి కంటే బాగా చిక్కావ్, వంట్లో బాగుండలేదా?’’ అన్నాడు తాతయ్య. రెండు కన్నీటిబొట్లు ఆయన కళ్ల చివరదాకా వచ్చి ఆగిపోవటం చూశాను నేను.
 
‘‘ఏమోనండి! మీ పిల్ల వట్టి రోగిష్టి మనిషి,’’ అని ఇంకేదో సణుక్కుంటూ అత్తగారు లోపలికెళ్లిపోయింది.
 నేనూ, తాతయ్యా దొడ్లో నూతి దగ్గర స్నానాలు చేశాం. పిన్ని అప్పటికప్పుడు మడికట్టుకుని మాకోసం వంట చేసింది. భోజనాల దగ్గిర ఎవ్వరం మాట్టాడలేదు. తరవాత పిన్ని ఆకు వక్క చుట్టి నాకూ, తాతయ్యకి యిచ్చింది. ప్రయాణ బడలిక మీద వున్నామేమో, వసారాలో మంచాల మీద వళ్లు వాల్చామో లేదో సుఖమైన నిద్రపట్టింది.
 ఆ రాత్రి భోజనాల దగ్గిర తాతయ్య మేము వచ్చిన సంగతి చెప్పాడు.

నా పెళ్లికి అందర్నీ రమ్మని అడిగాడు. ‘‘మాకెక్కడ వీలు కుదురుతుందీ రావటానికి’’ అన్నది అత్తగారు. ‘‘పోనీ లలిత పిన్నినైనా పంపించండి. పెళ్లి కాగానే ఎవరమన్నా వచ్చి దిగబెడతాము,’’ అన్నాను నేను.
 ‘‘ఆ, అదెక్కడ వస్తుందిలే. జబ్బు మనిషి, చంటిపిల్ల తల్లి’’ అందావిడ.
 
తలుపుచాటునే నుంచుని వుంది పిన్ని. ‘‘అట్టే రోజులుండను, అత్తయ్యా! పెళ్లి అయిన వెంటనే వచ్చేస్తాను. మా అక్కయ్యని, పిల్లల్ని చూసి చాలా ఏళ్లయింది,’’ అన్నది బెరుకుగా.
 ‘‘ఊ, వెడతావు. నీ పాడుమొహం పెట్టుకుని అక్కడికి వెళ్లకపోతే వచ్చిన నష్టమేమీ లేదులే. చూశావుగా నువ్విన్నాళ్లూ కలవరిస్తున్న మీ అక్కయ్య కొడుకుని,’’ అని కసిరాడు పిన్ని మొగుడు.
 పక్కన పెద్దవాడు, మామగారు ఉన్నా రనైనా ఆలోచన లేకుండా ఆ మాటలన్న వాడిని పీటపెట్టి నెత్తి పగలగొడదామా అన్నంత కోపం వచ్చింది.

అన్నం దగ్గిర్నించి లేచిపోవాలనిపించింది. మా తాతయ్య ‘శాంతించ’మన్నట్టు నాకేసి చూశాడు. పిన్ని తలుపుచాటు నించి అవతలకి వెళ్లిపోయిన చప్పుడు వినిపించింది.
 భోజనాలు అయినాయో లేదో పిన్ని మొగుడు చెప్పులు తొడుక్కుని కర్ర పట్టుకుని ఎక్కడికో వెళ్లిపోయాడు. పిన్ని నాకూ తాతయ్యకీ దక్షిణపు వేపున మల్లె పందిరి కింద పక్కలు వేసింది. తాతయ్య వీధి అరుగుమీద చుట్ట కాలుస్తూ మా బండి తోలుకొచ్చిన వెంకన్నతో మాట్టాడు తున్నాడు. నేను పందిరి కింద మంచం మీద పడుకుని, ఎర్రగా నిప్పుముద్దలా ఉదయిస్తున్న తదియ చంద్రుణ్ని చూస్తున్నాను.

మల్లెచెట్టు విరగబూసింది. కన్నీటిబొట్లలా అప్పుడప్పుడు బాగా విచ్చిన పువ్వులు నామీద రాలుతున్నాయి. మరచెంబులో నీళ్లు తీసుకుని పిన్ని వచ్చింది. తలవేపున చెంబు పెట్టి తాతయ్య మంచంమీద కూర్చుంది. ‘‘పిన్నీ! నువ్వు వచ్చేసెయ్యి. వీళ్లేమన్నా సరే, నేను తీసుకువెళ్లదలుచుకున్నాను,’’ అన్నాను. ‘‘ఎలా రమ్మంటావయ్యా, వాళ్లు వద్దంటూంటే? పట్టుకు లాక్కెళతావా?’’ అన్నది నీరసంగా, రాని నవ్వు తెప్పించుకుని.
 
‘‘పిన్నీ! ఎందుకిలాగైపోయావ్ నువ్వు?’’
 ‘‘ఏం చేస్తాను, నా ఖర్మ! ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో యీ యింట్లో పడ్డాను.’’
 ‘‘కాదు, పిన్నీ! ఇది నీ పాపం కాదు. దీనికి బాధ్యత పూర్తిగా తాతయ్యదే.’’
 ‘‘ఆయన తప్పేముంది? పెళ్లి చేసి నప్పుడు కలగన్నాడా, వీళ్లిట్లాంటివాళ్లని.’’
 ‘‘నువ్వు ఇంకా సంగీతం పాడుతున్నావా పిన్నీ!’’
 ఈ ప్రశ్న వినగానే ఆమె మొహం మరోవైపుకి తిప్పింది. ఆ గుడ్డి వెన్నెల్లో ఆమె బొటబొట కన్నీళ్లు కార్చటం కనిపించింది.

 ‘‘ఎందుకేడుస్తున్నావు పిన్నీ!’’
 ఆమెకి దుఃఖం వచ్చింది. వెక్కివెక్కి బిగ్గరగా ఏడ్వసాగింది. ‘‘ఊరుకో, పిన్నీ! ఇంట్లోవాళ్లు వింటారు,’’ అన్నాను, నా కళ్లనీళ్లు తుడుచుకుంటూ.
 ఆమె ఏడుపునాపింది కాస్సేపటికి - ‘‘ఇన్నేళ్లలోనూ నన్నీ ప్రశ్న అడిగినవాడివి నువ్వొక్కడివే. అందుచేత ఏడుపునాపు కోలేకపోయాను. నేను ఇక్కడికి కాపరాని కొచ్చేటప్పుడు నా వీణ తెచ్చుకున్నాను. దానిని మా ఆయన విరగ్గొట్టి పారేశారు. పాడుతున్నట్టు వినిపిస్తే గొంతు పిసికి చంపేస్తానన్నారు. ఒకటి రెండుసార్లు నేను పాడుకోబోయాను.

‘ఆ పాటలేమిటే?’ అని మా అత్తగారు నన్ను గదమాయించి పాటలు మానిపించారు’’ అన్నది పిన్ని నిస్పృహగా.
 ‘‘పిన్నీ! ఒక్కమాటడుగుతాను, కోపం రాదుగదా? నీ మీద ఏవో అపనిందలు వేశారుట, నిజమేనా?’’
 ‘‘ఆ, అవన్నీ యిప్పుడెందుకులే?’’
 ‘‘కాదు, చెప్పు పిన్నీ. నిజమేనా?’’
 ‘‘నువ్వు కొత్తలో ఉత్తరం రాశావు చూడు. ఆ ఉత్తరం మా ఆయన చూశారు. దాంతో అనుమానపడి నన్ను నానా మాటలూ అని కొట్టారు. ఆ తరవాత కూడా ఊళ్లోవాళ్లతో లేనిపోనివి కల్పించి బాధపెడుతూనే వున్నారు.

నా బతుకంతా యిలాగే తెల్లవారిపోవలసివుందేమో?’’
 రెండు నిమిషాల సేపు ఎవ్వరం మాట్లాడలేదు. ‘‘నేనా ఉత్తరం రాయటం చాలా తెలివితక్కువే. నా పొరపాటు క్షమిస్తావా, పిన్నీ?’’
 ‘‘ఇందులో నువ్వు తెలిసి చేసిందే ముంది, క్షమించటానికి? అప్పుడు నా పెళ్లిలో నువ్వు అస్తమానమూ నా కూడా తిరిగేవాడివి జ్ఞాపకం వుందా? అప్పుడే మా ఆయన తల్లితో అన్నారట, ‘ఎవరా అబ్బాయి, పోకిరీ మొహం వేసుకుని దాని వెంట తిరుగుతున్నాడు?’ అని.’’
 
‘‘పిన్నీ! నువ్వెంత కాదన్నా, నీ కష్టాలకు కొంతవరకు నేను కూడా కారణమైనట్టు తోస్తున్నది. నిన్నీ నరకంలోనుండి ఎలా రక్షించగలనా, ఏం చేస్తే నీ కష్టాలు గట్టెక్కుతాయా అని వేదనపడుతున్నాను.’’
 ‘‘సర్లే, నువ్వేం చేస్తావు నాకోసం? నువ్వు రేపు లక్షణమైన పిల్లని చేసుకోబోతున్నావు. నువ్వు సుఖంగా వుంటే నాకదే చాలు. ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇలాగే కాలం గడుపుతాను.’’
 ‘‘ఎంత మారిపోయావ్, పిన్నీ! మన చిన్నప్పటి రోజులు తలుచుకుంటే ఏడుపు వస్తున్నది. నీమీద నాకు అంత గౌరవం కలిగించింది నీ సంగీతమే.

నీ కంఠంలో అప్పటి అమృతపు నదులు ఎక్కడ యింకిపోయాయి? అప్పుడు పాడేదానివి, ‘శ్రీరామ పాదమా! నీ కృప చాలునే’ అని అమృతవాహిని రాగంలో ఒక కృతి. జ్ఞాపకం వుందా? ఆ ఒక్క ముక్క అనవూ, వినాలనుంది.’’
 ‘‘సర్లే. ఇప్పుడేమిటి? అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను’’ అన్నదామె.
 ఇంతలోనే అత్తగారు ‘‘ఓ లలితమ్మా! ఎక్కడున్నావమ్మా తల్లీ!’’ అని కేకేసింది. పిడుగుపడ్డట్టు ఉలిక్కిపడ్డాం యిద్దరమూ. పిన్ని లేచి వెళ్లిపోయింది గబగబ, కాళ్లు ఎత్తెత్తి వేసుకుంటూ...
 నాకా రాత్రి నిద్రపట్టనేలేదు.

తెల్లవారుకట్ట ఏ గంటో నిద్రపోయి వుంటాను. లేచేసరికి పక్కమీద ఒత్తుగా మల్లెపువ్వులు రాలి వాడి నలిగిపోయివున్నాయి. అవన్నీ ఏరి పొట్లం కట్టి నా సంచీలో పదిలపరిచాను.
 పొద్దున్నే మొహం కడుక్కుని నేనూ, తాతయ్యా బండి కట్టుకుని తిరుగుముఖం పట్టాము. ముసలాయన ఆ ఒక్కరోజులోనే నెలరోజులు లంకణాలు చేసినవాడల్లే అయిపోయాడు. బండిలోనే కూర్చుని, తల వంచుకుని కుమిలి కుమిలి ఏడ్చాడు.
 
బండి తోలే వెంకన్న అన్నాడు: ‘‘తాతయ్యగోరూ! బంగారబ్బొమ్మలాంటి పిల్లని యీ యెదవ సచ్చినోళ్ల కెల్లాగిచ్చారండీ! మీ యల్లుడి వూసు ఈ వూళ్లో ఎత్తితే సాలు అంతా తిట్టేవాళ్లే. ఒల్లంతా రోగాలేనంట. నా యాలకి,’’ అన్నాడు.
 ‘‘ఒరే, నువ్వూరికే వాగబోకురా. అసలే ఆయన కష్టపడుతున్నాడు,’’ అన్నాను నేను కోపంగా.
 ‘‘నీకేం తెలుసుద్దయ్యా?నేను మీ తాతయ్యగోరింటో యింతప్పట్నించీ పని సేశా. ఆ పిల్ల ఎసుమంటి పిల్లో నాకు తెలవదనా? మాలచ్చిమంటి తల్లి. ఎన్ని కట్టాలు పడుతుండదో ఆళ్ల సేతుల్లో’’ అన్నాడు వెంకన్న. ఆ మాటలు విని తాతయ్య మరీ కుంగిపోయాడు.
   
ఎక్కడ త్యాగరాజకృతి విన్నా నాకు మా లలిత పిన్నే జ్ఞాపకం వొస్తుంది. ఆమె సంగీతం గాని, కంఠం గాని ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుందామన్నా జ్ఞాపకం రావు. పెళ్లికాక ముందు ఎలా వుండేదో కళ్లు చించుకున్నా గుర్తుకు రాదు. కాని చంటిపిల్లని చంకన వేసుకుని ఎత్తెత్తి కాళ్లు వేస్తూ వచ్చి నన్ను పలకరించిన ఆ లలిత పిన్నే జ్ఞాపకం వచ్చి మనస్సును రంపం కోత కోస్తుంది ఇప్పటికీ. ఆమె వ్యక్తిత్వానికి కేంద్రమైన వీణలాగా ఆమె జీవితం కూడా భగ్నవీణ.
- నండూరి రామ్మోహనరావు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement