నీటి బొట్టు | Sakshi
Sakshi News home page

నీటి బొట్టు

Published Fri, Mar 30 2018 12:14 AM

A story of Rajshri Deshpande - Sakshi

గింజ మొలకెత్తడానికి సాగు నీరు లేదు. గొంతు తడవడానికి తాగు నీరు లేదు. గ్రామాల నిండా కరువు పండుతోంది. బతుకులపై గుండె బరువు పెరుగుతోంది. దుక్కి దున్నేందుకు నింగి.. చుక్కను విదల్చలేదు. దప్పిక తీర్చేందుకు ఒక్క చెరువైనా చెమ్మగిల్లలేదు. అప్పుడొచ్చింది ఈ అమ్మాయి. నీటి బొట్టులా వచ్చింది. ఊరిని ఊటబావిలా మార్చింది.

కాలాలు వాటి ధర్మక్రమాన్ని తప్పితే మొదట కష్టాలపాలయ్యేది రైతే. అయినా భూమి తల్లి మంచి చూపు చూడకపోతుందా అనే ఆశతో ఏటా పంటలు వేస్తాడు. పండిన పంట వరదొచ్చి కొట్టుకుపోతే, వరద రాకపోయినా ధర రాకపోతే.. ఆ బాధను దిగమింగుకుని మరో పంటకు రెక్కలను సిద్ధం చేసుకుంటాడు. అంతే తప్ప ఎవరిపైనా ఆగ్రహించడు. అలాంటి రైతు కూడా గొంతు విప్పక తప్పని పరిస్థితులు దాపురించాయి.

ఇటీవల కూడా రైతులు తమ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చెయ్యడానికి వేలాదిమందిగా ముంబై చేరుకున్న సంఘటన దేశాన్ని కదల్చివేసింది. ప్రభుత్వాలు కదిలిన జాడ మాత్రం లేదు. మూడేళ్ల క్రితం.. రైతుల ప్రదర్శనను చూసి బాలీవుడ్‌ నటి రాజశ్రీ దేశ్‌పాండే చలించిపోయారు. రైతుల కష్టాలపై స్పందించారు. ఆ ప్రభావంతో అనేక గ్రామాలలో పర్యటించి, పరిస్థితిని కళ్లారా చూశారు. రైతులను సంఘటితం చేశారు. చెరువులు తవ్వించారు, భూగర్భంలో వాటర్‌ లెవెల్‌ పెంచారు. వట్టి చేతులతో ఒక మహిళ సాధించిన పెద్ద విజయం ఇది!

లక్షతో... లక్ష్యసాధన మొదలైంది
2015లో రాజశ్రీ దేశ్‌పాండే మరఠ్వాడా రీజియన్‌లోని పంధారి గ్రామంలో పర్యటించడం అనుకోకుండా జరిగింది. అక్కడ మంచినీటి కోసం తల మీద బిందెలు పెట్టుకుని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్న మహిళలను చూశారు. అప్పటికే ముంబైలో చూసిన రైతుల ఆందోళన ఆమెను తొలిచేస్తూనే ఉంది. తాత వ్యవసాయం కోసం పడిన కష్టం గుర్తుకు వస్తోంది. ఏదో ఒకటి చేసి తీరాలి అనుకున్నారు ఆమె. ఎంత డబ్బును వాడగలదో ఓ సారి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూసుకున్నారు. లక్ష వరకూ ఉంది!

ఒక్కొక్కరూ వెంట నడిచారు
పని మొదలు పెట్టడానికైతే ఈ లక్ష చాలు అనుకున్నారు రాజశ్రీ. వెనువెంటనే వాటర్‌ ట్యాంకర్లతో పంధారి గ్రామానికి నీటిని సరఫరా చేయించారు. గ్రామస్తులను సమావేశపరిచి, నీటి సమస్యను పరిష్కరించాలంటే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలో చెప్పారు. జల సంరక్షణ గురించి ఆమె చెప్పిన విషయాలను అందరూ విన్నట్టే కనిపించారు.

కానీ ఎవరూ పట్టించుకోలేదని రెండు రోజుల్లోనే అర్థమైంది. మళ్లీ మళ్లీ వారిని కలిశారు. చెప్పిన సంగతులనే మళ్లీ మళ్లీ చెప్పారు. చివరికి మార్పు మొదలైంది. ఒక్కొక్కరుగా ఆమె వెనుక నడవడం మొదలు పెట్టారు. గ్రామస్తులను చైతన్యవంతం చేసే లోపు బాలీవుడ్‌ పరిశ్రమ కదిలివచ్చింది. విరాళాలు వరదలా రాలేదు, కానీ అవసరం తీరేటంత డబ్బు వచ్చింది. గ్రామస్తుల  దాహం తీరడానికి అది చాలనుకున్నారు రాజశ్రీ.

చెరువుల్లోకి వరుణుడు వచ్చేశాడు!
విరాళాలు పోగయ్యాక ప్రొక్లెయిన్లతో పని మొదలు పెట్టించారు రాజశ్రీ.  చెరువులు తవ్వించారు. వర్షపు నీరు నేలలో ఇంకినంత ఇంకిపోగా మిగిలిన నీరు కాలువలుగా పారింది! నీటి వాలులో చిన్న తటాకాలు తవ్వించారు. మానవ ప్రయత్నంలో చిత్తశుద్ధిలోపం ఎక్కడా లేదు. ఇక అందరి ఎదురు చూపూ ప్రకృతి కరుణ కోసమే. వారి ఎదురు చూపు ఫలించింది కూడా. వర్షాకాలం తన ధర్మం తప్పకుండా వాననిచ్చింది. చెరువులు, తటాకాలు, కుంటలు నీటితో నిండిపోయాయి. బావులలో చేతికందేటంత పైకి వచ్చాయి నీళ్లు. రైతులు నాగళ్లను బయటికి తీశారు.

మూడేళ్లు గడిచాయి. పరిసర గ్రామాల వాళ్లు ఇప్పుడు రాజశ్రీ దగ్గరకు వచ్చి, తమ గ్రామానికి కూడా మార్గం చూపించమని కోరుతున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం నేర్పించిన తర్వాత, ఇప్పుడు టాయిలెట్‌ కట్టించుకోవడం మీద చైతన్యం తేబోతున్నారు రాజశ్రీ. సినిమా వాళ్లకు సామాజిక స్పృహ, బాధ్యత కూడా ఉండాలని ఆమె పనిగట్టుకుని చెప్పడం లేదు. పని చేసి చూపిస్తున్నారు.

నీళ్లు లేక నాన్న పొలం అమ్మేశారు
మాది మహారాష్ట్ర, ఔరంగాబాద్‌కు సమీపంలోని భోకర్దాన్‌ గ్రామం. మా పూర్వీకులు రైతులే. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ వ్యవసాయం కూడా చేసేవారు. వ్యవసాయంలో ఉండే కష్టనష్టాలు నాకు బాగా తెలుసు. మేము పత్తి పండించేవాళ్లం. తగినంత నీరు లేక పంటసాగు కష్టమైంది. దాంతో మా నాన్న పొలం అమ్మేసి కుటుంబాన్ని ఔరంగాబాద్‌కు మార్చేశారు.

చిన్న ఉద్యోగంతో ముగ్గురమ్మాయిలను చదివించి పెద్దచేయడానికి ఆయన పడిన కష్టం చిన్నది కాదు. మా గ్రామాల్లో ప్రధాన సమస్య కరువే. ప్రతి ఒక్కరికీ బోర్‌వెల్‌ ఉంది. కానీ నీళ్లే లేవు. నీటిమట్టం ఏడాదికేడాదికీ అడుగుకుపోతోంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా కాపాడుకోవడం, ఆ నీటిని పొదుపుగా  వాడుకోవడమే మార్గం.

రాజశ్రీ దేశ్‌పాండే
రంగస్థల, టీవీ నటి. షార్ట్‌ఫిల్మ్‌లతో కెరీర్‌ మొదలైంది. 2012 నుంచి బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. తొలి సినిమా ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘తలాష్‌’. 2017లో ‘దుర్గ’ అనే వివాదాస్పద చిత్రంతో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. సినిమాల్లో నటించడం కన్నా, రైతు సంక్షేమం కోసం పని చేయడమే తనకు సంతృప్తిని ఇస్తుందని అంటారు ఈ రైతింటి అమ్మాయి.

– మంజీర

Advertisement
Advertisement