ఆ రెండూ కలిస్తే..  కేన్సర్‌ పరార్‌! | Sakshi
Sakshi News home page

ఆ రెండూ కలిస్తే..  కేన్సర్‌ పరార్‌!

Published Mon, Apr 30 2018 12:02 AM

Scientists are aware of the effective treatment of cancer - Sakshi

కేన్సర్‌కు సమర్థమైన చికిత్స కనుక్కునే విషయంలో శాస్త్రవేత్తలు ఇంకో ముందడుగు వేశారు. శరీర రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తూనే ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వైరస్‌లను ఉపయోగించడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధికి చెక్‌ పెట్టవచ్చునని టెక్సాస్, ఒహాయో స్టేట్‌ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన అధ్యయనం చెబుతోంది. ఇలా చేయడం ప్రయోజనకారి కానేకాదన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. ఎందుకంటే.. రోగ నిరోధక వ్యవస్థలో సహజసిద్ధంగా కేన్సర్‌ను ఎదుర్కోగల సామర్థ్యమున్న ఎన్‌కే కణాలు వైరస్‌పై దాడులు చేసేందుకు పరిమితమవుతాయని అనుకునేవారు. అయితే తాజా పరిశోధనలు దీనికి భిన్నమైన ఫలితాలిచ్చాయి.

తగినన్ని ఎన్‌కే కణాలను శరీరం వెలుపలి నుంచి ప్రవేశపెట్టినప్పుడు అవి కేన్సర్‌ కణతులను నాశనం చేయడంతోపాటు కణాలు ఇతర అవయవాలకు విస్తరించకుండా కూడా అడ్డుకున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న భారతీయ సంతతి శాస్త్రవేత్త బల్‌వీన్‌ కౌర్‌ తెలిపారు. ఎన్‌కే కణాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే కేన్సర్‌ కణాల మరణం కూడా అంతే వేగంగా జరుగుతున్నట్లు బల్‌వీన్‌ సైద్ధాంతికంగానే కాకుండా.. ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా కూడా నిర్ధారించుకున్నారు. ఒకవైపు నుంచి కేన్సర్‌ను చంపేయగల వైరస్‌లు దాడి చేస్తూంటే.. ఇంకోవైపు ఎన్‌కే కణాలు కూడా అదే పనిచేస్తూంటాయన్నమాట. కేన్సర్‌పై పోరుకు ఇది సరికొత్త ఆయుధమని.. మరిన్ని పరిశోధనలు నిర్వహించి మానవులపై కూడా ప్రయోగాలు నిర్వహించాల్సి ఉందని బల్‌వీన్‌ చెప్పారు. 

Advertisement
Advertisement